నెల్లికుదురు : రైతుకు బ్యాంకు రుణం కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం.. మీ సేవా ద్వారా తీసిన పహనీ నకల్, ఓటరు ఐడీ కార్డు తదితరాలు తప్పనిసరి ఉండాల్సిందే. ఇవన్నీ ఉన్నా కొర్రీలు పెడుతూ బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకునే బ్యాంకు అధికారులు.. సెంట్ భూమి లేనివారికి కూడా లక్షలాది రూపాయల రుణాలిచ్చారు. కేవలం తెల్లకాగితంపై భూమి ఉన్నట్లు తహసీల్దార్, వీఆర్వో రాసిస్తే ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం మంజూరు చేశారు.
ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఇలా ఏకంగా సుమారు 480 మంది బినామీలకు రుణాలిచ్చారు. దళారులు, రెవె న్యూ, బ్యాంకు అధికారులు కుమ్మక్కయి కోట్లు కొల్లగొట్టారు. మహబూబాబాద్ మండలం అమనగల్ సిండికేట్ బ్యాంకు కేంద్రంగా సాగిన ఈ దందా నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం, ఆలేరు, బంజర గ్రామా ల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమనగల్ సిండికేట్ బ్యాంకు అధికారు లు నర్సింహులగూడెం ఆలేరు, బంజర గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ మూడు గ్రామాలకేగాక మరికొన్ని గ్రామాలకు కలిపి 1830 మందికి సుమారు రూ.14 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఇటీవల ఈ జాబితా కూడా విడుదల చేశారు. ఏ బ్యాంకులోనైనా నిబంధనల ప్రకారం రైతులకు రుణా లు మంజూరు చేయాలంటే పట్టాదారు పాసుపుస్తకాలు, మీ సేవా ద్వారా పొందిన పహనీ నకల్, రైతుల వివరాలు సక్రమంగా ఉండాలి.
రుణానికి దరఖాస్తు చేసుకున్న రైతు భూమిని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించాకే రుణం మంజూరు చేస్తారు. కానీ అమనగల్ సిండికేట్ బ్యాంకులో ఆ డాక్యుమెంట్లేవి లేకుం డానే ఇక్కడ రుణాలు మంజూరు చేశారు. దళారుల ప్రమేయంతో భూమి లేని వ్యక్తుల పేరిట రుణాలిచ్చారు. తెల్లకాగితంపై ఫలానా వ్యక్తికి ఫలానా సర్వే నంబర్‌లో ఇంత భూమి ఉన్నదని వీఆర్వో, తహసీల్దార్ రాసిచ్చి, సంతకాలు పెట్టి, ముద్రలు వేస్తేచాలు.. అప్పటి సిండికేట్ బ్యాంకు మేనేజర్ పులిపాక కృపాకర్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మంజూరు చేశారు.
ఇలా కేవలం వీఆర్వో, తహసీల్దార్ ధ్రువీకరించిన కాగితాల ఆధారంగా బంజర, ఆలేరు, నర్సింహులగూడెం గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కలిసి సుమారు 480 మంది భూమి లేని వ్యక్తులకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రుణాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ తతంగమంతా నెల్లికుదురు తహసీల్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు అనుమానాలున్నాయి.
వెలుగు చూసిందిలా..
రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి సెప్టెంబ ర్ 5న చదివి వినిపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. బంజర గ్రామంలో 310 మంది రుణాలు తీసుకున్నట్లు జాబితా ఉండ గా.. కేవలం 56 మంది పేర్లనే బ్యాంకు అధికారులు గ్రామసభకు పంపారు. మిగతాపేర్లను నర్సింహులగూడెం గ్రామ జాబితాలోకి మార్చారు. దీంతో అసలు విషయం బయటపడింది.
గ్రామసభ నిర్వహించిన బంజర సర్పంచ్ నెలకుర్తి వెంకట్‌రెడ్డి గ్రామస్తుల సమక్షంలో తమ గ్రామంలో రుణాలు తీసుకున్న వారి మొత్తం జాబితాను తమకివ్వాలని తీర్మా నం చేసి గ్రామ ప్రత్యేక అధికారి ఆర్‌ఐ లచ్చునాయక్ అందజేశారు. అయినా రెవె న్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నెల్లికుదు రు తహసీల్దార్ తోట వెంకట నాగరాజును వివరణ కోరగా.. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు.
ఇదిలా ఉండగా అసలు మంజూరైన రుణాలను భూమి లేని రైతులైనా తీసుకున్నా రా ? లేదంటే దళారులు, అధికారులే బినామీల పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేశారా ? అనేది ఉన్నతాధికారులు విచారణ చేపడితేనే వెలుగు చూసే అవకాశముంది.
రైతు రుణాలు మింగిన నకిలీలు
Published Mon, Oct 20 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
Advertisement