బారాబటి స్టేడియం వద్ద ఉద్రిక్తత
వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడిన అభిమానులు
అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌లో పడిగాపులు
తొక్కిసలాటను అదుపు చేసిన పోలీసులు
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో ఈ నెల 9న జరగనున్న భారత్, ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి టికెట్ల విక్రయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రంతా పడిగాపులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌంటర్‌లో విక్రయించే టిక్కెట్లు కోసం అర్ధరాత్రి నుంచి జనాలు చేరడంతో ఒకానొక సమయంలో తొక్కిసలాట పరిస్థితి చోటు చేసుకుంది.
4 కౌంటర్లు.. 12 వేల టికెట్లు
టిక్కెట్ల విక్రయానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 12 వేల టికెట్లు విక్రయించారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లో టికెట్లు దక్కించుకోలేని క్రికెట్ అభిమానులు వాటిని ఆఫ్‌లైన్‌లో కొనాలని ఎగబాకడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. స్పెషల్ ఎన్‌క్లోజర్, ఏసీ గ్యాలరీ, న్యూ పెవిలియన్, కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ల గురప్రు గేట్ ప్రాంగణంలో టికెట్లు విక్రయించారు. మిగిలిన అన్ని గ్యాలరీ టికెట్లను కిల్ఖానా లేక్‌లోని 3 కౌంటర్లలో విక్రయానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బస్సులు..
బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ పురస్కరించుకుని కటక్ నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్టేడియం లోపల, వెలుపల గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. కటక్ నగర పాలక సంస్థ స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలను చేపడుతోంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో మ్యాచ్ సన్నాహాలను సమీక్షించారు. కటక్ జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసు, ఆరోగ్య విభాగాలు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment