ఖాతాల తిప్పలు! | Rythu Bandhu Scheme Farmers Bank Account Problems Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఖాతాల తిప్పలు!

Published Wed, Oct 10 2018 9:00 AM | Last Updated on Wed, Oct 10 2018 9:00 AM

Rythu Bandhu Scheme Farmers Bank Account Problems Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రైతులకు పెట్టుబడి సాయం కోసం ఆర్థిక సాయం అందించే రైతుబంధు పథకానికి ఖాతాల చిక్కొచ్చి పడింది. ప్రభుత్వం గత ఖరీఫ్‌లో పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో అందజేసిన విషయం విదితమే. ఈ మేరకు రానున్న రబీలో కూడా అందజేయాలని భావించగా... కేంద్ర ఎన్నికల సంఘం ఖాతాల్లో జమ చేసేందుకు మాత్రమే అంగీకరించింది. దీంతో పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రైతుల బ్యాంకు ఖాతాలను గుర్తించే విషయంలో అధికారుల పని ముందుకు సాగ డం లేదు. ఈ నిబంధనను అధిగమించేందుకు మనుగడలో ఉన్న ఖాతాల వివరాలు సేకరించేందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు బుధవారం నుంచి మరోసారి రైతు ల ఇళ్ల తలుపు తట్టనున్నారు.
 
కొనసాగుతున్నాయా? 
రైతుబంధు చెల్లింపుల్లో ఖాతాల విషయం అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఎన్నికల వేళ రైతుబంధు పథకంపై సందిగ్ధం నెలకొనగా.. చివరకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం తెలిసిందే. పథకం కొనసాగింపునకు అడ్డు చెప్పనప్పటికీరైతులకు చెక్కుల రూపంలో కాకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయాలని ఎన్నికల సంఘం షరతు విధించింది. రైతుబంధు పథకాన్ని రెండో విడత ప్రారంభించేందుకు ఇప్పటికే చెక్కులు సిద్ధం చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల సం ఘం ఆదేశంతో బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించా రు. కాగా బ్యాంక్‌ ఖాతాల్లో నాన్‌ ఆపరేటింగ్‌ సమ స్య ప్రస్తుతం అధికారులకు అడ్డంకిగా మారింది.

3,40,674 మంది పట్టాదారులు 
జిల్లాలో రైతుబంధు పథకం కింద ప్రభుత్వం 3,40,674 మంది పట్టాదారులు ఉండగా రూ.305 కోట్లు చెల్లించనుంది. దీనికోసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 2.92 లక్షల చెక్కులు తయారు చేసి పంపిణీకి సిద్ధంగా పెట్టుకున్నారు. ఇదే సమ యంలో ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు రావ డంతో చెక్కులకు బదులు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు బ్యాంకు ఖాతాల పరిశీలన చేపట్టారు. ముం దుగా ప్రకటించిన లబ్ధిదారులు, నగదులో మార్పు లేకున్నా బ్యాంక్‌ ఖాతాలే సమస్యగా మారింది.

ఏడాది క్రితం రైతు సమగ్ర సర్వే, రైతుబంధు పథకం అమలుల్లో భాగంగా అధికారులు రైతుల బ్యాం కు ఖాతాలు సేకరించారు. ఆ సమయంలోనే రైతు పేరు, భూమి విస్తీర్ణం, బ్యాంక్‌ ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాలను నమోదు చేశారు. కానీ బ్యాంక్‌ ఖాతాలు తీసి ఏడాది గడిచినందున ఆ ఖాతాలు కొనసాగుతున్నాయా, లేదా అనేది గుర్తించడం సమస్యగా మారింది. చాలామంది రైతులు ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించకపోవడం తో, బ్యాంకు నిబంధనల ప్రకారం అవి నాన్‌ ఆపరేటింగ్‌ కిందకు వెళ్లనున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్‌లో డబ్బులు వేయడం, తీసుకోవడం కుదరదు. అలాంటి సమయంలో సదరు రైతు మరో ఖాతాను తీయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో రైతు ఖాతాను పరిశీలించాల్సి రావడంతో చెల్లింపుల్లో జాప్యం చో టు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాగా ఖరీఫ్‌ సీజన్‌కు గాను ప్రభుత్వం రూ.355.21 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది. అందులో రూ.305 కోట్ల విలువైన చెక్కులను అధికారులకు రైతులకు పంపిణీ చేశారు.

రైతుల ఇళ్ల వద్దకు అధికారులు 
రైతుబంధు పథకం అమలులో వ్యవసాయశాఖ అధికారులు కొత్త విధానాన్ని అవలంభించనున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో రైతుల బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించేందుకు అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లనున్నారు. చెక్కుల రూపంలో వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోనే పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం రైతుబంధు అమలుకు ప్రత్యామ్నాయ చర్యల్లో నిమగ్నమైంది. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధికారుల వద్ద రైతుల బ్యాంక్‌ ఖాతా వివరాలు మరోసారి పరిశీలించాల ని ఆదేశించింది.

ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి మరోసారి బ్యాంకు ఖాతాల నంబర్లు, బ్రాంచ్, ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ తదితర వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమానికి బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వాడకంలో ఉన్న బ్యాంకు ఖాతా నంబర్లనే ఇవ్వాలని రైతులను అధికారులు ఈ సందర్భంగా కోరనున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో లబ్ధి పొందిన రైతులకే రైతుబం«ధు పథకం వర్తించనుండగా.. వారి నుంచే అధికారులు బ్యాంక్‌ ఖాతాలు సేకరిస్తారు. ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు ఏఈఓలు రైతు ల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇది లా ఉండగా రబీ సీజన్‌ కోసం రైతుబంధు పథకం జిల్లాలోని 26 మండలాలకు చెందిన రైతులకు పంపిణీ చేసేందుకు వచ్చిన 2.92 లక్షల చెక్కులను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూంలో భద్ర పరచాలని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement