ఇక పన్ను సంస్కరణలపై దృష్టి...
చకచకా విధాన నిర్ణయాలు
* ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆవిష్కరించిన జైట్లీ
న్యూఢిల్లీ: పన్ను సంస్కరణలు, సత్వర నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి ఈ అంశాలు దోహదపడతాయని కూడా అన్నారు. ఫిబ్రవరి 28న లోక్‌సభలో 2015-16 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పన్నుల శాఖ అధికారులకు రాష్ట్రపతి ప్రశంసాపూర్వక జ్ఞాపికలను ఆర్థికమంత్రి అందజేశారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
* పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు గౌరవప్రదంగా వ్యవహరించాలి. అయితే పన్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులను, ఎగవేతలను మాత్రం వదిలేయకూడదు.
* పాలసీ నిర్ణయాల్లో స్థిరత్వ సాధనకు కృషి చేస్తాం. ఈ బాటలో పన్నులు, పాలనా వ్యవస్థల్లో సంస్కరణలకు పెద్దపీట వేస్తాం.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు (ప్రభుత్వానికి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయం- చేసే వ్యయానికి మధ్య వ్యత్యాసం) 4.1% మించి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
* గత వారం రోజులుగా నేను గమనించిన ముఖ్యమైన అంశమేమిటంటే... ఇతర పలుదేశాలతో పోల్చితే భారత్ పలు స్థూల ఆర్థిక అంశాల్లో చక్కటి పురోగతి సాధిస్తోంది.
* దేశ విదేశీ మారక నిల్వలు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగుపడింది.
* అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పోల్చితే మన దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి.
* డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట ధోరణిలో కొనసాగుతోంది. ఈ విషయంలో పలు ప్రపంచ దేశాలను చూసినా భారత్ మెరుగైన స్థితిలో ఉంది.
తయారీ రంగం కీలకం: డీఐపీపీ
ఉపాధి కల్పన, వృద్ధి స్పీడ్‌కు తయారీ రంగం కీలకమని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి కల్పన సవాలును ఎదుర్కొనడంలో రోజుకు 33,000 ఉపాధి అవకాశాల సృష్టి జరగాల్సి ఉందని, ఇదొక సవాలని అన్నారు. ఈ బాటలో దేశానికి ప్రస్తుతం వేలకొద్ది ఫ్లిప్‌కార్ట్‌లు, స్నాప్‌డీల్స్, అంతే స్థాయిలో యువ పారిశ్రామిక వేత్తల అవసరం ఉందని అన్నారు.