మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతమై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. మొదటి విడతలో అధికారులు చకచకా పనులు చేసి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు అందించారు. రెండోవిడతలోనూ అలాగే అందించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయాశాఖ అధికారులు రైతుల వద్ద వారి వ్యక్తిగత ఖాతాల వివరాలు తీసుకున్నారు. చాలామందికి అనుకున్న సమయంలోనే డబ్బులు జమ అయ్యాయి. వారిలో కొంతమందికి వివిధ కారణాలతో ఇంకా జమ కాలేదు. దీంతో రైతులు పెట్టుబడి పైసల కోసం రోజు బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అమలులో జాప్యం..
రైతుబంధు పథకం నగదు ఆన్‌లైన్ జమ నత్తనడకన సాగుతోంది. అక్టోబర్ మాసంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోనగదు జమ చేయాల్సి ఉన్నా నేటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. కానీ ఏ గ్రామానికి వెళ్లి అడిగినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని.. ఎప్పుడు అవుతుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మళ్లీ వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు..
రైతులు పంట పెట్టుబడి సాయంకోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయారు. గత్యంతరం లేక మళ్లీ దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు వడ్డీవ్యాపారుల చేతుల్లో చిక్కి ఆర్థి్థకంగా నష్టపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేల చొప్పున అందించగా, రబీ సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడిచింది. డబ్బులు ఖాతాల్లో జమ కానీ రైతులు ఆందోళన చెంది వ్యవసాయ అధికారులను అడిగి వేసారిపోయారు. రేపు.. మాపంటూ కారణాలు చెప్పడంతో చేసేదిలేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు.
రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు
జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించి అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. ఇందుకు సంబం«ధించి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటివరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఈ ఖాతాల్లో రైతుబంధు నగదు బదిలీ కోసం హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయానికి పంపించారు. అక్కడి అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బుల జమ కోసం ఆన్‌లైన్ ద్వారా ట్రెజరీకి పంపించారు.
ఇప్పటివరకు 2,34,300 మంది రైతులకు రూ.276.34 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 80 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపించినప్పటికీ వాటి వివరాలు సరిగా లేకపోవడం, వివిధ కారణాలతో దాదాపు 1800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాలను మళ్లీ సేకరించి పంపించనున్నారు.
ఖాతాల వివరాలు ఇచ్చాం
రైతుబంధు పథకం డ బ్బులు ఖాతాలో జ మ అవుతాయంటే వివరాలన్నీ అధికారులకు ఇచ్చాం. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అవుతోంది. అయినా ఇంత వరకు మాకు పంట పెట్టుబడి సాయం రాలేదు. ఇకనైనా సారోళ్లు పట్టిం చుకుని పెట్టుబడి సాయం విడుదల చేయాలి. – జి.లక్ష్మయ్య, రైతు, రామచంద్రాపూర్, మహబూబ్‌నగర్ రూరల్
త్వరలో జమ చేస్తాం
జిల్లాలోని 2,34,300 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.276.34 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్ నంబర్లు ఇవ్వలేదు. వాటి సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తవ్వగానే వీలైనంత త్వరగా మిగిలిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment