- ∙బిల్ట్ యాజమాన్యానికి ఎన్‌పీడీసీఎల్ తరఫున కోర్టు నోటీసులు
- ∙కార్మికుల కుటుంబాల్లో ఆందోళన
పన్ను కట్టకుంటే కరెంట్ కట్!
Published Thu, Sep 1 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
మంగపేట : కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ ఎన్‌పీడీసీఎల్‌కు బకాయిపడిన సుమారు రూ.11 కోట్ల విద్యుత్ పన్నులో దాదాపు రూ.2.5 కోట్లు తక్షణమే చెల్లించకుంటే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామం టూ ఎన్‌పీడీసీఎల్ తరఫున సుప్రీం కోర్టు నుంచి బిల్ట్ యాజమాన్యానికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు 2003 నుంచి 2013 మధ్య కాలానికి సంబంధించినవై ఉండొచ్చని కార్మికవర్గాలు చర్చించుకుంటున్నాయి. తమకు విద్యుత్ పన్ను బకాయిలు చెల్లించాల్సిందేనంటూ ఎన్‌పీడీసీఎల్ హై కోర్టు ద్వారా గత నెలలో పరిశ్రమలకు నోటీసులు పంపించింది. దీని పై అన్ని పరిశ్రమలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని బకాయి పడిన మొత్తం లో 25 శాతం తక్షణమే చెల్లించాలని సర్వోన్నత న్యా యస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు మూడోవారంలో తీర్పు వెలువరించింది. ఈక్రమంలో బిల్ట్ యాజమాన్యానికి నోటీసులు అందడం తో, చెల్లింపునకు రెండు నెలలైనా గడువు ఇవ్వమని కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఫ్యాక్టరీతో పాటు కార్మికులు, ఉద్యోగులు నివసించే అటవీ ప్రాంతంలోని బిల్ట్ కాలనీ చీకటిలో మగ్గాల్సి వస్తుంది. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకుండాపోతుంది.
ఈనేపథ్యంలో బిల్ట్ జేఏసీ నాయకులు బుధవారం హైదరాబాద్‌కు వెళ్లి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌లకు సమస్య తీవ్రతను వివరించారు. ఫ్యాక్టరీ మూతపడి 27 నెలలు గడుస్తుండగా 15 నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియజేశారు. దీనిపై బిల్ట్ డీజీఎం కేశవరెడ్డిని వివరణకోరగా ‘నోటీసులు వచ్చిన విషయం వాస్తవమే. నెల క్రితం హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వచ్చిన నోటీసులలో ఏముందనేది పూర్తిగా తెలియదు’ అని పేర్కొన్నారు.
Advertisement