త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభిస్తాం
100 శాతం రైల్వేలైన్లు ఎలక్ట్రిఫైడ్ అయ్యాయి
ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తాజా కేంద్రబడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,336 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. 2009–14 మ«ధ్య కాలంలో ఉమ్మడిరాష్ట్ర వార్షిక సగటు కేటాయింపులు రూ.886 కోట్లు మాత్రమేనని.. ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు ఆరురెట్లు ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అశ్వినీవైష్ణవ్ మాట్లాడారు.
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనుల మొత్తం అంచనావ్యయం రూ.32,946 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వేట్రాక్ పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా పూర్తయిందని చెప్పారు. 2009–2014 మధ్య కాలంలో రాష్ట్రంలో సంవత్సరానికి సగటున కేవలం 17 కి.మీ.మేర మాత్రమే కొత్త ట్రాక్ వేయగా, గత పదేళ్లలో సగటున సంవత్సరానికి 65 కి.మీ. చొప్పున నూతన ట్రాక్ వేసినట్టు వెల్లడించారు. పదేళ్లలో 437 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు.
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లను అమృత్ భారత్‌స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వేట్రాక్ ఏర్పాటు చేసే ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా ఏర్పాటు చేసే కవచ్‌కు సంబంధించి 4.0 వెర్షన్‌కు ఆమోదం లభించిందని, దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రణాళిక సిద్ధమవుతుందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
– వర్చువల్ పద్ధతిలో సికింద్రాబాద్ నుంచి దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ, నగర ప్రజారవాణాకు కీలకమైన ఎంఎంటీఎస్ రెండోదశకు సంబంధించి మిగిలిన పనులను రైల్వేశాఖ సొంత నిధులతో పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, దీనికి రాష్ట్ర నిధుల కోసం ఎదురుచూడమని తేల్చిచెప్పారు. బీబీనగర్–గుంటూరు డబ్లింగ్ పనులు మొదలయ్యాయని, జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment