రేవా: చేసిన పనికి సక్రమంగా వేతనం చెల్లించమని అడగడమే ఆ అభాగ్యుడి పాపమైంది. మధ్యప్రదేశ్‌లోని రేవ జిల్లాలోని దోల్‌మౌ గ్రామంలో గణేష్ మిశ్రా అనే మేస్త్రీ వద్ద నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు బాధితుడు అశోక్ సాకేత్. గణేష్ సక్రమంగా వేతనాలు చెల్లించకుండా ఎంతోకొంత విదిలిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అశోక్ సాకేత్ శనివారం సహచర కూలీతో కలిసి వెళ్లి తమకు రావాల్సిన కూలీ బకాయిలను చెల్లించాలని గట్టిగా నిలదీశాడు. ఫలితంగా వారిమధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేని గణేష్ మిశ్రా, అతని మిత్ర బృందం పదునైన ఆయుధంతో దాడి చేసి అశోక్ సాకేత్ చెయ్యిని నరికివేశారు. అంతేకాకుండా తెగిపడిన చెయ్యిని దాచేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు అశోక్‌ను రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు అశోక్ చెయ్యిని తిరిగి అతికించారు. అయితే అధిక రక్తస్రావం కావడం మూలంగా బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment