అసలుని పోలినట్లే తయారు చేసిన నకిలీ ప్యాకింగ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ సిగరెట్లు హల్‌చల్ చేస్తున్నాయి. కోల్‌కతా లైన్ కేంద్రంగా ఢిల్లీ, బిహార్, రాయ్‌పూర్ నుంచి ఖరీదైన సిగరెట్ స్థానంలో నకిలీ రంగ ప్రవేశం చేస్తోంది. ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్‌లో బండిల్స్ కొద్దీ దొరికిన ఫేక్ సిగరెట్ బండిల్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ టొబాకో కంపెనీ(ఐటీసీ) ద్వారా మాత్రమే నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీలు సిగరెట్స్‌ని తయారు చేస్తుంటాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో దర్శనమిచ్చేవి. కేంద్రం విధించిన పన్ను భారంతో బ్రాండెడ్ సిగరెట్స్ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.
నకిలీ సిగరెట్ తయారీ ఇలా?
బ్రాండెడ్ కంపెనీలు వాడే పొగాకులో నాసిరకం పొగాకుని అతి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటారు. పొగాకుతో పాటు రంపపు పొట్టుని కూడా కలిపేసి చవగ్గా సిగరెట్స్ తయారు చేసేసి.. వాటిని మార్కెట్‌లోని బ్రాండెడ్ సిగరెట్స్ ప్యాకెట్స్ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. ఆ ప్యాకెట్స్‌పై ఎక్కడ తయారవుతున్నాయి.? వాటి కంపెనీ ఏమిటి.? అనే వివరాలు మాత్రం కనిపించవు. కొందరు తెలివిగా.. బ్రాండెడ్ ప్యాకెట్స్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లనే ముద్రించేస్తున్నారు.
ఎలా వచ్చేస్తున్నాయ్..?
గతంలో బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ సిగరెట్లు వచ్చేవి. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని తయారు చేసేస్తున్నారు. ఢిల్లీ, బిహార్, సూరత్, రాయ్‌పూర్, చంఢీగఢ్, కోల్‌కతా వంటి నగరాల్లో అసలు బ్రాండ్లను పోలిన సిగరెట్లు తయారవుతున్నాయి. వీటిని కోల్‌కతా కేంద్రంగా వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం రైలు మార్గంలోనే ఎక్కువగా రవాణా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల విశాఖ డివిజన్ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు రూ. లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు. వాటిని ఎవరు ఆర్డర్ చేశారన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది.
నకిలీ పొగ.. ప్రాణాంతకం
సాధారణంగా బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు, నరాల బలహీనతలు, ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. ఈ వ్యాధులు వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్స్ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని.. సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
గొలుసు తెంచేందుకు ప్రయత్నిస్తున్నాం..
ఇటీవల రైల్వేస్టేషన్లో భారీగా నకిలీ సిగరెట్ డంప్‌ని స్వాధీనం చేసుకున్నాం. వీటిని తీసుకొచ్చిన వ్యాపారి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. నకిలీ సిగరెట్ల వ్యాపారంపై గట్టి నిఘా ఉంచుతున్నాం. ప్రతి రైలు నుంచి వచ్చే పార్సిళ్లను పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం.
– శ్రీనివాసరావు, రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment