రెవెన్యూ అధికారులకు భూమి శిస్తు చెల్లించిన రసీదులు చూపిస్తున్న రంగంపల్లి రైతులు
షాద్‌నగర్ రూరల్: ఆ భూములను స్థానిక రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. కౌలుదారు హక్కు కలిగి భూమి శిస్తు చెల్లిస్తూ పంటలు పండించుకుంటున్నారు. అయితే, ఆ భూములు శ్రీ సీతారామస్వామి దేవాలయానికి చెందినవని రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇది తెలుసుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు బతుకుదెరువు అయిన భూములను వదులుకోబోమన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో రాజోలి లక్ష్మణ్‌రావుకు కొన్నేళ్ల క్రితం 351 నుంచి 401 సర్వే నంబర్లలో సుమారు 140 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిని గ్రామ రైతులు సాగుచేసుకుంటూ పట్టాదారు అయిన రాజోలి లక్ష్మణ్‌రావుకు శిస్తులు చెల్లించే వారు. కాలక్రమేణ రాజోలి లక్ష్మణ్‌రావు సదరు భూమిని చేవెళ్ల డివిజన్ షాబాద్ మండల పరిధిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం రాసినట్లు గ్రామస్తులు తెలిపారు. 1960 సంవత్సరం వరకు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రాజోలి లక్ష్మణ్‌రావు పేరు పైనే ఉన్నాయి. ఆ తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని రికార్డులు చెబుతున్నాయి. 1960 నుంచి 2012 వరకు రెవెన్యూ రికార్డుల్లో రైతులు కౌలుదారులుగా ఉన్నారు. ఆ తర్వాత 2012 నుంచి దేవాదాయశాఖ భూములుగా మారి కౌలుదారులుగా ఉన్న రైతుల పేర్లు రికార్డుల్లో కనిపించడం లేదు.
న్యాయం కోసం రైతుల పోరాటం
రాజోలి లక్ష్మణ్‌రావు పేరు పైన ఉన్న భూములు దేవాదాయ శాఖకు చెందినవిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పు జరగడంతో రైతులు పోరాటం ప్రారంభించారు. ఈ విషయమై 2007లో ఓఆర్‌సీలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవా కావా అని తెలియజేయాలని హై కోర్టు దేవాదాయ శాఖ అధికారులను కోరింది. దీంతో రైతులు అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ భూములకు సంబందించిన వివరాలను ఇవ్వాలని కోరారు.
రెండు జిల్లాల్లోనూ ఈ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినవి కావని అధికారులు తెలిపారు. దీంతో హైకోర్టు రైతులు సాగు చేస్తున్న భూములకు ఓఆర్‌సీలు ఇవ్వాలని అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్డీఓను ఆదేశించింది. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓఆర్‌సీ రాకపోవడం, ఆర్డీఓలో రైతులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు రంగారెడ్డి జిల్లా జేసీ వద్దకు అప్పీలుకు వెళ్లారు. ఇటీవల జేసీ వద్ద కూడా రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
భూముల స్వాధీనానికి అధికారుల యత్నం
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తీర్పుతో రంగంపల్లి గ్రామశివారులోని భూములు రంగారెడ్డి జిల్లాషాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబందించినవని దేవాదాయ శాఖ అధికారులు గత పది రోజుల క్రితం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకొని భూమిలో పాతిన బోర్డులను తొలగించారు. భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో దేవాదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు.
ఊరు కనుమరుగుకానుంది!
గ్రామంలో 100 కుటుంబాలు ఉండగా దాదాపుగా 700 జనాభా ఉంది. ఆ గ్రామస్తులకు వ్యవసాయ మే జీవనాధారం. గ్రామ శివారులోని 140 ఎకరా ల భూమిని సాగుచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ గ్రామంలోని 90శాతం రైతులకు పట్టా భూములు లేవు. దీంతో ఆ గ్రామ రైతులు లక్ష్మణ్‌రావుకు చెందిన ఈ భూమిలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తాము నిర్మించుకున్న ఇళ్లు కూడా ఈ భూముల్లో ఉన్నాయని, అధికారులు భూ ములను స్వాధీనం చేసుకుంటే ఊరే ఖాళీ అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడు పోతే ఎక్కడ ఉండాలి
కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను కూడ బెట్టి ఉండడానికి వంద గజాల స్ధలంలో ఇల్లు కట్టుకున్నాం. మేము కట్టుకున్న ఇళ్ళ స్ధలాలు సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. మేము వ్యవసాయం చేసుకొని జీవనోపాధిని పొందుతున్న భూములు కూడా దేవాలయం భూములే అంటున్నారు. మేము చదువుకోకపోవడంతో భూములకు సంబంధించిన రికార్డులను తెలుసుకోలేకపోతున్నాం. వందల ఏళ్ళ నుంచి సాగుచేస్తున్న భూములు ఇప్పుడు దేవాలయం భూములు అంటే మేము ఎలా బతికేది. సర్వే చేసిన తర్వాత ఇళ్లను కూడా ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇళ్లు పోతే మేము ఎక్కడ జీవించాలి. అధికారులే న్యాయం చేయాలి
ఆ భూములే మాకు జీవనాధారం
ప్రస్తుతం దేవాలయ భూములుగా చెబుతున్న పొలాన్ని కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పట్టాదారుడి పేరు మీద ఉన్న పొలాల్లో తాము కౌలుదారులుగా ఉన్నాం. ఆ పొలాలు ఇప్పుడు దేవాలయం భూములని చెబుతున్నారు. భూములు స్వాధీనం చేసుకుంటే మేము జీవనోపాధిని కోల్పోతాం. – పురుగుల ఎల్లయ్య, రైతు, రంగంపల్లి
నిబంధల ప్రకారం భూములు ఆలయానికి చెందినవి
రెవెన్యూ రికార్డుల ప్రకారం రంగంపల్లిలోని భూములు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవి జిల్లా జాయింట్ కలెక్టర్ ఇటీవల తీర్పు ఇచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాం. గ్రామస్తులు అడ్డుకొని గొడవ చేశారు. దీంతో భూములు ఖాళీ చేసేందుకు వారికి కొద్ది సమయం ఇచ్చాం. – శ్రీనివాసశర్మ, ఈఓ, శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, షాబాద్ మండలం
Comments
Please login to add a commentAdd a comment