ఇక.. గార్డులేని రైలు | Suspension of guard services in trains with technical system | Sakshi
Sakshi News home page

ఇక.. గార్డులేని రైలు

Published Sat, Jan 16 2021 4:13 AM | Last Updated on Sat, Jan 16 2021 9:53 AM

Suspension of guard services in trains with technical system - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించే వారిలో ముందు వరసలో ఉండే గార్డుల వ్యవస్థ త్వరలోనే కనుమరుగు కానుంది. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థ మరింత సురక్షిత రవాణాకు సాయపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే.. గార్డుల స్థానాన్ని భర్తీచేస్తోంది. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వేలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం అయింది. త్వరలోనే వాల్తేరు డివిజన్‌లో ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవస్థ సఫలీకృతమైతే గార్డులను ఇతర స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రైలు పట్టాలపై సురక్షితంగా పరుగులు తీయాలంటే గార్డులు కచ్చితంగా అవసరం. సంప్రదాయంగా భారతీయ రైల్వేలో గార్డులే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వారి స్థానంలో సాంకేతికత అమలు కాబోతోంది. ఎండ్‌ ఆఫ్‌ ట్రైన్‌ టెలిమెట్రీ (ఈవోటీటీ) అమలుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో గతనెల ఈవోటీటీని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. గూడ్స్‌ ట్రైన్‌ గార్డు లేకుండా వందల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణం సాగించింది. రైలును భద్రంగా నడిపించే గార్డు నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఈవోటీటీ విజయవంతంగా చేపడుతోంది. 

చివరి బోగీలో ఏర్పాటు 
రైలు చివరి బోగీలో ఈవోటీటీ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. లోకోపైలట్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సురక్షితంగా అందిస్తుంటుంది. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌), గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌ (జీఎస్‌ఎం) ద్వారా ఇది పనిచేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన పరికరం ద్వారా ఎప్పటికప్పడు సమాచారం పైలట్‌కు అందుతుంది. దీనికి ఆటోమేటిక్‌ స్విచ్‌ విధానం ఉంది. ట్రాక్‌ వ్యవస్థలో ఏవైనా మార్పులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరగకుండా ముందే.. దూసుకుపోతున్న రైలును ఆపేలా ఎయిర్‌ బ్రేక్‌ ఈవోటీటీ అదనపు సౌకర్యం. బ్రేక్‌ పవర్‌ ప్రెజర్‌ను లోకోపైలట్‌ నియంత్రించేలా ఎయిర్‌ బ్రేక్‌ ఉపయోగించి రైలు ఆపవచ్చు. 


గూడ్స్‌ రవాణాపై విశాఖ నుంచి పరిశీలన 
తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ అత్యాధునిక వ్యవస్థను త్వరలోనే జోన్‌లో భాగమైన వాల్తేరు డివిజన్‌లోనూ పరిశీలించనున్నారు. గూడ్స్‌ రవాణాపై విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి ఈవోటీటీ ప్రయోగాన్ని అమలు చేస్తామని డివిజన్‌ అధికారులు తెలిపారు. భద్రతకు భంగం కలగకుండా, రైల్వేపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించేలా ఈవోటీటీ పరికరం తయారు చేశారని చెప్పారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే గార్డుల అవసరం ఉండదని, గార్డులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అత్యాధునిక పరికరం లోకోపైలట్‌ స్థైర్యానికి కొత్త ఊపిరి పోస్తుందని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement