houseing
-
సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది. వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది. -
ప్రభుత్వం పునరాలోచించాలి
ముకరంపుర: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారం ముగిసాయి. దీక్షలకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ‘డబుల్ బెడ్రూం’ను ప్రారంభించి అందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోకుండా వారిని తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్నారు. అనంతరం ఏజేసీని కలిసి వినపతి పత్రం సమర్పించారు. సాయంత్రం టీఎన్జీవోలు దీక్షలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి విన్నవించగా 143 మంది ఉద్యోగులను విడతలవారీగా అర్హతలను బట్టి రిక్రూట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సి.హెచ్.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్.శ్రీదేవి, సీహెచ్.రమాదేవి, ఎస్.బాబురావు తదితరులు ఉన్నారు.