pending amout
-
వేతన బకాయిలు అడిగితే... చెయ్యి నరికేశాడు
రేవా: చేసిన పనికి సక్రమంగా వేతనం చెల్లించమని అడగడమే ఆ అభాగ్యుడి పాపమైంది. మధ్యప్రదేశ్లోని రేవ జిల్లాలోని దోల్మౌ గ్రామంలో గణేష్ మిశ్రా అనే మేస్త్రీ వద్ద నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు బాధితుడు అశోక్ సాకేత్. గణేష్ సక్రమంగా వేతనాలు చెల్లించకుండా ఎంతోకొంత విదిలిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అశోక్ సాకేత్ శనివారం సహచర కూలీతో కలిసి వెళ్లి తమకు రావాల్సిన కూలీ బకాయిలను చెల్లించాలని గట్టిగా నిలదీశాడు. ఫలితంగా వారిమధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేని గణేష్ మిశ్రా, అతని మిత్ర బృందం పదునైన ఆయుధంతో దాడి చేసి అశోక్ సాకేత్ చెయ్యిని నరికివేశారు. అంతేకాకుండా తెగిపడిన చెయ్యిని దాచేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు అశోక్ను రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు అశోక్ చెయ్యిని తిరిగి అతికించారు. అయితే అధిక రక్తస్రావం కావడం మూలంగా బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. -
రైతు చింత!
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతమై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. మొదటి విడతలో అధికారులు చకచకా పనులు చేసి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు అందించారు. రెండోవిడతలోనూ అలాగే అందించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఆన్లైన్ ద్వారా రైతుల ఖతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయాశాఖ అధికారులు రైతుల వద్ద వారి వ్యక్తిగత ఖాతాల వివరాలు తీసుకున్నారు. చాలామందికి అనుకున్న సమయంలోనే డబ్బులు జమ అయ్యాయి. వారిలో కొంతమందికి వివిధ కారణాలతో ఇంకా జమ కాలేదు. దీంతో రైతులు పెట్టుబడి పైసల కోసం రోజు బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అమలులో జాప్యం.. రైతుబంధు పథకం నగదు ఆన్లైన్ జమ నత్తనడకన సాగుతోంది. అక్టోబర్ మాసంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోనగదు జమ చేయాల్సి ఉన్నా నేటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. కానీ ఏ గ్రామానికి వెళ్లి అడిగినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని.. ఎప్పుడు అవుతుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు.. రైతులు పంట పెట్టుబడి సాయంకోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయారు. గత్యంతరం లేక మళ్లీ దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు వడ్డీవ్యాపారుల చేతుల్లో చిక్కి ఆర్థి్థకంగా నష్టపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేల చొప్పున అందించగా, రబీ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడిచింది. డబ్బులు ఖాతాల్లో జమ కానీ రైతులు ఆందోళన చెంది వ్యవసాయ అధికారులను అడిగి వేసారిపోయారు. రేపు.. మాపంటూ కారణాలు చెప్పడంతో చేసేదిలేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించి అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. ఇందుకు సంబం«ధించి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటివరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ ఖాతాల్లో రైతుబంధు నగదు బదిలీ కోసం హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయానికి పంపించారు. అక్కడి అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బుల జమ కోసం ఆన్లైన్ ద్వారా ట్రెజరీకి పంపించారు. ఇప్పటివరకు 2,34,300 మంది రైతులకు రూ.276.34 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 80 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపించినప్పటికీ వాటి వివరాలు సరిగా లేకపోవడం, వివిధ కారణాలతో దాదాపు 1800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాలను మళ్లీ సేకరించి పంపించనున్నారు. ఖాతాల వివరాలు ఇచ్చాం రైతుబంధు పథకం డ బ్బులు ఖాతాలో జ మ అవుతాయంటే వివరాలన్నీ అధికారులకు ఇచ్చాం. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతోంది. అయినా ఇంత వరకు మాకు పంట పెట్టుబడి సాయం రాలేదు. ఇకనైనా సారోళ్లు పట్టిం చుకుని పెట్టుబడి సాయం విడుదల చేయాలి. – జి.లక్ష్మయ్య, రైతు, రామచంద్రాపూర్, మహబూబ్నగర్ రూరల్ త్వరలో జమ చేస్తాం జిల్లాలోని 2,34,300 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.276.34 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్ నంబర్లు ఇవ్వలేదు. వాటి సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తవ్వగానే వీలైనంత త్వరగా మిగిలిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
వాళ్లేమన్నా చట్టానికి చుట్టాలా..?
సాక్షి, నిడదవోలు: సుబ్బారావుకు రూ.750 కరెంట్ బిల్లు వచ్చింది. డబ్బులు లేకపోవడంతో రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లిద్దామని అనుకున్నాడు. కానీ విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి నానా హడావుడి చేసి సరఫరా కట్ చేశారు. పరీక్ష ఫీజు నిర్ణీత సమయంలో చెల్లించకపోతే ఫైన్లు వేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన చలానాలు కట్టకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పనిచేసే అధికారులు సామాన్యులకు కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంటారు. కానీ ఆనిబంధనలు వారికి మాత్రం వర్తించవు. మునిసిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏళ్ల తరబడి చెల్లిండం లేదు. పన్ను చెల్లించకపోతే నీటి కుళాయి కనెక్షన్ కట్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సామాన్యులకు మునిసిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు సామాన్యులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల గృహాలకు మినహాయింపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. బకాయిలు రూ.లక్షలు దాటుతున్నాయి. అయినా వారిపై వీసమెత్తు చర్యలకైనా సిద్ధపడటం లేదు. దరి చేరని లక్ష్యం నిడదవోలు పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులైన ఆస్థి, ఆదాయ పన్నులు, షాపుల అద్దెలు, వివిధ రూపాల్లో ప్రకటనలు ద్వారా రావాల్సిన ఆదాయం అంతంత మాత్రంగానే వసూలవుతోంది. పట్టణంలో వివిధ కేటగిరీలకు చెందిన గృహ సముదాయాలు, కమర్షియల్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పురపాలక సంఘానికి 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.26 కోట్లు ఆదాయం పన్నుల రూపంలో రావాల్సి ఉంది. పన్నుల వసూళ్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.2.05 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ఇంకా రూ.1.21 కోట్లు రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం నీటి పన్ను రూ.45 నుంచి రూ.100లకు పెంచడంతో పట్టణంలో ఉన్న 5,125 వేల మంచినీటి కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి పన్నుల రూపంలో ఈఏడాది రూ.66 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.42 లక్షలు వసూలయ్యాయి. ఏటా సంతమార్కెట్ ద్వారా మాత్రమే మునిసిపాలిటీకి పన్నులు సకాలంలో అందుతున్నాయి. పెంచిన ఆస్థి పన్ను ప్రకారం అందరికీ నోటీసులు జారీ చేసినప్పటికీ చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మార్చి నెలాఖరునాటికి పూర్తిస్ధాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. పేరుకుపోతున్న బకాయిలు నిడదవోలు పురపాలక సంఘానికి ఆస్థి, నీటి పన్నులు, ప్రకటనలు, మున్సిపల్ షాపులు, కమర్షియల్ షాపుల ద్వారానే కాకుంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. పట్టణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు గత ఏడేళ్లుగా పన్నులు చెల్లించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెడ్ నోటీసులు జారీ చేశాం పట్టణంలో భవన యజయానులు, షాపుల యజమానులు ఆస్తి పన్నుతో పాటు నీటిపన్నులు కూడా చెల్లిస్తే ఈ నెలాఖరు నాటికి 100 శాతం వసూళ్లు పూర్తవుతాయి. పురపాలక సంఘం పరిధిలో అన్ని రకాల పన్నుల వసూళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. మొండి బకాయిల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశాం. –ఎస్. నాగేశ్వరరావు, మున్సిపల్ రెవెన్యూ అధికారి -
పన్ను కట్టకుంటే కరెంట్ కట్!
∙బిల్ట్ యాజమాన్యానికి ఎన్పీడీసీఎల్ తరఫున కోర్టు నోటీసులు ∙కార్మికుల కుటుంబాల్లో ఆందోళన మంగపేట : కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ ఎన్పీడీసీఎల్కు బకాయిపడిన సుమారు రూ.11 కోట్ల విద్యుత్ పన్నులో దాదాపు రూ.2.5 కోట్లు తక్షణమే చెల్లించకుంటే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామం టూ ఎన్పీడీసీఎల్ తరఫున సుప్రీం కోర్టు నుంచి బిల్ట్ యాజమాన్యానికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు 2003 నుంచి 2013 మధ్య కాలానికి సంబంధించినవై ఉండొచ్చని కార్మికవర్గాలు చర్చించుకుంటున్నాయి. తమకు విద్యుత్ పన్ను బకాయిలు చెల్లించాల్సిందేనంటూ ఎన్పీడీసీఎల్ హై కోర్టు ద్వారా గత నెలలో పరిశ్రమలకు నోటీసులు పంపించింది. దీని పై అన్ని పరిశ్రమలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని బకాయి పడిన మొత్తం లో 25 శాతం తక్షణమే చెల్లించాలని సర్వోన్నత న్యా యస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు మూడోవారంలో తీర్పు వెలువరించింది. ఈక్రమంలో బిల్ట్ యాజమాన్యానికి నోటీసులు అందడం తో, చెల్లింపునకు రెండు నెలలైనా గడువు ఇవ్వమని కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఫ్యాక్టరీతో పాటు కార్మికులు, ఉద్యోగులు నివసించే అటవీ ప్రాంతంలోని బిల్ట్ కాలనీ చీకటిలో మగ్గాల్సి వస్తుంది. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకుండాపోతుంది. ఈనేపథ్యంలో బిల్ట్ జేఏసీ నాయకులు బుధవారం హైదరాబాద్కు వెళ్లి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్లకు సమస్య తీవ్రతను వివరించారు. ఫ్యాక్టరీ మూతపడి 27 నెలలు గడుస్తుండగా 15 నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియజేశారు. దీనిపై బిల్ట్ డీజీఎం కేశవరెడ్డిని వివరణకోరగా ‘నోటీసులు వచ్చిన విషయం వాస్తవమే. నెల క్రితం హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వచ్చిన నోటీసులలో ఏముందనేది పూర్తిగా తెలియదు’ అని పేర్కొన్నారు.