డబ్బుల్‌ ధమాకా | Rythu Bandhu Scheme Money Transfer To Farmers Accounts | Sakshi
Sakshi News home page

డబ్బుల్‌ ధమాకా

Published Sun, Jun 16 2019 1:18 PM | Last Updated on Sun, Jun 16 2019 1:18 PM

Rythu Bandhu Scheme Money Transfer To Farmers Accounts - Sakshi

తొలకరి జల్లులు కురిసింది మొదలు దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం ఇలా అన్నదాతకు ఎన్నో రకాల ఖర్చులుంటాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగుబాట పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా.. వర్షాభావం, కరువు కాటకాలతో పెట్టుబడి చేతికి రాకపోగా చివరికి చేసిన అప్పులే మిగులుతున్నాయి. మరోపని చేయలేక ఉన్న భూమిని నమ్ముకుని కష్టాల సాగు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వారి కష్టాలను దూరం చేసేందుకు.. మొహాల్లో చిరునవ్వును చిందించేందేకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పీఎం కిసాన్‌ పథకంలో ప్రతిరైతుకు రూ.6వేల చొప్పున అందిస్తోంది.  వారి వివరాలు కూడా కలిపితే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

సాక్షి, మెదక్‌ : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌సమ్మన్‌ నిధి పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పేర్కొంది. జిల్లాలో ఐదెకరాల లోపు 1,18,386 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.71కోట్ల 30 లక్షల 16వేలు అవుతోంది. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇంకా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు రాని వారు చాలా మంది ఉన్నారు.

రైతుబంధుతో  రూ.372 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించేది. దానిని ప్రస్తుతం రూ.5 వేలకు పెంచింది.  ఖరీఫ్, రబీసీజన్‌ కలిపి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇవ్వనుంది. జల్లాలోని 2,11,104 మంది లబ్ధిదారులలు 3.70 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.372 కోట్లను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించనుంది. 
ఎకరం భూమి ఉన్న రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ.16 వేల చొప్పున అందిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జిల్లా రైతులకు రూ.443 కోట్ల 30 లక్షల 16వేలను అందిస్తున్నాయి. 

‘రైతుబంధు’ అందింది
ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అన్నదాతలకు గొప్పవరం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత మంచి పథకాన్ని తీసుకురాలేదు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం హర్షించదగిన విషయం. నాకు ఉన్న రెండన్నర ఎకరాలకు సంబంధించి రూ.12,500 వచ్చింది. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేదు. – కొమ్మాట బాబు, రైతు, నిజాంపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement