nidadhavole
-
ఆ అక్రమాలు శాంపిల్ మాత్రమే..!
సాక్షి, నిడదవోలు: ఐటీదాడుల్లో వెలుగు చూసిన అక్రమాలు శాంపిల్ మాత్రమేనని..టీడీపీ ముఖ్య నేతలపై కేంద్రం దృష్టి సారిస్తే నమ్మలేని వాస్తవాలు బయటకు వస్తాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, కుంభకోణాలను వెలికితీయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.(ఐటీపై ఎల్లో డ్యాన్స్) ఐటీ దాడుల్లో వెలుగు చూసిన రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో కూడా వేల కోట్లు చేతులు మారాయని.. వీటిపై కేంద్రం విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపట్టాలని శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') -
వాళ్లేమన్నా చట్టానికి చుట్టాలా..?
సాక్షి, నిడదవోలు: సుబ్బారావుకు రూ.750 కరెంట్ బిల్లు వచ్చింది. డబ్బులు లేకపోవడంతో రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లిద్దామని అనుకున్నాడు. కానీ విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి నానా హడావుడి చేసి సరఫరా కట్ చేశారు. పరీక్ష ఫీజు నిర్ణీత సమయంలో చెల్లించకపోతే ఫైన్లు వేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన చలానాలు కట్టకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పనిచేసే అధికారులు సామాన్యులకు కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంటారు. కానీ ఆనిబంధనలు వారికి మాత్రం వర్తించవు. మునిసిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏళ్ల తరబడి చెల్లిండం లేదు. పన్ను చెల్లించకపోతే నీటి కుళాయి కనెక్షన్ కట్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సామాన్యులకు మునిసిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు సామాన్యులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల గృహాలకు మినహాయింపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. బకాయిలు రూ.లక్షలు దాటుతున్నాయి. అయినా వారిపై వీసమెత్తు చర్యలకైనా సిద్ధపడటం లేదు. దరి చేరని లక్ష్యం నిడదవోలు పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులైన ఆస్థి, ఆదాయ పన్నులు, షాపుల అద్దెలు, వివిధ రూపాల్లో ప్రకటనలు ద్వారా రావాల్సిన ఆదాయం అంతంత మాత్రంగానే వసూలవుతోంది. పట్టణంలో వివిధ కేటగిరీలకు చెందిన గృహ సముదాయాలు, కమర్షియల్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పురపాలక సంఘానికి 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.26 కోట్లు ఆదాయం పన్నుల రూపంలో రావాల్సి ఉంది. పన్నుల వసూళ్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.2.05 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ఇంకా రూ.1.21 కోట్లు రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం నీటి పన్ను రూ.45 నుంచి రూ.100లకు పెంచడంతో పట్టణంలో ఉన్న 5,125 వేల మంచినీటి కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి పన్నుల రూపంలో ఈఏడాది రూ.66 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.42 లక్షలు వసూలయ్యాయి. ఏటా సంతమార్కెట్ ద్వారా మాత్రమే మునిసిపాలిటీకి పన్నులు సకాలంలో అందుతున్నాయి. పెంచిన ఆస్థి పన్ను ప్రకారం అందరికీ నోటీసులు జారీ చేసినప్పటికీ చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మార్చి నెలాఖరునాటికి పూర్తిస్ధాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. పేరుకుపోతున్న బకాయిలు నిడదవోలు పురపాలక సంఘానికి ఆస్థి, నీటి పన్నులు, ప్రకటనలు, మున్సిపల్ షాపులు, కమర్షియల్ షాపుల ద్వారానే కాకుంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. పట్టణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు గత ఏడేళ్లుగా పన్నులు చెల్లించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెడ్ నోటీసులు జారీ చేశాం పట్టణంలో భవన యజయానులు, షాపుల యజమానులు ఆస్తి పన్నుతో పాటు నీటిపన్నులు కూడా చెల్లిస్తే ఈ నెలాఖరు నాటికి 100 శాతం వసూళ్లు పూర్తవుతాయి. పురపాలక సంఘం పరిధిలో అన్ని రకాల పన్నుల వసూళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. మొండి బకాయిల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశాం. –ఎస్. నాగేశ్వరరావు, మున్సిపల్ రెవెన్యూ అధికారి -
బంగారం కోసం వృద్ధురాలి హత్య
నిడదవోలు : పట్టణంలో మంగళవారం జరిగిన వృద్ధురాలి హత్య కలకలం రేపింది. బంగారం కోసం దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రామ్‌నగర్ అయ్యప్పస్వామి గుడి సమీపంలో పన్నీరు చక్రవేణి (75) అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసముంటుంది. ఆమెకు భర్త, పిల్లలు ఎవరూ లేరు. బంధువులు పంపిన సొమ్ముతోపాటు చిన్నపాటి చీటీల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న చక్రవేణి పీక నులిమి హతమార్చారు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఓ గుర్తుతెలియని మహిళ గాజు ముక్కలు గదిలో పడ్డాయి. వీటిని పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం దుండగులు వృద్ధురాలి చెవికి ఉన్న దుద్దులను బలవంతంగా లాక్కున్న గుర్తులు కనిపించాయి. వాటితోపాటు టేబుల్ సరుగులో ఉన్న సుమారు ఐదు కాసుల బంగారపు తాడు, గాజులు తీసుకుని దుండగులు పరారయ్యారు. వేకువజామునే నిద్రలేచే అలవాటు ఉన్న వృద్ధురాలు ఉదయం 8 గంటలైనా బయటకు రాకపోవడంతో ఆ వీధి పక్కనే ఉన్న బంధువులు వచ్చి తలుపు తెరచి చూశారు. దీంతో మంచంపై విగతజీవిగా పడి ఉన్న వృద్ధురాలు కనిపించింది. సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, పట్టణ ఎస్సై భగవాన్‌ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏలూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. జాగిలం స్థానికంగా ఉన్న రెండు ఇళ్ల వద్ద కలియతిరిగి సిమెంట్ రోడ్డు మీదుగా నిడదవోలు – పంగిడి ప్రధాన రోడ్డు మీదుగా వెళ్లింది. ఏలూరు నుంచి వచ్చిన వెలిముద్రల నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాగా తెలిసిన వాళ్లే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇద్దరు అనుమానితులను పోలీసు స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా
నిడదవోలు : ఒడిశాలో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు, లారీడ్రైవర్ మోసుగంటి వరప్రసాద్(42)ది హత్యేనని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్ ఆరోపించారు. వరప్రసాద్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, దళితులు బుధవారం మండలంలోని సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. డేవిడ్‌కుమార్ మాట్లాడుతూ.. వరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తున్నారని, అతనిది హత్యేనని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరప్రసాద్ వద్దకు ఇటీవల పెరవలి మండలం నడుపల్లికోటకు చెందిన షేక్ వలీ వచ్చి ఖండవల్లికి చెందిన లారీ ఓనర్ రవి(బాబి)కి రూ.3000 అప్పు ఉన్నావు కదా, అందుకు ఆయన లారీపై పనిచేయాలని చెప్పాడు. లేకుంటే ఆయన నిన్ను ఏదో ఒకటి చేస్తాడని బెదిరించి వరప్రసాద్‌ను డ్యూటీకి తీసుకెళ్లాడు. ఈనెల 14న లారీ ఓనర్ రవి పెండ్యాలకు వచ్చి వరప్రసాద్ ఆచూకీ తెలియడం లేదని, ఫోన్ పనిచేయడం లేదని అతని భార్య శ్రీలతతో చెప్పాడు. తిరిగి లారీ ఓనర్ ఈనెల 15న మృతుడు తల్లికి ఫోన్‌చేసి ఒడిశా రావాలని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లగా, ఓ మెడికల్ కాలేజీలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఓ పక్కన ఉంచారు. ఏమైందని అడిగితే వరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఓనర్ అంబులెన్సులో మృతదేహాన్ని పెట్టి కనిపించకుండా పోయాడని చెప్పారు. దీంతో దళిత నాయకులు మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. న్యాయం చేయాలని కోరుతూ సమిశ్రగూడెం పోలీస్‌స్టేçÙన్ వద్ద బుధవారం ధర్నా చేశారు. హత్యకేసు నమోదు చేసి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వరప్రసాద్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.