ఇసుక దొరక్క.. ఉపాధి లేక.. కార్మికుల ఆకలి కేకలు | 45 lakh construction workers lost their jobs: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇసుక దొరక్క.. ఉపాధి లేక.. కార్మికుల ఆకలి కేకలు

Published Tue, Oct 8 2024 4:21 AM | Last Updated on Tue, Oct 8 2024 1:11 PM

45 lakh construction workers lost their jobs: Andhra pradesh

రెండున్నర నెలలుగా పనులు నిలిపేసిన భవన యజమానులు, కాంట్రాక్టర్లు

ఉపాధి కోల్పోయిన 45 లక్షల మంది కార్మికులు 

సర్కారు తీరుతో భవన నిర్మాణ, అనుబంధ రంగాలు కుదేలు 

కార్మికుల కుటుంబాలు రోడ్డుపాలు

గతంలో ఇసుక ఆదాయం ప్రభుత్వ ఖజానాకు.. నేడు అలా రాకపోగా మూడు రెట్లు పెరిగిన ధర

అయినా.. బ్లాకులోనూ ఇసుక దొరకని పరిస్థితి.. పనుల్లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు

గతంలో ఆదివారం కూడా పని ఉండేది. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా పని దొరకడం లేదు. రోజూ సెంటర్‌కు వెళ్లి ఎవరైనా కూలికి పిలుస్తారేమోనని ఎదురుచూస్తున్నాం. పిల్లల చదువు కోసం వేరే ఊరి నుంచి విజయవాడకు వచ్చాం. రోజు పనికి వెళితేగానీ పూట గడవదు. పనులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.   – శ్రీనివాస్, సెంట్రింగ్‌ కార్మికుడు, విజయవాడ

‘మేం అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... ఇందుకోసం పెద్దగా చేయాల్సింది కూడా ఏమీలేదు.. ఉచిత ఇసుక ఇస్తే చాలు... రోజూ పెద్ద ఎత్తున పనులు జరుగుతాయి. ప్రజల ఆదాయం పెరుగుతుంది...’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఉచిత ఇసుకను ప్రచారానికే పరిమితం చేశారు. రాష్ట్రంలో ఇసుకను ‘తమ్ముళ్ల’కు ఆదాయ వనరుగా మార్చేశారు.

భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి ఉరి వేశారు. ఒకవైపు ఇసుకను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించుకుని ‘తమ్ముళ్లు’ తమ సంపదను పెంచుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పనుల్లేక పస్తులు ఉంటున్నారు. అదేవిధంగా గతంలో ఇసుకపై ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఇప్పుడు అలా రాకపోగా ధర మూడు రెట్లు పెరిగింది. ఆ రేటుకు కూడా బ్లాక్‌లో దొరకని పరిస్థితి  నెలకొంది.  

సాక్షి, అమరావతి: విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ భవన నిర్మాణ కార్మికులకు అడ్డా. ఉదయం ఆరు గంటలకే తలకు కండువా చుట్టుకుని, క్యారేజీ పట్టుకుని వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి చేరుకుంటారు. మేస్త్రీలు, కాంట్రాక్టర్లు వచ్చి కూలీలను పనికి తీసుకువెళతారు. ఉదయం తొమ్మిది గంటల్లోపే ఆ ప్రాంతం ఖాళీ అవుతుంది. కానీ.. రెండున్నర నెలలుగా అక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పని కోసం కూలీలు పడిగాపులు పడుతున్నారు.

అటుగా బైక్, కారుపై వెళ్లేవారు ఒక్క క్షణం ఆగితే... వారి వద్దకు పరుగున వెళ్లి ‘సార్‌... ఏదైనా పని ఉంటే చెప్పండి... ఎంతో కొంత ఇద్దురుగానీ..’ అని వేడుకుంటున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి ఎవరూ పనికి పిలవకపోవడంతో ఉపాధి లేక ఉసూరుమంటూ ఇంటి ముఖం పడుతున్నారు. విజయవాడలోని రామవరప్పాడు వంతెన, చిట్టినగర్‌ సెంటర్‌... గుంటూరులో గాంధీ పార్క్, లాడ్జి సెంటర్‌... విశాఖపట్నంలోని ఇసుకతోట, పూర్ణా మార్కెట్‌ జంక్షన్, ఎన్‌ఏడీ జంక్షన్‌.. నెల్లూరులోని కొండాయిపాలెంగేటు... అనంతపురంలోని రామ్‌నగర్‌ రైల్వేగేటు సెంటర్‌... ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూలీలు పని కోసం పలు అడ్డాల్లో ఎదురు చూస్తూ అల్లాడిపోతున్నారు. ఎవరిని కదిలించినా రెండున్నర నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణాలు నిలిపివేశారు... మాకు పని దొరకడంలేదు.. అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు చౌడాడ 
వెంకటరమణ. సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా పాలకొండ. తమ ఊరిలో ఉపాధి లేక భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పదేళ్ల కిందట విశాఖపట్నం వచ్చేశాడు. గాజువాక పరిధిలోని దయాల్‌నగర్‌లో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో పిల్లలను చదివిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర నెలలుగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, పని దొరకడం లేదని వెంకటరమణ తెలిపారు. రోజూ ఉదయం మేస్త్రీల వద్దకు వెళ్లి రెండు గంటలు కూర్చుంటున్నానని, ఎక్కడా పని లేదని చెబుతుండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నానని, ఆరి్థకంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పనులు లేక తాను, తన భార్య ఒకపూట పస్తు ఉండాల్సి వస్తోందని, తమ భవిష్యత్‌ ఏమిటో అర్థం కావడం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తంచేశారు.  

‘తమ్ముళ్ల’కు కాసులు.. కార్మికులకు కష్టాలు  
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా ముందుచూపుతో 80 లక్షల టన్నులు నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే 40 లక్షల టన్నుల ఇసుకను ఆయా పార్టీల నేతలు ఊడ్చేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఉచితం పేరుతో అధిక ధరలకు విక్రయించారు. దాదాపు రెండున్నర నెలలుగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతోంది. అంత ధర చెల్లించి ఇసుక కొనుగోలు చేయలేక భవన యజమానులు, కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు.

ఒక ట్రాక్టర్‌ ఇసుక దొరికినా పూర్తయ్యే పనులు కూడా ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న తాపీ మేస్త్రీలు, కూలీలతోపాటు అనుబంధంగా ఇటుకల తయారీ, సెంట్రింగ్, రాడ్‌ బెండింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, పెయింటింగ్, సీలింగ్, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్‌ తదితర 36 రకాల విభాగాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండాపోయింది. భవన నిర్మాణ, అనుబంధ రంగాలపై ఆధారపడి మన రాష్ట్రానికి చెందిన సుమారు 31 లక్షల మంది జీవనం సాగిస్తుండగా.. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి మరో 14 లక్షల మంది ఈ పనుల కోసం వలస వచ్చారు. మొత్తం 45 లక్షల మంది కూటమి ప్రభుత్వ తీరుతో జీవనోపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి.  

జీవనాధారం కరువు  
నేను రోజూ తాపీ పనులకు వెళితేనే మా ఇల్లు గడుస్తుంది. రోజువారి కూలీతో భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభ్యత బాగుండటంతో వారం రోజులు పని ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటున్నారు. కానీ కైకలూరు నియోజకవర్గానికి రాజమండ్రి, విజయవాడ, భద్రాచలం వంటి ప్రాంతాల నుంచి ఇసుక రావాలి. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఇసుక రావడం లేదు. దీనివల్ల మాలాంటి  కార్మికులకు జీవనాధారం కరువైంది.   – కోమటి శ్యామ్‌ప్రసాద్, పెరికెగూడెం, ఏలూరు జిల్లా  

ఇళ్లలో పనికి పోతున్నా 
గతంలో రోజూ భవన నిర్మాణ పనులకు వెళ్లేదానిని. రెండు నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇక పిల్లల కోసమైనా కష్టపడి ఏదో ఒక పని చేయాలి కదా... చివరికి ఏ పనీ దొరక్క ఇళ్లలో పాచిపని చేయడానికి వెళుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి ఏ రోజూ లేదు. – సరోజని, నెల్లూరు 

కొరత తీవ్రంగా ఉంది 
ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా అమలు కావడంలేదు. దీనివల్ల ఇసుక కొరత తీవ్రంగా ఉంది. భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలి.                – మామిడి రాము, క్రెడాయ్‌ గుంటూరు చాప్టర్‌ అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement