న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్‌లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.
‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది.
వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment