వాళ్లేమన్నా చట్టానికి చుట్టాలా..? | Government Offices Not Paid To Taxes In AP | Sakshi
Sakshi News home page

వాళ్లేమన్నా చట్టానికి చుట్టాలా..?

Published Mon, Mar 4 2019 5:51 PM | Last Updated on Mon, Mar 4 2019 5:57 PM

Government Offices Not Paid To Taxes In AP - Sakshi

నిడదవోలు మునిసిపల్‌ కార్యాలయం

సాక్షి, నిడదవోలు: సుబ్బారావుకు రూ.750 కరెంట్‌ బిల్లు వచ్చింది. డబ్బులు లేకపోవడంతో రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లిద్దామని అనుకున్నాడు. కానీ విద్యుత్‌ శాఖ సిబ్బంది వచ్చి నానా హడావుడి చేసి సరఫరా కట్‌ చేశారు. పరీక్ష ఫీజు నిర్ణీత సమయంలో చెల్లించకపోతే ఫైన్‌లు వేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన చలానాలు కట్టకపోతే వాహనాన్ని సీజ్‌ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు.

ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పనిచేసే అధికారులు సామాన్యులకు కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంటారు. కానీ ఆనిబంధనలు వారికి మాత్రం వర్తించవు. మునిసిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏళ్ల తరబడి చెల్లిండం లేదు. పన్ను చెల్లించకపోతే నీటి కుళాయి కనెక్షన్‌ కట్‌ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సామాన్యులకు మునిసిపల్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు సామాన్యులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల గృహాలకు మినహాయింపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. బకాయిలు రూ.లక్షలు దాటుతున్నాయి. అయినా వారిపై వీసమెత్తు చర్యలకైనా సిద్ధపడటం లేదు. 

దరి చేరని లక్ష్యం
నిడదవోలు పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులైన ఆస్థి, ఆదాయ పన్నులు, షాపుల అద్దెలు, వివిధ రూపాల్లో  ప్రకటనలు ద్వారా రావాల్సిన ఆదాయం అంతంత మాత్రంగానే వసూలవుతోంది. పట్టణంలో వివిధ కేటగిరీలకు చెందిన గృహ సముదాయాలు, కమర్షియల్‌ షాపులు, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పురపాలక సంఘానికి 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.26 కోట్లు ఆదాయం పన్నుల రూపంలో రావాల్సి ఉంది. పన్నుల వసూళ్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా  ఇప్పటివరకు రూ.2.05 కోట్లు మాత్రమే  ఖజానాకు చేరాయి.

ఇంకా రూ.1.21 కోట్లు రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం నీటి పన్ను రూ.45 నుంచి  రూ.100లకు  పెంచడంతో పట్టణంలో ఉన్న  5,125 వేల మంచినీటి కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి పన్నుల రూపంలో ఈఏడాది రూ.66 లక్షల ఆదాయం  రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.42  లక్షలు వసూలయ్యాయి. ఏటా సంతమార్కెట్‌ ద్వారా మాత్రమే మునిసిపాలిటీకి పన్నులు సకాలంలో అందుతున్నాయి. పెంచిన ఆస్థి పన్ను ప్రకారం అందరికీ నోటీసులు జారీ చేసినప్పటికీ చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మార్చి నెలాఖరునాటికి పూర్తిస్ధాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికి  అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు.

 పేరుకుపోతున్న బకాయిలు
నిడదవోలు పురపాలక సంఘానికి ఆస్థి, నీటి పన్నులు, ప్రకటనలు, మున్సిపల్‌ షాపులు, కమర్షియల్‌ షాపుల ద్వారానే కాకుంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. పట్టణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు గత ఏడేళ్లుగా పన్నులు చెల్లించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెడ్‌ నోటీసులు జారీ చేశాం
పట్టణంలో భవన యజయానులు, షాపుల యజమానులు ఆస్తి పన్నుతో పాటు నీటిపన్నులు కూడా  చెల్లిస్తే ఈ నెలాఖరు నాటికి 100 శాతం వసూళ్లు పూర్తవుతాయి. పురపాలక సంఘం పరిధిలో అన్ని రకాల పన్నుల వసూళ్లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నాం.  మొండి బకాయిల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేశాం. 
–ఎస్‌. నాగేశ్వరరావు, మున్సిపల్‌ రెవెన్యూ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement