Farmers bank pass book
-
రైతులకు మరో చాన్స్
రబీలో పంట సాగు చేసి రైతుబంధు పథకం పొందని వారికి శుభవార్త. రబీలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని, రైతుబంధు పథకం వర్తించని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. కొంతమంది రైతులు అర్హులయినప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నూతన పాసుపుస్తకాలు అందక ప్రభుత్వ సాయానికి నోచుకోలేదు. రబీ దరఖాస్తుల గడువు ముగిసిన తరువాత రెవెన్యూ యంత్రాంగం పట్టాపాస్ పుస్తకాలను అందించింది. అయితే అధికారులు గత సంవత్సరం నవంబరు నుంచి వరుస ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికలు కూడా ముగియడంతో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రైతులకు రైతుబంధు వర్తించనుంది. ఇటీవలనే తిరిగి రబీ ఆన్లైన్ సైట్‌ని రీ ఓపెన్ చేశారు. సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 2,81,938 మంది రైతులు ఉండగా, కేవలం 2,49,104 మంది మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు అందుకున్నారు. మిగతా 32,834 రైతులు తమవద్ద తగిన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరికి అందించాల్సిన రూ. 22,96,08,570 సొమ్ము వ్యవసాయ శాఖ దగ్గర జమయి ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోని రైతులను గుర్తించి వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రాగానే పూర్తి వివరాలతో కూడిన ప్రతులను ఏఈఓల ద్వారా రైతులకు అందించనున్నారు. ఈ ప్రకారం రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లతో ఫాం నింపి ఏఈఓకు ఈ నెల 31 వరకు అందించాల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండొద్దు రైతుబంధు కోసం దరఖాస్తు చేస్తుకున్నా అనివార్య కారణాలతో బ్యాంకుల్లో చాలామంది రైతులకు సంబంధించి తిరస్కరించారు. ఇందులో అధికంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలను అందించినా డబ్బులు జమ కాలేదు. కొంత మందికి ఖాతాలో జమయినట్లు సమాచారం (మెస్సేజ్) వచ్చినా తీరా చూస్తే పాత బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇలాంటి వారికి అధికారులు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు తెలుసుకున్నాక సంబంధిత గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు కొత్త అకౌంట్ నంబర్లు ఇచ్చినట్లయితే ఇంతకుముందువలె ఎకరానికి రూ. 4 చొప్పున అందించనున్నారు. కాగా ఈ సహాయాన్ని ఈ ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.5వేలు చేయనున్నారు. జిల్లాలో రబీలో 32,834 మందికి రైతుబంధు అందలేదు. బ్యాంకు ఖాతా వివరాలను రైతులు సరిగ్గా ఇవ్వాలని, ఒక్క అంకె తప్పు పడినా ఇబ్బంది తప్పదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. జూన్ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాల్లో వేయనున్నామని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రకటించింది. తొలకరి వర్షాలు కురిసే నాటికి ఖరీఫ్ సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభుత్వం ఒక్కో సీజన్‌కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇవ్వగా.. ఎన్నికల హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచి రూ. 5 వేలు ప్రతీ సీజన్‌కు ప్రతీ ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. గతంలో రైతుబంధు రానివారికి రబీకి సంబంధించి ఎకరానికి రూ.4వేలు ఇవ్వనున్నారు. రైతుబంధు రాని అర్హులైన రైతులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. గత రబీ సీజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు లేక, బ్యాంకు ఖాతా నంబర్లు తప్పులు, తదితర కారణాల వల్ల సుమారుగా 32,834 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం లబ్ధిదారులకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసి ఖాతాల్లో జమ చేయడానికి అనుమతిస్తే అప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తాం. ఈ సీజన్లో ప్రతీ ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. బి.నర్సింహారావు, జేడీఏ -
శ్రీరామా.. నీవే దిక్కు!
షాద్‌నగర్ రూరల్: ఆ భూములను స్థానిక రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. కౌలుదారు హక్కు కలిగి భూమి శిస్తు చెల్లిస్తూ పంటలు పండించుకుంటున్నారు. అయితే, ఆ భూములు శ్రీ సీతారామస్వామి దేవాలయానికి చెందినవని రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇది తెలుసుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు బతుకుదెరువు అయిన భూములను వదులుకోబోమన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో రాజోలి లక్ష్మణ్‌రావుకు కొన్నేళ్ల క్రితం 351 నుంచి 401 సర్వే నంబర్లలో సుమారు 140 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామ రైతులు సాగుచేసుకుంటూ పట్టాదారు అయిన రాజోలి లక్ష్మణ్‌రావుకు శిస్తులు చెల్లించే వారు. కాలక్రమేణ రాజోలి లక్ష్మణ్‌రావు సదరు భూమిని చేవెళ్ల డివిజన్ షాబాద్ మండల పరిధిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం రాసినట్లు గ్రామస్తులు తెలిపారు. 1960 సంవత్సరం వరకు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రాజోలి లక్ష్మణ్‌రావు పేరు పైనే ఉన్నాయి. ఆ తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని రికార్డులు చెబుతున్నాయి. 1960 నుంచి 2012 వరకు రెవెన్యూ రికార్డుల్లో రైతులు కౌలుదారులుగా ఉన్నారు. ఆ తర్వాత 2012 నుంచి దేవాదాయశాఖ భూములుగా మారి కౌలుదారులుగా ఉన్న రైతుల పేర్లు రికార్డుల్లో కనిపించడం లేదు. న్యాయం కోసం రైతుల పోరాటం రాజోలి లక్ష్మణ్‌రావు పేరు పైన ఉన్న భూములు దేవాదాయ శాఖకు చెందినవిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పు జరగడంతో రైతులు పోరాటం ప్రారంభించారు. ఈ విషయమై 2007లో ఓఆర్సీలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవా కావా అని తెలియజేయాలని హై కోర్టు దేవాదాయ శాఖ అధికారులను కోరింది. దీంతో రైతులు అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ భూములకు సంబందించిన వివరాలను ఇవ్వాలని కోరారు. రెండు జిల్లాల్లోనూ ఈ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినవి కావని అధికారులు తెలిపారు. దీంతో హైకోర్టు రైతులు సాగు చేస్తున్న భూములకు ఓఆర్సీలు ఇవ్వాలని అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్డీఓను ఆదేశించింది. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓఆర్సీ రాకపోవడం, ఆర్డీఓలో రైతులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు రంగారెడ్డి జిల్లా జేసీ వద్దకు అప్పీలుకు వెళ్లారు. ఇటీవల జేసీ వద్ద కూడా రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. భూముల స్వాధీనానికి అధికారుల యత్నం జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తీర్పుతో రంగంపల్లి గ్రామశివారులోని భూములు రంగారెడ్డి జిల్లాషాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబందించినవని దేవాదాయ శాఖ అధికారులు గత పది రోజుల క్రితం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకొని భూమిలో పాతిన బోర్డులను తొలగించారు. భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో దేవాదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు. ఊరు కనుమరుగుకానుంది! గ్రామంలో 100 కుటుంబాలు ఉండగా దాదాపుగా 700 జనాభా ఉంది. ఆ గ్రామస్తులకు వ్యవసాయ మే జీవనాధారం. గ్రామ శివారులోని 140 ఎకరా ల భూమిని సాగుచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ గ్రామంలోని 90శాతం రైతులకు పట్టా భూములు లేవు. దీంతో ఆ గ్రామ రైతులు లక్ష్మణ్‌రావుకు చెందిన ఈ భూమిలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తాము నిర్మించుకున్న ఇళ్లు కూడా ఈ భూముల్లో ఉన్నాయని, అధికారులు భూ ములను స్వాధీనం చేసుకుంటే ఊరే ఖాళీ అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడు పోతే ఎక్కడ ఉండాలి కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను కూడ బెట్టి ఉండడానికి వంద గజాల స్ధలంలో ఇల్లు కట్టుకున్నాం. మేము కట్టుకున్న ఇళ్ళ స్ధలాలు సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. మేము వ్యవసాయం చేసుకొని జీవనోపాధిని పొందుతున్న భూములు కూడా దేవాలయం భూములే అంటున్నారు. మేము చదువుకోకపోవడంతో భూములకు సంబంధించిన రికార్డులను తెలుసుకోలేకపోతున్నాం. వందల ఏళ్ళ నుంచి సాగుచేస్తున్న భూములు ఇప్పుడు దేవాలయం భూములు అంటే మేము ఎలా బతికేది. సర్వే చేసిన తర్వాత ఇళ్లను కూడా ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇళ్లు పోతే మేము ఎక్కడ జీవించాలి. అధికారులే న్యాయం చేయాలి ఆ భూములే మాకు జీవనాధారం ప్రస్తుతం దేవాలయ భూములుగా చెబుతున్న పొలాన్ని కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పట్టాదారుడి పేరు మీద ఉన్న పొలాల్లో తాము కౌలుదారులుగా ఉన్నాం. ఆ పొలాలు ఇప్పుడు దేవాలయం భూములని చెబుతున్నారు. భూములు స్వాధీనం చేసుకుంటే మేము జీవనోపాధిని కోల్పోతాం. – పురుగుల ఎల్లయ్య, రైతు, రంగంపల్లి నిబంధల ప్రకారం భూములు ఆలయానికి చెందినవి రెవెన్యూ రికార్డుల ప్రకారం రంగంపల్లిలోని భూములు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవి జిల్లా జాయింట్ కలెక్టర్ ఇటీవల తీర్పు ఇచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాం. గ్రామస్తులు అడ్డుకొని గొడవ చేశారు. దీంతో భూములు ఖాళీ చేసేందుకు వారికి కొద్ది సమయం ఇచ్చాం. – శ్రీనివాసశర్మ, ఈఓ, శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, షాబాద్ మండలం -
రైతుబంధు.. గందరగోళం!
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు పెట్టుబడి డబ్బులకు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం జిల్లాలో గందరగోళంగా మారింది. లెక్కలు అంతా గజిబిజిగా ఉండడంతో ఏమి చేయాలో తెలియక అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాస్థాయిలో జరిగే సమావేశాల్లో మాత్రం అధికారులు కాకి లెక్కలు వేసుకుని సమాధానాలు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,38,154 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంకింద రూ.467.19 కోట్ల విలువ చేసే చెక్కులను అందజేసింది. తిరిగి రబీలో కూడా ఎకరానికి రూ.4వేల చొప్పున పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంక్ ఖాతా ల్లో నేరుగా నగదు జమచేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వారీగా బ్యాంక్ ఖాతానంబర్లను సేకరించి ఆన్లైన్లో ఎంటర్ చేసే ప్రక్రియను గత ఏడాది సెప్టెంబర్ మాసంనుంచి చేపట్టారు. ఆన్లైన్లో ఖాతాలను న మోదు చేసిన వెంటనే డబ్బులు పడుతాయని చెప్పారు. ఈ ప్రక్రియను ప్రారంభించి ఏడు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు స గం మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం పడని పరిస్థితి నె లకొంది. రబీలో పెట్టుబడి సాయం కోసం 4,14,477 మంది రై తుల పాస్‌బుక్కులు ఎలాంటి తిరకాసులు లేకుండా క్లియర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి పాస్‌బుక్కులు, బ్యాంక్‌ఖాతాలను తెప్పించుకునే పనిలో జిల్లా వ్యవసాయశాఖ ఏడు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 3,45,925 మంది రైతుల ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేశారు. 68,552 మందివి నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో నమో దు చేసిన రైతుల్లో ఇప్పటివరకు కేవలం 2,24,571 మందికి మాత్రమే న గదు జమయ్యాయి. ఇంకా 2,13,583 మంది రైతులు రబీ పెట్టుబడి నగదు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 23,677మంది రైతుల లెక్క ఎక్కడ? గత ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం అందుకున్న రైతుల్లో రబీలో 23,677 మంది పేర్లు లెక్కలనుంచి గల్లంతయ్యాయి. కేవలం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను, భూములు తక్కువ, ఎక్కువ వాటిని సరిచేయాలని, పేరు మార్పిడి తదితర అంశాలను సరిచేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న పాపానికి వారు నగదు సాయానికి నోచుకోవడం లేదు. దీనికితోడు సరిచేసిన పాస్‌పుస్తకాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరి రైతుల పాస్‌పుస్తకాలను సరిచేసిన తహసీల్దార్ డిజిటల్ సంతకం పెట్టినప్పటికీ వారి పేర్లు ధరణి వెబ్సైట్లో చూపడం లేదు. రెవెన్యూ అధికారులు సరిచేసిన పాస్‌పుస్తకాల వివరాల ఆన్లైన్లో, ధరణిలో నమోదు చేయడంతోపాటు వెంటనే వాటికి సంబంధించిన సాఫ్ట్‌కాపీలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపించడంలో జరిగిన జాప్యంతో వారి పేర్లు ధరణిలో చూపడం లేదు. దీంతో వారందరికీ ప్రస్తుత రబీ పెట్టుబడి సాయం వస్తుందా.. రాదోననే ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు జిల్లావ్యాప్తంగా సగం మంది రైతులకు రబీ పెట్టుబడి సాయం జమకావాల్సి ఉంది. అసలు వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా సమాచారం చెప్పలేని స్థితిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్లైన్లో నమోదు చేయాల్సిన రైతుల వివరాలు కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. . ట్రెజరీలకు పంపించారు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,35,749 మంది పేర్లు ట్రెజరీకి పంపించారు. 2,24,571 మందికి మాత్రమే డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిగతా వారికి రావాల్సి ఉంది. పాస్‌పుస్తకాలు, ఖాతా నంబర్లను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రతి రైతుకు రబీ డబ్బులు వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ రబీ పెట్టుబడి సాయం అందలేదు మాకు ఎకరం ఇరువై గుంటల భూమి ఉంది. కాని ఇప్పటివరకు రబీ పెట్టుబడి సాయం అందలేదు. ఎందుకు రాలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అధికారులను అడిగితే తప్పక వస్తాయని చెబుతున్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వెంటనే పెట్టుబడి సాయం డబ్బులు జమ చేయాలి. -బచ్చలకూరి భద్రమ్మ, త్రిపురారం రెండో విడత రైతు బంధు అందలేదు నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. మొదటి విడతలో రైతుబంధు చెక్కు వచ్చింది. రెండో విడత మాత్రం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు అధికారులకు జీరాక్స్‌లు ఇచ్చా. ఎప్పుడు అడిగినా వస్తాయిలే అని అంటున్నారు. కొంత భూమి చేర్చాల్సి ఉన్నా అదీ జరగలేదు. – కుప్ప శ్రీకాంత్ రైతు, గుర్రంపోడు ఇంకా పెట్టుబడి డబ్బులు రాలేదు మా నాన్న పేరున రెండున్నర ఎకరాల భూమి ఉంది. అయితే ఒక సర్వేనంబర్‌లో మా నాన్న పేరుతో ఇంకొకరు కూడా ఉండడంతో సరిచేయమని దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు సరిచేయలేదు. ఖరీఫ్‌లో, రబీలో కూడా పెట్టుబడి సాయం రాలేదు. ఎప్పుడు సరిచేస్తారో, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎవరూ చెప్పడం లేదు. -మాచర్ల పాండు, కుమ్మరిగూడెం, కనగల్ మొదటి విడత లేదు.. రెండో విడత లేదు నాకు చేపూరు గ్రా మ శివారులో మూ డు ఎకరాల భూ మి ఉంది. రెండేళ్ల క్రితమే మ్యూటేషన్ కోసం డ్యాకుమెంటు ఇచ్చా. ఇంతవరకు నాకు పాస్‌పుస్తకం రాలేదు. ముగు ్గరు వీఆర్ఓలు మారడంతో మారినప్పుడల్లా ఆన్లైన్లో మ్యుటేషన్ చేసినా ఇం తవరకు అతీగతీ లేదు. మొదటి విడత, రెండో విడత రైతుబంధు అందలేదు. – చేగొండి లక్ష్మీపతి, రైతు, గుర్రంపోడు పాస్‌పుస్తకం రాలేదు..రైతుబంధు అందలేదు మొదటి విడతకు ముందే మూడు ఎకరాల భూమి కొన్నా. అప్పుడు అమ్మిన రైతు పేరు మీదే డబ్బులు రావడంతో అతనే తీసుకున్నాడు. రెండో విడత అందలేదు. ఆన్లైన్లో ఉన్నా పాస్‌పుస్తకం రాలేదు. పాస్‌పుస్తకం లేక డబ్బులు అందలేదు. -వడ్డగోని గంగాధర్ గౌడ్, రైతు, నడికూడ -
పెట్టుబడి సాయం.. రైతు ఖాతాల్లోకి
సాక్షి, వరంగల్ రూరల్: వచ్చే రబీ పంటకు ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుబం«ధు సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిAన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల బ్యాంక్ ఖాతా నంబర్లను సేకరిస్తున్నారు. జిల్లాలో 1,48,581 మంది పట్టాదారులకు రూ118,99,94,630 రైతు బంధు సాయం అందనుంది. ఖరీఫ్ సీజన్లో ఇచ్చిన విధంగానే రైతులకు చెక్కులను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే చెక్కుల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేస్తుందనే ఉద్దేశంతో నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ఈసీ ఆదేశించింది. రైతుల ఖాతా నంబర్లు సేకరించిన అధికారులు అందులోనే డబ్బులు జమచేస్తున్నారు. ఈ నెల చివరికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో అందుకున్న వారికే.. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న రైతులకే రబీ సాయం అందించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలో ఖరీఫ్‌కు 1,69,731 మంది పట్టాదారులు ఉండగా రూ130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారిలో కొందరు రైతులు మరణించారు. తొలి రోజు 3,771 మందికి సోమవారం తొలి విడతలో 3,771 మందికి రూ 3,19,80,220 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. రెండో విడతలో 19,258 మందికి రూ.16,67,01,920లు బ్యాంక్ ఖాతాల్లో మరో రెండు రోజుల్లో జమ కానున్నాయి. మొత్తం రెండు విడతల్లో 20,329 మందికి రూ.19,86,82,140 జమకానున్నాయి. ఇంకా 1,28,252 మందికి వివిధ విడతల్లో రూ 99,13,12,490 జమ చేయనున్నారు. తొలి విడతలో నెక్కొండ రైతులకు రైతు బంధుసాయం బ్యాంకుల్లో జమ కాలేదు. అధికారులకు సవాల్‌గా మారిన సేకరణ రైతుల నుంచి బ్యాంక్ అకౌంట్ల నంబర్ల సేకరణ అధికారులకు సవాల్‌గా మారిం ది. వ్యవసాయశాఖ అందించిన ప్రొఫార్మా ప్రకారం సేకరించాలని ఆదేశించారు. అన్ని వివరాల సేకరణలో అధికారులు తలమునకనవుతున్నారు. రైతుల నుంచి ఇంకా దాదపు 60 శాతం అకౌంట్ నంబర్లు సేకరించాల్సి ఉన్నట్లు తెలిసింది. విడతల వారీగా బ్యాంకుల్లో జమ ఈ నెల 10వ తేదీ నుంచి రైతు బంధు మంజూరైన వారి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. ఖరీఫ్‌లో చెక్కులు తీసుకున్న వారే రబీ సాయంకు అర్హులు. మొదటి విడతకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రెండు రోజుల్లో రెండో విడతకు సంబంధించిన డబ్బులు సైతం జమ చేస్తాం. గ్రామాల్లో వచ్చే వ్యవసాయ అధికారులకు రైతులు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చి సహకరించాలి. –ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి -
ఎదురుచూపులు
మహబూబ్‌నగర్ రూరల్: రబీ సీజన్‌కు రైతులకు పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం డబ్బులను సకాలంలో అందించాలని యోచిస్తున్నా సాధ్యం కావడంలేదు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం అందించే బాధ్యతను జిల్లా వ్యవసాయ శాఖకు అప్పగించగా వారు పూర్తిస్థాయిలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సమయం కావడంతో ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీకి అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషన్ రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం అందించడానికి అంగీకరించింది. దీంతో అధికారులు రైతుల ఖాతాల వివరాలు తీసుకుని జమ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో 3,40,674 మంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి జిల్లాలో 3,40,674 మంది రైతుల బ్యాంకు ఖాతాలు, పాస్ పుస్తకం, ఆధార్ నంబర్లను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన తేదీ ప్రకారం నేటి నుంచే రైతుబం«ధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మొత్తం 3,40,674 మంది రైతులకు గాను కేవలం 9వేల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో మాత్రమే జమ కానుంది. పెట్టుబడి సాయం రైతులకు అందజేసే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించినప్పటి నుంచి నేటివరకు వ్యవసాయ శాఖ అవలంభిస్తున్న వైఖరితో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందకుండా పోయింది. ప్రణాళిక లేకనే.. వ్యవసాయ శాఖ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరించకపోవడంతో ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియ తూతూమంత్రంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో 38 మంది ఏఓలు, 162 మంది ఏఈఓలు ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మండలానికి ఏఓతో పాటు నలుగురు, ఐదుగురు చొప్పున ఏఈఓలు ఉన్నారు. వారికి గ్రామాల్లో సహకారం అందించేందుకు వీఆర్ఏలు గ్రామానికి సుమారు 10 మంది చొప్పున ఉన్నారు. వీరంతా చురుకుగా విధులు నిర్వహిస్తే బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు చకచకా జరిగిపోతుంది. ఇప్పటికే 1.10 లక్షల ఖాతాలను ఆన్లైన్ చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. అయితే బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన తర్వాతనే రాష్ట్ర ట్రెజరీ ద్వారా ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది. గత అనుభవాలతోనైనా.. ఖరీఫ్ సీజన్లో చెక్కుల పంపిణీ నేరుగా చేయడం వల్ల సాంకేతికంగా పలు తప్పులు దొర్లాయి. ఆయా మండలాల తహసీల్దార్లు వాటిని సరిచేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్లో రూ. 355.21 కోట్ల పెట్టుబడి సాయం జిల్లాకు మంజూరు కాగా వివిధ కారణాల వల్ల రూ. 50.21 కోట్లు పంపిణీకి నోచుకోలేదు. రూ. 305 కోట్లు పంపిణీకి నోచుకున్నాయి. రబీ సీజన్లో రూ. 305 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ. 4వేల చొప్పున నేరుగా జమ చేయాల్సి ఉన్నందున బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉంటేనే సమస్య ఉత్పన్నం కాదు. రైతుల పేర్లు, వివరాలు, భూ వివరాలు, ఖాతాల్లోని పేర్లతో ఏమాత్రం సరిపోని విధంగా ఉన్నా అందులో పెట్టుబడి సాయం జమఅయ్యే అవకాశం లేదు. -
రైతు రుణాలు మింగిన నకిలీలు
నెల్లికుదురు : రైతుకు బ్యాంకు రుణం కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం.. మీ సేవా ద్వారా తీసిన పహనీ నకల్, ఓటరు ఐడీ కార్డు తదితరాలు తప్పనిసరి ఉండాల్సిందే. ఇవన్నీ ఉన్నా కొర్రీలు పెడుతూ బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకునే బ్యాంకు అధికారులు.. సెంట్ భూమి లేనివారికి కూడా లక్షలాది రూపాయల రుణాలిచ్చారు. కేవలం తెల్లకాగితంపై భూమి ఉన్నట్లు తహసీల్దార్, వీఆర్వో రాసిస్తే ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం మంజూరు చేశారు. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఇలా ఏకంగా సుమారు 480 మంది బినామీలకు రుణాలిచ్చారు. దళారులు, రెవె న్యూ, బ్యాంకు అధికారులు కుమ్మక్కయి కోట్లు కొల్లగొట్టారు. మహబూబాబాద్ మండలం అమనగల్ సిండికేట్ బ్యాంకు కేంద్రంగా సాగిన ఈ దందా నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం, ఆలేరు, బంజర గ్రామా ల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమనగల్ సిండికేట్ బ్యాంకు అధికారు లు నర్సింహులగూడెం ఆలేరు, బంజర గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ మూడు గ్రామాలకేగాక మరికొన్ని గ్రామాలకు కలిపి 1830 మందికి సుమారు రూ.14 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఇటీవల ఈ జాబితా కూడా విడుదల చేశారు. ఏ బ్యాంకులోనైనా నిబంధనల ప్రకారం రైతులకు రుణా లు మంజూరు చేయాలంటే పట్టాదారు పాసుపుస్తకాలు, మీ సేవా ద్వారా పొందిన పహనీ నకల్, రైతుల వివరాలు సక్రమంగా ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసుకున్న రైతు భూమిని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించాకే రుణం మంజూరు చేస్తారు. కానీ అమనగల్ సిండికేట్ బ్యాంకులో ఆ డాక్యుమెంట్లేవి లేకుం డానే ఇక్కడ రుణాలు మంజూరు చేశారు. దళారుల ప్రమేయంతో భూమి లేని వ్యక్తుల పేరిట రుణాలిచ్చారు. తెల్లకాగితంపై ఫలానా వ్యక్తికి ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి ఉన్నదని వీఆర్వో, తహసీల్దార్ రాసిచ్చి, సంతకాలు పెట్టి, ముద్రలు వేస్తేచాలు.. అప్పటి సిండికేట్ బ్యాంకు మేనేజర్ పులిపాక కృపాకర్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మంజూరు చేశారు. ఇలా కేవలం వీఆర్వో, తహసీల్దార్ ధ్రువీకరించిన కాగితాల ఆధారంగా బంజర, ఆలేరు, నర్సింహులగూడెం గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కలిసి సుమారు 480 మంది భూమి లేని వ్యక్తులకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రుణాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ తతంగమంతా నెల్లికుదురు తహసీల్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు అనుమానాలున్నాయి. వెలుగు చూసిందిలా.. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి సెప్టెంబ ర్ 5న చదివి వినిపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. బంజర గ్రామంలో 310 మంది రుణాలు తీసుకున్నట్లు జాబితా ఉండ గా.. కేవలం 56 మంది పేర్లనే బ్యాంకు అధికారులు గ్రామసభకు పంపారు. మిగతాపేర్లను నర్సింహులగూడెం గ్రామ జాబితాలోకి మార్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. గ్రామసభ నిర్వహించిన బంజర సర్పంచ్ నెలకుర్తి వెంకట్‌రెడ్డి గ్రామస్తుల సమక్షంలో తమ గ్రామంలో రుణాలు తీసుకున్న వారి మొత్తం జాబితాను తమకివ్వాలని తీర్మా నం చేసి గ్రామ ప్రత్యేక అధికారి ఆర్ఐ లచ్చునాయక్ అందజేశారు. అయినా రెవె న్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నెల్లికుదు రు తహసీల్దార్ తోట వెంకట నాగరాజును వివరణ కోరగా.. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా అసలు మంజూరైన రుణాలను భూమి లేని రైతులైనా తీసుకున్నా రా ? లేదంటే దళారులు, అధికారులే బినామీల పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేశారా ? అనేది ఉన్నతాధికారులు విచారణ చేపడితేనే వెలుగు చూసే అవకాశముంది.