తేడాలొస్తే అధికారులదే బాధ్యత
ఓటర్ల గుర్తింపు కార్డుల జారీని వేగవంతం చేయండి
కలెక్టర్లు, ఎస్పీలకు ముకేశ్‌కుమార్ మీనా ఆదేశం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని.. అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం సూచించిన ఈ రెండు మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్‌కు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు.
త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమైన ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనలు, 50% పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, రోజూ వారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లకు ఆయన వివరించారు.
గుర్తింపు కార్డుల జారీని వేగిరపర్చండి
ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని మీనా ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బటా్వడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్‌గా పంపిణీ చేయడానికి వీలు లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. పెండింగ్ ఫారాలను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫారాల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పర్చాలని ఆదేశించారు.
ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్టు వార్తా పత్రికల్లో కథనాలతో పాటు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిన సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్‌బీ బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతోపాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమలుచేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతోపాటు అదనపు సీఈవో ఎంఎన్ హరేందిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment