సాక్షి, అమరావతి: రానున్న సాధారణ ఎన్నికల సక్రమ నిర్వహణకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న వివిధ విభాగాల అధికారుల ఖాళీల భర్తీతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాతో సీఎస్ జవహర్‌రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు.
అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు..
ఇక రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర అధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించాలని.. దీనిపై ఒడిశా సీఎస్‌తో తాను మాట్లాడతానన్నారు. అలాగే, ఎన్నికలు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన ప్రక్రియని.. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా సంబంధిత శాఖలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన..
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9న రాష్ట్రానికి రానుందని తెలిపారు. 10న విజయవాడలో సీఎస్, డీజీపీ, సీఈఓ సహా ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్ అండ్ బీ, అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని.. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దృష్టికి తీసుకొచ్చి వీటిపై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేయాల్సి ఉందని సీఎస్‌కు చెప్పారు.
అలాగే, వివిధ పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటుచేయాల్సిన సౌకర్యాలపైనా ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించాల్సి ఉందని సీఈఓ చెప్పగా.. వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సీఎస్ జవహర్‌రెడ్డి కోరారు. ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గిరిజాశంకర్, అదనపు పీసీసీఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్, రవాణా శాఖ కమిషనర్ మణీష్‌కుమార్ ఎస్‌ఎల్బీసీ కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆదే విధంగా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి. రాజశేఖర్, రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్, సీడీఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
చెక్‌పోస్టులో నిఘా మరింత ముమ్మరం..
రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులున్నాయని, వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీసు చెక్‌పోస్టులు, 14 అటవీ చెక్ పోస్టులున్నాయని వీటన్నింటి ద్వారా నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు ముఖేష్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment