హన్మకొండ: వాన చినుకు పడింది మొదలు పొలం, సాగు పనులే లోకంగా అన్నదాతలు జీవనం సాగిస్తారు.. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇంకా చెబితే చీడపీడల కారణంగా అన్నదాతకు పంటలపై వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు.. ఫలితంగా ఎప్పటికప్పుడు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందించేందుకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున నగదు అందజేశారు. అయితే, గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టుబడి సాయాన్ని రూ.5వేలకు పెంచనున్నట్లు ప్రకటించిన టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ నగదును ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రణాళికాయుతంగా..
గత వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతుబంధు కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మూడో సారి ప్రస్తుత వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెలలో రైతులకు రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రబీలో రైతుబంధు అందించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నగదు రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. దీంతో అదే విధానాన్ని ఈ ఖరీఫ్‌లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే వివరాలన్నీ సిద్ధం కాగా.. ఈనెలలోనే రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేయనున్నారు.
11 మండలాలు... 77,079 మంది రైతులు
వరంగల్ అర్బన్ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 77,079 మంది రైతులు, 1,77,619.2 ఎకరాల సాగు భూమి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలోని రైతులకు రూ.88,81,25,992.5 పెట్టుబడి సాయం అందనుంది.
‘రైతుబంధు’వు రూ.88.81 కోట్లు
Published Fri, Jun 7 2019 1:08 PM | Last Updated on Fri, Jun 7 2019 1:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment