నల్లగొండ అగ్రికల్చర్ : నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం అమలుచేస్తున్న రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి బదులు రైతుల ఖాతాల్లో నగదును జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దను నుంచి వారి బ్యాంకుఖాతా నంబర్లను సేకరించే పనిలో తలమునకలయ్యారు. రబీ రైతుబంధు పథకం పెట్టుబడి సాయం అందుకోనున్న రైతులు జిల్లా వ్యాప్తంగా 3,59,496 మంది ఉన్నారు. అయితే ఈ నెల 22 నాటికి రైతుల నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు 42 వేల ఖాతాలను సేకరించాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది.
ఈ ప్రక్రియ వేగవంతంగా సాగడంతో ఇప్పటి వరకు 77,821 ఖాతానంబర్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ నంబర్‌లను సేకరించడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు అనుసంధానం చేశారు. దీని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి నగదు జమ చేయనుంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండో దశ పెట్టుబడి సాయం రైతులకు అందునున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రైతుల ఖాతా నంబర్లను దశల వారీగా సేకరించి రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయాన్ని జమచేయడానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఏఈఓలు లక్ష్యానికి మించి రైతుల నుంచి వివరాలు సేకరించడంపై జిల్లా వ్యవసాయాధికారి జి.శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నుంచిసేకరించిన వివరాలు ఇలా..
మిర్యాలగూడ మండలంలో 17,306 మంది రైతులకు గాను 4,709 ఖాతాలు, దేవరకొండలో 11,930 మందికి 4,248, చింతపల్లిలో 13,132కు 4205, మునుగోడులో 13,562కు 3,704, పెద్దవూరలో 13,380కి 3,639, నల్లగొండలో 16,740కి 3,607, కనగల్‌లో 14,122కు 3,329, నిడమనూరులో 14,316కు 3,122, అడవిదేవులపల్లిలో 4,063కు 3,088, చండూరులో 12,713కు 2,953, నార్కట్‌పల్లిలో 12,943కు 2,664, వేములపల్లిలో 8,469కు 2,606 ఖాతాలను సేకరించారు.
గుర్రంపోడులో 16,414కు 2,603, కట్టంగూరులో 11,507కు 2,592, తిరుమలగిరి(సాగర్)లో 9,782కు 2,530, దామరచర్లలో 8,500కు 2,423, కొండమల్లెపల్లిలో 8,074కు 2,358, పీఏపల్లిలో 11,157కు 2,344, నకిరేకల్‌లో 8,448కు 2,322, శాలిగౌరారంలో 12,912కు 2,155, అనుములలో 11,188కు 2,106, చిట్యాలలో 13,035కు 2,065, మర్రిగూడలో 11,715కు 1,976, తిప్పర్తిలో 10,696కు గాను 1,794 రైతుల ఖాతాలను సేకరించారు. కేతేపల్లిలో 9,106కు 1,590, మాడుగులపల్లిలో 10,969కు 1,540, గుండ్లపల్లిలో 11,648కి 1,362, నాంపల్లిలో 15,070కి 1,224, చందంపేటలో 9,083కు 944, త్రిపురారంలో 12,042కు 925 మంది రైతులనుంచి ఖాతాలను సేకరించారు. వీరందరికీ సోమవారం నుంచి ఆన్‌లైన్ ప్రక్రయ ద్వారా రబీ పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాగానే వెంటనే ఆ బ్యాంకు నుంచి రైతుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
అనిరంతరం కొనసాగుతుంది
రైతులందరికీ రబీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమచేసే వరకు ఖాతా నంబర్ల సేకరణ, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు వేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి రైతు విధిగా తమ పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను వ్యవసాయ విస్తరణాధికారులను అందించాలి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదటిదశలో వచ్చిన వారందరికీ ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ
Comments
Please login to add a commentAdd a comment