సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి అడ్డంకి తొలగింది. రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం షరుతులతో అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన నేపథ్యంలో ఈసీ శుక్రవారం స్పందించింది. ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల నిబంధనల పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. అయితే చెక్కులు రైతుల చేతికి నేరుగా కాకుండా బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని సూచించింది. మొదటి విడత రైతుబంధులో ఇచ్చినవారికే రెండో విడతలో నగదు చెల్లించాలని, అదనంగా కొత్తవారికి ఇవ్వకూడదని నిబంధన పెట్టింది.
అదేవిధంగా రైతుబంధులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూదని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4వేల చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తుంది. తొలి సీజన్‌లో రూ.4వేలు ఇచ్చిన ప్రభుత్వం.. రెండోదఫా రూ.4వేలు ఇవ్వనుంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, రైతుబంధు చెక్కుల పంపిణీ చేయొద్దంటూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment