బాబోయ్.. టి‘కేటు’గాళ్లు!
విశాఖ రైల్వేస్టేషన్‌లో ఘరానా మోసగాళ్లు
క్షణాల్లో టికెట్ మార్చేస్తున్న వైనం
దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు
టికెట్లు జారీ చేసే వారిపై నెపాన్ని నెడుతున్న వైనం
తాటిచెట్లపాలెం: అది విశాఖ రైల్వే స్టేషన్. అప్పటికే ఓ వ్యక్తి చెన్నై వెళ్లేందుకు టికెట్ తీసుకుని రైలు కోసం నిరీక్షిస్తున్నాడు. ఇంతలో.. హలో బాగున్నారా.. అంటూ ఓ అపరిచితుడి పలకరింపు. సంబంధిత వ్యక్తి ఎవరో తెలియకపోయినా .. ఆ బాగున్నానండీ అంటూ మాటల్లో పెట్టి.. టికెట్ మార్చేశాడు. పైగా.. ‘మీకు.. టికెట్ కౌంటర్‌లో అనకాపల్లి టికెట్ ఇచ్చారు. చూసుకోలేదా..’ బిత్తరపోయాడు అమాయకుడు. కౌంటరు వద్దకు పరుగులు తీశాడు. ఇంకేముంది.. ఇదే అదనుగా.. సదరు మొదటి వ్యక్తి రెలైక్కి హ్యాపీగా వెళ్లిపోయాడు. ఇదేమీ కథ కాదు.. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జరుగుతున్న మోసాల్లో ఇదో రకం.. అంతే!
వివరాళో ్లకెళితే...
విశాఖ రైల్వేస్టేషన్లో కేటుగాళ్లు తయారవుతున్నారు. వాళ్లు చేరుకోవాల్సిన గమ్యానికి సరిపడా టికెట్‌ధర లేక ఈ తరహామోసాలకు తెగబడుతున్నారు. సమీప ప్రాంతాలకు రూ.30 లోపు టికెట్ తీసుకోవడం.. ఆపై వారు వెళ్లాల్సిన ప్రదేశానికే చేరే ప్రయాణికులపై కన్నేయడం.. వారిని బురిడీకొట్టించడం.. చాకచక్యంగా చక్కబెట్టేస్తున్నారు. మాటల్లో పెట్టి టికెట్ మార్చేస్తున్నారు. గతేడాది ఈ తరహా మోసాలు వెలుగుచూసాయి. ఆ సమయంలో బాధితులు అప్పటి ఆర్‌పీఎఫ్ సీఐను ఆశ్రయించగా.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. కానీ రూ.500 టికెట్‌కు ఎందుకీ ఎంక్వైరీలనుకుని వదిలేశారు. సేవాభావంతో ఆయనతోపాటు ఉద్యోగులందరూ తలోచేయి వేసి బాధితుడికి టికెట్ తీసి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
తాజాగా వారం క్రితం మరో సంఘటన జరిగినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సికిందరాబాద్ వెళ్దామని టికెట్ తీసుకుంటే అతని విషయంలో ఇదే జరిగింది. ఓ కేటుగాడు అతడి టికెట్‌ను మార్చేశాడు. దీంతో బాధితుడు ఎక్కాల్సిన రైలు అందుకోలేక ఇబ్బందిపడ్డారు. రైల్వే అధికారులకు తెలిపినా వారు కూడా నిట్టూర్చారు. దీంతో బాధితుడు దిక్కుతోచక వెనుదిరిగాడు. ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా వహించాలని, ఇబ్బందులెదురైతే తమను సంప్రదించాలని స్టేషన్‌లోని ఆర్‌పీఎఫ్ అధికారులు కోరుతున్నారు.