ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో యజమానురాలు
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ ముంజేతిని ఆమె పెంపుడు కుక్క కొరికేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సగం తెగిన చేతిని వైద్యులు తిరిగి అతికించారు. తీరప్రాంత టౌన్స్‌విల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో అత్యవసర ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెంటనే ఓ నివాసానికి చేరుకున్నారు.
ఓ ఇంటి బయట మహిళ రక్తం కారుతున్న చేతితో విలవిల్లాడుతుండగా, లోపల ఓ భారీ శునకం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కోపంతో తిరుగుతోంది. దీంతో, వెంటనే పోలీసులు వైద్య సిబ్బందికి కబురు పంపారు. వారొచ్చి బాధితురాలి చేతికి కట్టుకట్టారు. లోపలున్న శునకం నియంత్రణలోకి రాకపోవడంతో నిపుణుల సూచన మేరకు కాల్చి చంపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కుక్క గతంలో తనపైనా కూడా దాడి చేసిందని పొరుగింటి వ్యక్తి చెప్పాడని స్థానిక మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు ఇంతటి ప్రమాదకర స్థాయిలో దాడి చేయడం తన 37 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని సీనియర్ సార్జెంట్ స్కాట్ వారిక్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment