రైతులకు మరో చాన్స్‌ | Telangana's Rythu Bandhu Scheme Fails Farmers One Chance | Sakshi
Sakshi News home page

రైతులకు మరో చాన్స్‌

Published Sat, May 18 2019 12:42 PM | Last Updated on Sat, May 18 2019 12:42 PM

Telangana's Rythu Bandhu Scheme Fails Farmers One Chance - Sakshi

సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తున్న అప్పటి మంత్రి హరీశ్‌రావు

రబీలో పంట సాగు చేసి రైతుబంధు పథకం పొందని వారికి శుభవార్త. రబీలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని, రైతుబంధు పథకం వర్తించని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. కొంతమంది రైతులు అర్హులయినప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నూతన పాసుపుస్తకాలు అందక ప్రభుత్వ సాయానికి నోచుకోలేదు. రబీ దరఖాస్తుల గడువు ముగిసిన తరువాత రెవెన్యూ యంత్రాంగం పట్టాపాస్‌ పుస్తకాలను అందించింది. అయితే అధికారులు గత సంవత్సరం నవంబరు నుంచి వరుస ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికలు కూడా ముగియడంతో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రైతులకు రైతుబంధు వర్తించనుంది. ఇటీవలనే తిరిగి రబీ ఆన్‌లైన్‌ సైట్‌ని రీ ఓపెన్‌ చేశారు. 

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 2,81,938 మంది రైతులు ఉండగా, కేవలం 2,49,104 మంది మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు అందుకున్నారు. మిగతా 32,834 రైతులు తమవద్ద తగిన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరికి అందించాల్సిన రూ. 22,96,08,570 సొమ్ము వ్యవసాయ శాఖ దగ్గర జమయి ఉన్నాయి.

తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోని రైతులను గుర్తించి వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రాగానే పూర్తి వివరాలతో కూడిన ప్రతులను ఏఈఓల ద్వారా రైతులకు అందించనున్నారు. ఈ ప్రకారం రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లతో ఫాం నింపి ఏఈఓకు ఈ నెల 31 వరకు అందించాల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.

బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండొద్దు
రైతుబంధు కోసం దరఖాస్తు చేస్తుకున్నా అనివార్య కారణాలతో బ్యాంకుల్లో చాలామంది రైతులకు సంబంధించి తిరస్కరించారు. ఇందులో అధికంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలను అందించినా డబ్బులు జమ కాలేదు. కొంత మందికి ఖాతాలో జమయినట్లు సమాచారం (మెస్సేజ్‌) వచ్చినా తీరా చూస్తే పాత బ్యాలెన్స్‌ మాత్రమే ఉంది. ఇలాంటి వారికి అధికారులు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు తెలుసుకున్నాక సంబంధిత గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు కొత్త అకౌంట్‌ నంబర్లు ఇచ్చినట్లయితే ఇంతకుముందువలె ఎకరానికి రూ. 4 చొప్పున అందించనున్నారు.

కాగా ఈ సహాయాన్ని ఈ ఖరీఫ్‌ నుంచి ఎకరానికి రూ.5వేలు చేయనున్నారు. జిల్లాలో రబీలో 32,834 మందికి రైతుబంధు అందలేదు. బ్యాంకు ఖాతా వివరాలను రైతులు సరిగ్గా ఇవ్వాలని, ఒక్క అంకె తప్పు పడినా ఇబ్బంది తప్పదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.

జూన్‌ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాల్లో వేయనున్నామని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రకటించింది. తొలకరి వర్షాలు కురిసే నాటికి ఖరీఫ్‌ సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభుత్వం ఒక్కో సీజన్‌కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇవ్వగా.. ఎన్నికల హామీ మేరకు ఈ ఖరీఫ్‌ నుంచి రూ. 5 వేలు ప్రతీ సీజన్‌కు ప్రతీ ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.  గతంలో రైతుబంధు రానివారికి  రబీకి సంబంధించి ఎకరానికి రూ.4వేలు ఇవ్వనున్నారు.  

రైతుబంధు రాని అర్హులైన రైతులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. గత రబీ సీజన్‌లో పట్టాదారు పాసుపుస్తకాలు లేక, బ్యాంకు ఖాతా నంబర్లు తప్పులు, తదితర కారణాల వల్ల సుమారుగా 32,834 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు పథకం లబ్ధిదారులకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసి ఖాతాల్లో జమ చేయడానికి అనుమతిస్తే అప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తాం. ఈ సీజన్‌లో ప్రతీ ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. బి.నర్సింహారావు, జేడీఏ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement