ఎదురుచూపులు | Farmers Waiting For Rythu Bandhu Cheques Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులు

Published Mon, Oct 22 2018 12:54 PM | Last Updated on Mon, Oct 22 2018 12:54 PM

Farmers Waiting For Rythu Bandhu Cheques Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రబీ సీజన్‌కు రైతులకు పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం డబ్బులను సకాలంలో అందించాలని యోచిస్తున్నా సాధ్యం కావడంలేదు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం అందించే బాధ్యతను జిల్లా వ్యవసాయ శాఖకు అప్పగించగా వారు పూర్తిస్థాయిలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సమయం కావడంతో ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీకి అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషన్‌ రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం అందించడానికి అంగీకరించింది. దీంతో అధికారులు రైతుల ఖాతాల వివరాలు తీసుకుని జమ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు.

జిల్లాలో 3,40,674 మంది రైతులు 
వ్యవసాయ శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి జిల్లాలో 3,40,674 మంది రైతుల బ్యాంకు ఖాతాలు, పాస్‌ పుస్తకం, ఆధార్‌ నంబర్లను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన తేదీ ప్రకారం నేటి నుంచే రైతుబం«ధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మొత్తం 3,40,674 మంది రైతులకు గాను కేవలం 9వేల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో మాత్రమే జమ కానుంది. పెట్టుబడి సాయం రైతులకు అందజేసే విషయంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలు విధించినప్పటి నుంచి నేటివరకు వ్యవసాయ శాఖ అవలంభిస్తున్న వైఖరితో  రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందకుండా పోయింది.

ప్రణాళిక లేకనే.. 
వ్యవసాయ శాఖ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరించకపోవడంతో  ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియ తూతూమంత్రంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో 38 మంది ఏఓలు, 162 మంది ఏఈఓలు ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మండలానికి ఏఓతో పాటు నలుగురు, ఐదుగురు చొప్పున ఏఈఓలు ఉన్నారు. వారికి గ్రామాల్లో సహకారం అందించేందుకు వీఆర్‌ఏలు గ్రామానికి సుమారు 10 మంది చొప్పున ఉన్నారు. వీరంతా చురుకుగా విధులు నిర్వహిస్తే బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్‌లైన్‌ నమోదు చకచకా జరిగిపోతుంది. ఇప్పటికే 1.10 లక్షల ఖాతాలను ఆన్‌లైన్‌ చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. అయితే బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన తర్వాతనే రాష్ట్ర ట్రెజరీ ద్వారా ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది.
 
గత అనుభవాలతోనైనా.. 
ఖరీఫ్‌ సీజన్‌లో చెక్కుల పంపిణీ నేరుగా చేయడం వల్ల సాంకేతికంగా పలు తప్పులు దొర్లాయి. ఆయా మండలాల తహసీల్దార్లు వాటిని సరిచేసే అవకాశం ఉంది. ఖరీఫ్‌  సీజన్‌లో రూ. 355.21 కోట్ల పెట్టుబడి సాయం జిల్లాకు మంజూరు కాగా వివిధ కారణాల వల్ల రూ. 50.21 కోట్లు పంపిణీకి నోచుకోలేదు. రూ. 305 కోట్లు పంపిణీకి నోచుకున్నాయి. రబీ సీజన్‌లో రూ. 305 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ. 4వేల చొప్పున నేరుగా జమ చేయాల్సి ఉన్నందున బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్‌లైన్‌ నమోదు ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉంటేనే సమస్య ఉత్పన్నం కాదు. రైతుల పేర్లు, వివరాలు, భూ వివరాలు, ఖాతాల్లోని పేర్లతో ఏమాత్రం సరిపోని విధంగా ఉన్నా అందులో పెట్టుబడి సాయం జమఅయ్యే అవకాశం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement