ఎవరికీ పట్టని కౌలు రైతు | All Telangana Schemes Are Not Apply Farmers | Sakshi
Sakshi News home page

ఎవరికీ పట్టని కౌలు రైతు

Published Sat, May 18 2019 1:16 PM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

All Telangana Schemes Are Not Apply Farmers - Sakshi

హత్నూర(సంగారెడ్డి): సాగు చేసేందుకు సొంత భూమి లేక.. కూలీగా మిగలలేక.. ఆసాముల దగ్గర భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు దూరంగా కష్టాల్లోనే మగ్గుతున్నారు. పెట్టుబడికి బ్యాంకు లోను రాక, అప్పు పుట్టేదారి లేక పుట్టెడు దుఃఖంలోనే తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు. సొంత భూమి లేని కౌలు రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది.

ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరవడంతోపాటు, గిట్టుబాటు ధర దక్కక కౌలు రైతులు కుదేలవుతున్నారు. కౌలు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా సరైన ధర పడుతుందన్న నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, నీళ్ల కరువు ఎప్పుడూ కౌలు రైతులను భయపెడుతూనే ఉంటాయి. భూమికి కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్‌ మీద బెంగ గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుంది. సాగు సగంలోకి వచ్చాక పంటలకు నీళ్లందకపోతే పెట్టుబడి సొమ్ముతోపాటు కౌలు డబ్బులు నష్టపోయి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నా కౌలు రైతులను గాలికొదిలేశాయి. 2014 లోనే తమను కౌలుదారులుగా గుర్తించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వాలందించే సహాయం పట్టాదారుడికే చెందుతుండడం కౌలు రైతులకు కన్నీటినే మిగుల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కౌలు రైతులు ఉన్నారు.

2014వ సంవత్సరంలో 7000 మంది తమను కౌలు రైతులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా జీఓలు తీసుకువచ్చి గుర్తింపు కార్డులైనా ఇవ్వాలని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కౌలుదారులకు లోన్‌ ఎల్జిబిలిటీ కార్డులు జారీ చేస్తే బ్యాంకు రుణాలు దక్కేవి. పంట నష్ట పరిహారం అందడంతోపాటు విత్తనాలు, ఎరువులు రాయితీపై అందేవి. కానీ ఇలాంటి ఏ సౌకర్యానికీ నోచుకోక కౌలు రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఒకేసారి కౌలు మొత్తం చెల్లించాలి
 భూ యజమానికి పంట సాగు చేయడానికి ముందే కుదుర్చుకున్న కౌలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. పంటలు దిగుబడి వచ్చినా, రాకున్నా భూ యజమానికి సంబంధం ఉండదు. ఏడాదికి వర్షాధారిత భూములకు గతంలో ఎకరాకు రూ. 6 వేలు, సాగునీటి సౌకర్యం ఉన్న భూములకు రూ. 10 వేల కౌలు ఉండేది. ప్రస్తుతం వర్షాధార భూములకు రూ.15 వేలు సాగునీటి సౌకర్యం ఉన్న వాటికి రూ. 25 వేల వరకు కౌలు వసూలు చేస్తున్నారు.
 
జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు
 
ఏడాదిగా కౌలు రైతుల ఆత్మహత్యలు జిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సాయానికి నోచుకోక పంట పెట్టుబడులకు అప్పులు చేసి ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. పంట దిగుబడి రాక, వచ్చిన పంటకు గిట్టుబాటు లభించక మరింత నష్టపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రకటించినప్పటి నుంచి జిల్లా 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్నూర మండలంలో  నవాబుపేట, పన్యాల, బడంపేట, సికింద్లాపూర్, దౌలాపూర్, చింతల్‌చెరువు, గ్రామాలతోపాటు జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, పుల్‌కల్, వట్‌పల్లి,  కంది తదిదర మండలాల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. 

 కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నా. ప్రస్తుతం నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నప్పటికీ పంట పండలేదు. కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. – రవి, కౌలు రైతు, బడంపేట

ప్రభుత్వం కౌలు రైతులకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలి. సాగు సాయం చేస్తే కౌలు రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అప్పులు చేసి పంట సాగు కోసం కౌలు చేస్తున్నప్పటికీ లాభం లేదు. అరకొర పండిన పంటకు సైతం గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు. కౌలు రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా పథకం కూడా వర్తింపజేయాలి.– ఎల్లయ్య, కౌలు రైతు, మారేపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement