రైతుబంధు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే కమలాకర్ (ఫైల్)
కరీంనగర్‌రూరల్: రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులందరికీ అందడం లేదు. అర్హులైన రైతులకు సకాలంలో సాయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఎకరానికి పెట్టుబడిసాయం కింద రూ.8వేలను రెండు విడతలుగా అందిస్తున్నారు. మొదటి విడతలో రూ.4వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమైనప్పటికీ రెండో విడత రబీసీజన్ ఆరంభంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంతమంది రైతులకు అందలేదు. పలువురు రైతులకు సాంకేతిక కారణాలతో డబ్బులు రాలేదు. రబీసీజన్ ప్రారంభమై మూడు నెలలవుతున్నప్పటికీ కొంతమందికి పెట్టుబడిసాయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రెండో విడతలో జాప్యం..
కరీంనగర్ మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల పరిధిలో 7495 వేల మంది రైతులను రైతుబంధు పథకం కింద ఎంపిక చేసి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీరిలో 7436 మంది రైతుల వివరాలను ట్రెజరీకి పంపించగా 6694 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయి. ఇంకా మిగిలిన 286 మంది రైతులకు పలు సాంకేతిక కారణాలతో ఇంతవరకు డబ్బులు జమకాలేదు. అయితే శాసనసభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుబంధు బడ్జెట్‌ను విడుదల చేయడంతో కొంతమంది రైతులకు మాత్రమే ఆర్థికసాయం మంజూరైంది. అనంతరం పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధుల విడుదలలో జాప్యం కావడంతో రైతుల బ్యాంకుఖాతాల్లోకి డబ్బులు జమకాలేని పరిస్థితి నెలకొంది. డబ్బుల కోసం వ్యవసాయాధికారులు, బ్యాం కుల చుట్టు రైతులు ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రెండో విడత డబ్బులు రాలేదు..
నాకు 5 ఎకరాల పొలముంది. రైతుబంధు పధకం మొదటి విడతలో రూ. 20వేల చెక్కు ఇచ్చారు. రెండో విడత డబ్బులు ఇంకా రాలేదు. అధికారులను అడిగితే వస్తాయంటున్నారు. అప్పులు తెచ్చి పంటలకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. – గొంకటి రాజిరెడ్డి, రైతు, గోపాల్‌పూర్
బ్యాంకు ఖాతాల్లో జమ
రబీ సీజన్‌కు సంబంధించి రెండో విడత రైతుబంధు పథకం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. కొందరు రైతులు సకాలంలో పట్టా దారు పాసుపుస్తకాలివ్వకపోవడం, స్థానికంగా లేకపోవడంతో ఆన్‌లైన్ చేయడంలో జాప్యం ఏర్పడింది. - బి.సత్యం, మండల వ్యవసాయాధికారి
గ్రామాల వారీగా రైతుల వివరాలు ...
గ్రామం | ఆన్‌లైన్ నమోదు | ట్రెజరీ | ఖాతాల్లో జమ | అందని రైతులు |
చామన్‌పల్లి | 862 | 858 | 791 | 23 |
ఎలబోతారం | 377 | 373 | 338 | 11 |
ఫకీర్‌పేట | 108 | 107 | 102 | 02 |
జూబ్లీనగర్ | 363 | 360 | 332 | 14 |
కొండాపూర్ | 215 | 215 | 182 |
24 |
బొమ్మకల్ | 824 | 821 | 778 | 14 |
చేగుర్తి | 443 | 435 | 418 | 11 |
దుర్శేడ్ | 893 | 893 | 833 | 29 |
చెర్లభూత్కూర్ | 597 | 596 | 531 | 16 |
ఇరుకుల్ల | 425 | 423 | 381 | 14 |
మొగ్ధుంపూర్ | 644 | 640 | 569 | 21 |
ఆరెపల్లి | 375 | 365 | 278 | 21 |
నగునూరు | 1089 | 1080 | 920 | 72 |
వల్లంపహాడ్ | 280 | 270 | 241 | 14 |
Comments
Please login to add a commentAdd a comment