మిర్యాలగూడ :హైదలాపురం సమీపంలో లేఅవుట్‌ను పరిశీలిస్తున్న ఆర్డీఓ, అధికారులు (ఫైల్)
సాక్షి, మిర్యాలగూడ (నల్గగొండ): మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన ప్లాట్లుగా మార్చిన వెంచర్లకు కూడా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతోంది. వెంచర్లకు రైతుబంధు ఏమిటి అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం.
కొందరు రియల్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొని వెంచర్లుగా ఏర్పాటు చేసినప్పటికీ నాలాపన్ను చెల్లించకపోవడంతో రికార్డుల ప్రకారం ఆ వెంచర్లు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఏంచక్కా వాటికి రైతుబంధు వర్తింపజేసినట్టు సమచారం. దీంతో రియల్ వెంచర్లకు రైతుబంధు అందుతుందన్న సంగతి హాట్‌టాపిక్‌గా మారింది.
మిర్యాలగూడ డివిజన్‌లో కొత్త దందా ఇది.. రైతుల పేరుమీద ఉన్నప్పటికీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతుండడం గమనార్హం. ఇక్కడ రియల్‌వ్యాపారులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ నాలా పన్ను చెల్లించకపోవడం.. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో వారికి రైతుబంధు నగదు సాయం అందుతోంది.
మిర్యాలగూడ పట్టణ సమీపంతో పాటు మండలంలోని చింతపల్లి, హైదలాపురం, గూడూరు, శ్రీనివాస్‌నగర్, బాదలాపురం, ఆలగడప గ్రామాలలో పలు రియల్ ఎస్టేట్ భూముల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
ఇటీవల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ హైదలాపురం సమీపంలో చూసిన సర్వే నంబర్ 4, 218లలో కూడా కనీసం నాలా కూడా చెల్లించలేదని తేలింది. ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసినా రైతులు రామ్మూర్తి పేరున 7.04 ఎకరాలు, విజయలక్ష్మి పేరున 1.30 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దాంతో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ భూమికి కూడా ఇటీవల రైతుబంధు పథకాన్ని అధికారులు వర్తింపజేసినట్లు సమాచారం.
పరిశీలన బృందం ఏర్పాటుకే పరిమితం..
అనధికారిక లేఅవుట్లను మిర్యాలగూడ పట్టణం, మండలంలోని గుర్తించడానికి గాను ఆర్డీఓ జగన్నాథరావు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వేయర్ ఉన్నారు. మున్సిపాలిటీ, మండలంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను పరిశీలించి నాలా పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంతో పాటు లేఅవుట్‌కు అనుమతి ఉందా? లేదా? పరిశీలించాలి.
అనుమతి లేని లేఅవుట్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కోవడంతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లను పరిశీలించే బృందం కేవలం ఏర్పాటుకే పరిమితం కాగా లేఅవుట్లను పరిశీలించడం లేదు.
ఇప్పటికైనా అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ.. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
అనుమతి లేఅవుట్లపై చర్యలేవీ?
మిర్యాలగూడ మున్సిపాలిటీ, సమీప గ్రామంలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్‌శాఖ అనుమతులు లేకుండా వెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలు జారీ చేయగా ఆర్డీఓ జగన్నాథరావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, ఎంపీడీఓ దేవిక పరిశీలించారు. కానీ ఒక్కరోజు పరిశీలనలోనే పది ఎకరాల భూమి నాలా పన్ను కూడా చెల్లించలేదని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కేవలం లేఅవుట్‌ను పరిశీలించి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment