ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు సాయం..ఈ యాసంగి(రబీ) సీజన్‌లో ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. ఖజానాలో నగదు లేని కారణంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు జమ కాలేదు. ఖరీఫ్, రబీ ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.4వేలను పెట్టుబడిగా అందించాలనేది లక్ష్యం. జిల్లాలోని 20వేల మంది రైతులకు పలు కారణాలతో ఈ పథకం వర్తించలేదు. రబీలో కూడా ఖరీఫ్ మాదిరిగానే చెక్కుల విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కారణంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఆన్‌లైన్ విధానంలో నగదు జమ చేశారు.
జిల్లాలో రబీ సీజన్‌కు 2,69,438 మంది రైతులను రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరికి ఉన్న భూముల ఆధారంగా రూ.266.13కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 2,69,438 మంది రైతులు ఉండగా, వీరిలో 2,47,154 మంది బ్యాంక్ ఖాతాలను వ్యవసాయ విస్తరణాధికారులు ఆన్‌లైన్ చేశారు. వీరిలో 2,42,574 మంది రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు ట్రెజరీకి చేరాయి.
1.84లక్షల మందికి అందిన సాయం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ రైతుబంధు పథకం లబ్ధిదారుల వివరాలను, వారి బ్యాంక్ ఖాతాలను ట్రెజరీలకు అందించగా వీరిలో 1,84,806 మందికి లబ్ధి చేకూరింది. రైతుల ఖాతాల్లో రూ.185.48కోట్ల నగదును మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో ఇంకా 84,632 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.80.65కోట్లు అందాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటినా ఇంతవరకు రైతుబంధు పథకం ఊసే లేదు. ఖజానాలో నిధులు లేకనే లబ్ధిదారులకు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించలేకపోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సీజన్ సగానికి వచ్చినా..
అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలో అపరాలు, నూనె గింజల పంటలతోపాటు వరి నాట్లు వేశారు. వాటి సాగు కాలం కూడా సగానికి చేరింది. అపరాల పంటలు మరికొద్దిరోజుల్లో చేతికందనున్నాయి. ఖరీఫ్‌లో పంటల సాగుకు ముందుస్తుగా పెట్టుబడి సహాయం అందించిన ప్రభుత్వం..రబీలో బాగా వెనకబడిందని రైతులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి సహాయం అందకపోవడంతో గతంలో మాదిరిగానే వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకం నగదును తమ ఖాతాల్లో జమ చేసిందేమోననే ఆశతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపుజేయడంతో వీరు బ్యాంకులతోపాటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పెట్టుబడి డబ్బులు రాలేదు..
రబీలో అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఇంకా ఇవ్వలేదు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. వెంటనే అందజేస్తే ఉపయోగపడతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. మొక్కజొన్న, అపరాల పంటలు అప్పు చేసి వేసిన. రెండెకరాలకు అందే రూ.8వేల పెట్టుబడి సహాయం కోసం చూస్తున్నా. – భూక్య వీరన్న, బాలాజీనగర్ తండా, తిరుమలాయపాలెం మండలం
కొందరికి జమ కావాల్సి ఉంది..
రైతుబంధు పథకం కింద రబీలో జిల్లాలోని కొందరు రైతులకు నగదు అందాల్సి ఉంది. ఈ ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్‌లో అర్హులైన రైతుల వివరాలన్నీ రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయింది. ఆన్‌లైన్ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు పడుతోంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment