నిరీక్షణే..! | Rythu Bandhu Scheme Money Transfer Problems | Sakshi
Sakshi News home page

నిరీక్షణే..!

Published Wed, Apr 24 2019 6:37 AM | Last Updated on Wed, Apr 24 2019 6:37 AM

Rythu Bandhu Scheme Money Transfer Problems - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంట పెట్టుబడికి సాయం చేస్తామన్న సర్కారు సమయానికి ఆదుకోలేకపోయింది. పెట్టుబడి పైసలతో సాగు చేద్దామనుకున్న రైతులకు నిరాశనే మిగిల్చింది. రబీ సాగు సీజన్‌ పూర్తయినా పెట్టుబడి అందకపోవడంతో రైతులు కాసుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రైతుబంధు సాయం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అనేక మంది రైతులు భావించినా.. ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా సరైన రీతిలో సమాధానం లభించకపోవడంతో డబ్బులు ఇంకెప్పుడొస్తాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

వేలకు వేలు పెట్టుబడి పెట్టి యాసంగి సేద్యం చేసిన రైతులు మాత్రం సాగు నీరందక, ప్రకృతి సహకరించకపోవడం వంటి కారణాలతో నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు.  
భూమినే నమ్ముకుని.. వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న రైతులను ఆదుకుని.. వారికి పంట పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం కింద ఖరీఫ్‌ సీజన్‌కు రూ.4వేలు, రబీలో రూ.4వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు. అయితే ఖరీఫ్‌లో మొదటిసారిగా ఈ పథకం కింద రైతులు డబ్బులు అందుకున్నారు. ఇక రెండో విడత రబీకి సంబంధించి మరికొంత మంది రైతులకు బ్యాంకుల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 2,65,355 మంది రైతులకు రూ.259కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని అందజేశారు.
 
రబీలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే.. 
ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు పథకం ప్రారంభం కాగా.. అప్పుడు రైతులకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత వాటిని రైతులు బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. అయితే రబీ సీజన్‌ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతులకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి చెక్కులు అందజేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం చెక్కుల రూపంలో కాకుండా.. నేరుగా బ్యాంకుల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి అధికారులు రైతులకు బ్యాంకుల్లో నగదు నేరుగా జమ చేస్తున్నారు. అయితే రబీ సీజన్‌ పూర్తయినప్పటికీ ఇంకా కొందరికి బ్యాంకుల్లో నగదు జమ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందరికీ వచ్చినా తమకు ఎందుకు నగదు రాలేదనే ఆలోచనతో వ్యవసాయ, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

28,465 మందికి అందని రైతుబంధు.. 
రబీ సీజన్‌లో ఇంకా 28,465 మందికి రైతుబంధు నగదు అందాల్సి ఉంది. రైతుబంధుకు సంబంధించి రబీ సీజన్‌లో 2,51,759 మంది రైతులకు రూ.252కోట్లు అందాల్సి ఉంది. వీరందరికీ నగదు అందజేయాలని ప్రభుత్వం లెక్కలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు 2,23,294 మంది రైతులకు రూ.226కోట్లను పంపిణీ చేశారు. రబీ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి దశలవారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. ఇంకా 28,465 మంది రైతులకు రూ.26కోట్లు అందాల్సి ఉంది. ఈ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రబీ సీజన్‌లో అప్పు తెచ్చుకుని పంటలు సాగు చేసుకున్నామని, పంట అమ్ముకునే సమయం వచ్చినా ఇంకా తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని పలువురు రైతులు వాపోతున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం నగదు దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఇంకా రైతులకు ఇవ్వకపోవడానికి కారణమంటూ ఏమీ లేదని, ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొంటున్నారు.  
 
రైతుబంధు రాలేదు.. 
ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన కేతిరెడ్డి ఈశ్వరమ్మకు 3.28 ఎకరాల భూమి ఉంది. ఈమెకు ఖరీఫ్, రబీలో కూడా రైతుబంధుకు సంబంధించిన డబ్బులు రాలేదు. దీంతో భూమి ఉన్నప్పటికీ తనకు రైతుబంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులను అడిగితే.. వస్తుందని చెబుతున్నారని, రెండో విడతలో వస్తుందని అన్నారని ఆమె పేర్కొంటోంది. అయితే ఇప్పటివరకు రాలేదని చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement