న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు గడిచిన పదేళ్ల కాలంలో సాగు రంగానికి సంస్థాగత రుణ సాయం గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి ఇనిస్టిట్యూషన్లు (బ్యాంక్‌లు) ఇచి్చన రుణ వితరణ రూ.7.3 లక్షల కోట్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) పది నెలల్లో (2024 జనవరి చివరికి) రూ.20.39 లక్షల కోట్లకు (1,268 లక్షల ఖాతాలు) చేరుకున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
నిజానికి 2023–24 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా, అది మరో రెండు నెలలు మిగిలి ఉండగానే చేరుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి సాగు రంగానికి రుణాలు రూ.22 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. స్వల్పకాలిక సాగు రుణాలు రూ.3 లక్షల వరకు ఉండే వాటికి కేంద్ర వ్యవసాయ శాఖ వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద రైతులు 7 శాతానికే రుణ సాయం పొందొచ్చు.
కేంద్రం తనవంతుగా బ్యాంక్‌లకు 2 శాతం సమకూరుస్తోంది. 2022–23 సంవత్సరానికి పంపిణీ చేసిన సాగు రుణాలు రూ.21.55 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అదే ఏడాదికి కేంద్రం విధించుకున్న లక్ష్యం రూ.18.50 లక్షల కోట్లను మించిన సాయాన్ని బ్యాంకులు అందించాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)పై 4 శాతం రేటుకే అందించే రుణ సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్య్సకార రైతులుకు కూడా విస్తరించిన విషయాన్ని సదరు అధికారి గుర్తు చేశారు. 2023 మార్చి నాటికి 7,34,70,282 కేసీసీ ఖాతాలకు సంబంధించిన బకాయిలు రూ.8,85,463 కోట్లుగా ఉన్నాయి.
.2.81 లక్షల కోట్ల సాయం
పీఎం–కిసాన్ పథకం కింద కేంద్రం అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏటా రూ.6,000 చొప్పున అందిస్తుండం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.2.81 లక్షల కోట్లను ప్రత్యక్ష బదిలీ ద్వారా అందించినట్టు సదరు అధికారి తెలిపారు. సాగు పెట్టుబడి అవసరాలకు సాయంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా గడిచిన పదేళ్లలో పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. మోదీ సర్కారు వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె గింజలను ఎంఎస్‌పీపై రైతుల నుంచి సమీకరిచేందుకు గడిచిన పదేళ్ల కాలంలో రూ.18.39 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. యూపీఏ పదేళ్ల కాలంలో అందించిన రూ.5.5 లక్షల కోట్ల కంటే మూడు రెట్లు అధికమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment