నల్లగొండ అగ్రికల్చర్ : రైతు పెట్టుబడి డబ్బులకు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం జిల్లాలో గందరగోళంగా మారింది. లెక్కలు అంతా గజిబిజిగా ఉండడంతో ఏమి చేయాలో తెలియక అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాస్థాయిలో జరిగే సమావేశాల్లో మాత్రం అధికారులు కాకి లెక్కలు వేసుకుని సమాధానాలు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,38,154 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంకింద రూ.467.19 కోట్ల విలువ చేసే చెక్కులను అందజేసింది.
తిరిగి రబీలో కూడా ఎకరానికి రూ.4వేల చొప్పున పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంక్ ఖాతా ల్లో నేరుగా నగదు జమచేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వారీగా బ్యాంక్ ఖాతానంబర్లను సేకరించి ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసే ప్రక్రియను గత ఏడాది సెప్టెంబర్ మాసంనుంచి చేపట్టారు. ఆన్‌లైన్‌లో ఖాతాలను న మోదు చేసిన వెంటనే డబ్బులు పడుతాయని చెప్పారు. ఈ ప్రక్రియను ప్రారంభించి ఏడు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు స గం మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం పడని పరిస్థితి నె లకొంది.
రబీలో పెట్టుబడి సాయం కోసం 4,14,477 మంది రై తుల పాస్‌బుక్కులు ఎలాంటి తిరకాసులు లేకుండా క్లియర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి పాస్‌బుక్కులు, బ్యాంక్‌ఖాతాలను తెప్పించుకునే పనిలో జిల్లా వ్యవసాయశాఖ ఏడు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 3,45,925 మంది రైతుల ఖాతాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 68,552 మందివి నమోదు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో నమో దు చేసిన రైతుల్లో ఇప్పటివరకు కేవలం 2,24,571 మందికి మాత్రమే న గదు జమయ్యాయి. ఇంకా 2,13,583 మంది రైతులు రబీ పెట్టుబడి నగదు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
23,677మంది రైతుల లెక్క ఎక్కడ?
గత ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం అందుకున్న రైతుల్లో రబీలో 23,677 మంది పేర్లు లెక్కలనుంచి గల్లంతయ్యాయి. కేవలం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను, భూములు తక్కువ, ఎక్కువ వాటిని సరిచేయాలని, పేరు మార్పిడి తదితర అంశాలను సరిచేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న పాపానికి వారు నగదు సాయానికి నోచుకోవడం లేదు. దీనికితోడు సరిచేసిన పాస్‌పుస్తకాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరి రైతుల పాస్‌పుస్తకాలను సరిచేసిన తహసీల్దార్ డిజిటల్ సంతకం పెట్టినప్పటికీ వారి పేర్లు ధరణి వెబ్‌సైట్‌లో చూపడం లేదు. రెవెన్యూ అధికారులు సరిచేసిన పాస్‌పుస్తకాల వివరాల ఆన్‌లైన్‌లో, ధరణిలో నమోదు చేయడంతోపాటు వెంటనే వాటికి సంబంధించిన సాఫ్ట్‌కాపీలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపించడంలో జరిగిన జాప్యంతో వారి పేర్లు ధరణిలో చూపడం లేదు. దీంతో వారందరికీ ప్రస్తుత రబీ పెట్టుబడి సాయం వస్తుందా.. రాదోననే ఆందోళనలో ఉన్నారు.
ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు
జిల్లావ్యాప్తంగా సగం మంది రైతులకు రబీ పెట్టుబడి సాయం జమకావాల్సి ఉంది. అసలు వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా సమాచారం చెప్పలేని స్థితిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన రైతుల వివరాలు కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. .
ట్రెజరీలకు పంపించారు
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,35,749 మంది పేర్లు ట్రెజరీకి పంపించారు. 2,24,571 మందికి మాత్రమే డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిగతా వారికి రావాల్సి ఉంది. పాస్‌పుస్తకాలు, ఖాతా నంబర్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రతి రైతుకు రబీ డబ్బులు వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ
రబీ పెట్టుబడి సాయం అందలేదు
మాకు ఎకరం ఇరువై గుంటల భూమి ఉంది. కాని ఇప్పటివరకు రబీ పెట్టుబడి సాయం అందలేదు. ఎందుకు రాలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అధికారులను అడిగితే తప్పక వస్తాయని చెబుతున్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వెంటనే పెట్టుబడి సాయం డబ్బులు జమ చేయాలి. -బచ్చలకూరి భద్రమ్మ, త్రిపురారం
రెండో విడత రైతు బంధు అందలేదు
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. మొదటి విడతలో రైతుబంధు చెక్కు వచ్చింది. రెండో విడత మాత్రం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు అధికారులకు జీరాక్స్‌లు ఇచ్చా. ఎప్పుడు అడిగినా వస్తాయిలే అని అంటున్నారు. కొంత భూమి చేర్చాల్సి ఉన్నా అదీ జరగలేదు. – కుప్ప శ్రీకాంత్ రైతు, గుర్రంపోడు
ఇంకా పెట్టుబడి డబ్బులు రాలేదు
మా నాన్న పేరున రెండున్నర ఎకరాల భూమి ఉంది. అయితే ఒక సర్వేనంబర్‌లో మా నాన్న పేరుతో ఇంకొకరు కూడా ఉండడంతో సరిచేయమని దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు సరిచేయలేదు. ఖరీఫ్‌లో, రబీలో కూడా పెట్టుబడి సాయం రాలేదు. ఎప్పుడు సరిచేస్తారో, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎవరూ చెప్పడం లేదు. -మాచర్ల పాండు, కుమ్మరిగూడెం, కనగల్
మొదటి విడత లేదు.. రెండో విడత లేదు
నాకు చేపూరు గ్రా మ శివారులో మూ డు ఎకరాల భూ మి ఉంది. రెండేళ్ల క్రితమే మ్యూటేషన్ కోసం డ్యాకుమెంటు ఇచ్చా. ఇంతవరకు నాకు పాస్‌పుస్తకం రాలేదు. ముగు ్గరు వీఆర్‌ఓలు మారడంతో మారినప్పుడల్లా ఆన్‌లైన్‌లో మ్యుటేషన్ చేసినా ఇం తవరకు అతీగతీ లేదు. మొదటి విడత, రెండో విడత రైతుబంధు అందలేదు. – చేగొండి లక్ష్మీపతి, రైతు, గుర్రంపోడు
పాస్‌పుస్తకం రాలేదు..రైతుబంధు అందలేదు
మొదటి విడతకు ముందే మూడు ఎకరాల భూమి కొన్నా. అప్పుడు అమ్మిన రైతు పేరు మీదే డబ్బులు రావడంతో అతనే తీసుకున్నాడు. రెండో విడత అందలేదు. ఆన్‌లైన్‌లో ఉన్నా పాస్‌పుస్తకం రాలేదు. పాస్‌పుస్తకం లేక డబ్బులు అందలేదు. -వడ్డగోని గంగాధర్ గౌడ్, రైతు, నడికూడ
Comments
Please login to add a commentAdd a comment