‘రెండో’ చెక్కు రెడీ.. | Cheque Distribution Will Be Staggered Khammam | Sakshi
Sakshi News home page

‘రెండో’ చెక్కు రెడీ..

Published Sat, Oct 6 2018 7:58 AM | Last Updated on Sat, Oct 6 2018 7:58 AM

Cheque Distribution Will Be Staggered Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయాధికారులు మండలాలవారీగా రైతులకు చెక్కులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. మొదటి విడతగా రైతులకు చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. అందులో కొన్ని లోటుపాట్లు జరగగా.. ఈసారి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు.. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు చెక్కుల పంపిణీపై వివరించారు. పాలనాపరమైన అనుమతుల కోసం సంబంధిత అధికారులు వేచి చూస్తున్నారు.

ఇప్పటికే ఆయా బ్యాంకులకు రైతులకు సంబంధించిన చెక్కులు అందుతుండగా.. వీటిని వ్యవసాయాధికారులు పరిశీలించే పనిని ప్రారంభించారు.  
జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 2,85,348 మంది రైతులు ఉన్నారు. వారికున్న భూముల ఆధారంగా ఖరీఫ్‌లో రూ.275.01కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రబీలో కూడా ఇదే మొత్తంలో చెక్కుల రూపంలో రైతులకు అందించనుంది. దీనికి సంబంధించి గ్రామాల్లో ముందస్తుగా టమకా వేయించాల్సి ఉంటుంది. ఏఓలు, ఏఈఓల ద్వారా రైతులకు తెలియజేసి.. నిర్ణయించిన తేదీల్లో చెక్కులు అందజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
 
బ్యాంకులకు చేరుతున్న చెక్కులు 
రబీ సీజన్‌ ప్రారంభమవుతుండడంతో రైతుబంధు చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఐదు మం డలాలకు చెందిన చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. ఖమ్మం రూరల్‌ మండలానికి రూ.12.99కోట్ల విలువైన 13,436 చెక్కులు, నేలకొండపల్లికి సంబంధించి రూ.13.26కోట్ల విలువైన 16,203 చెక్కులు, తల్లాడకు సంబంధించిన రూ.12.31కోట్ల విలువైన 12,688 చెక్కులు, వేంసూరుకు సంబంధించి రూ.15.09కోట్ల విలువైన 15,227 చెక్కులు, ఎర్రుపాలెంకు సంబంధించి రూ.13.51కోట్ల విలువైన 13,439 చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. అలాగే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు కూడా చెక్కులు చేరుతున్నాయి. మధిరకు సంబంధించి 16,407, ముదిగొండ 15,404, సత్తుపల్లి 11,004, తిరుమలాయపాలెం 16,774, ఖమ్మంకు సంబంధించి 10,975 చెక్కులు ఐఓబీకి చేరాయి. ఆయా చెక్కులను వ్యవ సా య శాఖ శుక్రవారం నుంచి పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయి లో చెక్కులు మంజూరైన రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు.

ఖరీఫ్‌లో పంపిణీ కాని 20,274 చెక్కులు 
గత ఖరీఫ్‌లో 379 రెవెన్యూ గ్రామాల్లోని రూ.15.63కోట్ల విలువైన 20,274 చెక్కులు పంపిణీ కాలేదు. మొత్తం 2,83,756 చెక్కులను పంపిణీకి సిద్ధం చేయగా.. వాటిలో 674 చెక్కులలో తప్పులు దొర్లాయి. 2,68,499 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అలాగే అటవీ భూములకు సంబంధించి 5,691 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఇక పంపిణీ కాని 20,274 చెక్కులలో మరణించిన రైతులు.. రెండు ఖాతాలున్నవి.. తమకు సాయం అవసరం లేదని వెనుకకు ఇచ్చినవి.. ప్రభుత్వ భూమికి సంబంధించినవి.. భూ వివాదాలు నెలకొన్నవి.. భూమి లేకపోయినా చెక్కులు జారీ అయినవి.. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో తప్పులు దొర్లినవి.. చెక్కులలో తప్పులు ఉన్నవి.. ఉన్న భూమి కంటే ఎక్కువ నిధులతో ఉన్న చెక్కులు.. సాగులో లేని భూమికి వచ్చిన చెక్కులు.. ఆధార్‌ లేని చెక్కులు.. గ్రామాల్లో లేని రైతుల చెక్కులు.. విదేశాల్లో ఉంటున్న రైతులకు సంబంధించినవి.. అమ్మిన భూములకు సంబంధించిన చెక్కులు.. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పెండింగ్‌ ఉన్న చెక్కులను పంపిణీ చేయలేదు. 

విదేశాల్లోని రైతులకూ.. 
గత ఖరీఫ్‌లో విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయలేదు. అయితే ప్రభుత్వం వీరికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా రైతులకు కూడా చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పంపిణీ కూడా కొనసాగనున్నది. జిల్లాలో మొత్తం 744 చెక్కులకు సంబంధించి రూ.60లక్షలు రైతులకు అందజేయాల్సి ఉంది.

చాలా సంతోషం.. 
తెలంగాణ ప్రభుత్వం అందించే వ్యవసాయ పెట్టుబడి రెండో విడత చెక్కులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. మొదటి విడతలో నాకు రూ.14వేలు వచ్చాయి. రెండో విడత కూడా రూ.14వేలు వస్తాయి. ప్రస్తుతం వ్యవసాయం పనులకు చాలా ఉపయోగపడతాయి. – ఎనికె జానకిరామయ్య, రైతు, అప్పలనర్సింహాపురం 

రైతుకు భరోసా.. 
ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు పెట్టుబడి పథకం ఇవ్వడం భరోసా కల్పించింది. నాకు మూడున్నర ఎకరాలకు పెట్టుబడి అందింది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సాగు చేశాను. ఇప్పుడు వ్యవసాయ పనులకు సరైన సమయంలో రైతుబంధు ఇస్తుండడం మంచి పరిణామం. – అమరగాని వెంకయ్య, రైతు, చెరువుమాదారం 

పంపిణీకి చర్యలు.. 
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతుబంధు చెక్కుల పంపిణీకి సంబంధించి చర్యలు చేపట్టాం. గతంలో ఖరీఫ్‌లో నిర్వహించిన విధంగానే చెక్కుల పంపిణీ చేపడతాం. ఇప్పటికే చెక్కులు బ్యాంకులకు చేరుతున్నాయి. వచ్చిన చెక్కులను సంబంధిత మండలాల అధికారులతో పరిశీలించే పనిని చేపట్టాం.   – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement