Railways Department
-
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
తెలంగాణకు రైల్వే కేటాయింపులు రూ.5,336 కోట్లు
సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తాజా కేంద్రబడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,336 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. 2009–14 మ«ధ్య కాలంలో ఉమ్మడిరాష్ట్ర వార్షిక సగటు కేటాయింపులు రూ.886 కోట్లు మాత్రమేనని.. ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు ఆరురెట్లు ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అశ్వినీవైష్ణవ్ మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనుల మొత్తం అంచనావ్యయం రూ.32,946 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వేట్రాక్ పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా పూర్తయిందని చెప్పారు. 2009–2014 మధ్య కాలంలో రాష్ట్రంలో సంవత్సరానికి సగటున కేవలం 17 కి.మీ.మేర మాత్రమే కొత్త ట్రాక్ వేయగా, గత పదేళ్లలో సగటున సంవత్సరానికి 65 కి.మీ. చొప్పున నూతన ట్రాక్ వేసినట్టు వెల్లడించారు. పదేళ్లలో 437 ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్‌స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వేట్రాక్ ఏర్పాటు చేసే ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా ఏర్పాటు చేసే కవచ్‌కు సంబంధించి 4.0 వెర్షన్‌కు ఆమోదం లభించిందని, దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రణాళిక సిద్ధమవుతుందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. – వర్చువల్ పద్ధతిలో సికింద్రాబాద్ నుంచి దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ, నగర ప్రజారవాణాకు కీలకమైన ఎంఎంటీఎస్ రెండోదశకు సంబంధించి మిగిలిన పనులను రైల్వేశాఖ సొంత నిధులతో పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, దీనికి రాష్ట్ర నిధుల కోసం ఎదురుచూడమని తేల్చిచెప్పారు. బీబీనగర్–గుంటూరు డబ్లింగ్ పనులు మొదలయ్యాయని, జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. నేటితో ఆ రైలు పరుగులు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. విశాఖ స్టేషన్‌లోని ప్లాట్ఫార్మ్పై రైల్వే అధికారులు, ప్రజలు కేక్ కట్ చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. నేటి రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్‌ప్రెస్ సంబరాలు జరపనున్నారు. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ 1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు-హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఈ రైలు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ల మధ్యలో నడుస్తుంది. ఇదీ చదవండి: ‘కానుక’ తలుపు తడుతోంది! -
ఏపీలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
సాక్షి, విశాఖపట్నం/సింహాచలం/సాక్షి ప్రతినిధి విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే బడ్జెట్లో ఇప్పటివరకూ ఏపీకి రూ.8,406 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం ఉదయం విశాఖ చేరుకున్న ఆయన సింహాచలం స్టేషన్‌ని సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రూ.20 కోట్లతో జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనుల్ని బీజేపీ నేతలతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ రైల్వేస్టేషన్‌కు శాటిలైట్ స్టేషన్‌గా సింహాచలంను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందనీ.. ఇప్పటికే రూ.106 కోట్లు జోన్ నిర్మాణానికి కేటాయించామని ఆయన గుర్తుచేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్, సీఎస్, స్పెషల్ సీఎస్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరగా సమçÜ్యని పరిష్కరించి.. జోన్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇక ఉత్తరాంధ్రలోని 72 రైల్వేస్టేషన్లలో 15 స్టేషన్లని ఎంపిక చేసి ప్రపంచస్థాయి స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే మరిన్ని వందేభారత్ సర్వీసులు పట్టాలెక్కనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా కంకటాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు.. దేశంలో 5జీ మొబైల్ సర్వీసులు విస్తరించే ప్రక్రియ విజయవంతంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్, వాల్తేరు డీఆర్ఎం సౌరభ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పన్నను దర్శించుకున్న మంత్రి.. అంతకుముందు.. కేంద్రమంత్రి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేకే మార్గంలో డబుల్ లైన్ ఇక అరకు వెళ్లే కొత్తవలస–కిరండూల్ (కేకే) రైలు మార్గంలో రెండో లైన్ వేయడానికి ఏర్పాట్లుచేస్తున్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా శనివారం ఆయన విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలువర్తిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ పరిపాలనా విధానాలు బాగున్నాయని ప్రశంసించారు. కేంద్ర నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ సందేశాన్ని లైవ్‌లో నాయకులు, ప్రజలు తిలకించారు. -
డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల మీదుగా వెళ్లే డోర్నకల్ – భద్రాచలంరోడ్ లైన్ డబ్లింగ్ పనులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్రాజెక్టుగా ఈ పనులు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అన్నీ కుదిరితే మరో ఆరు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గూడ్సు రైళ్లకే ప్రాముఖ్యత డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు ప్రస్తుతం సింగిల్ లైన్ అందుబాటులో ఉంది. ఈ మార్గం గుండానే ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లిలో ఉత్పత్తి అయిన బొగ్గును దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు డోలమైట్ రవాణాకూ ఈ మార్గమే కీలకం. దేశంలో థర్మల్ విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఉండటంతో భద్రాచలంరోడ్ నుంచి డోర్నకల్ వరకు బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైళ్ల రాకపోకలు కీలకంగా మారాయి. దీంతో గూడ్స్ రైళ్ల క్లియరెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్యాసింజర్ రైళ్లను తరచుగా ఆపేస్తున్నారు. ఫలితంగా డోర్నకల్ – భద్రాచలంరోడ్ సెక్షన్లోకి రైలు వచ్చిన తర్వాత గమ్యస్థానం చేరే వరకు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సింగరేణి, కాకతీయ రైళ్లలో వచ్చే వారికి ఈ తరహా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. 54 కి.మీ. మేర ట్రాక్ డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు మొత్తం 54 కి.మీ దూరం రైల్వే ట్రాక్ ఉంది. ఈ ట్రాక్‌కు సమాంతరంగా మరో ట్రాక్ నిర్మిస్తారు. అంతేకాకుండా మార్గమధ్యంలో పోచారం, కారేపల్లి, గాంధీపురం, చీమలపాడు, తడికలపూడి, బేతంపూడి స్టేషన్లలో లూప్లైన్ల నిర్మాణం కూడా చేపడతారు. ఇందులో చాలావరకు భూసేకరణ సైతం గతంలోనే పూర్తయింది. ఈ మేరకు ట్రాక్ వెంబడి హద్దు రాళ్లు సైతం ఉన్నాయి. ప్రస్తుత రైల్వే అంచనాల ప్రకారం కిలోమీటర్ ట్రాక్ నిర్మాణానికి రూ.90 నుంచి రూ.100 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 540 కోట్ల వరకు ఖర్చు కావచ్చని తెలుస్తోంది. రైల్వేబోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందున డీపీఆర్ తయారీ, టెండర్లు తదితర పనులన్నీ ముగిసే సరికి కనీసం ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని రైళ్లకు అవకాశం.. కరోనాకు ముందు భద్రాచలం రోడ్ నుంచి డోర్నకల్ల మధ్య ఏడు రైళ్లు నడిచేవి. ప్రస్తుతం ఐదు రైళ్లు నడుస్తున్నాయి. సత్తుపల్లి మార్గం అందుబాటులోకి వచ్చాక గూడ్స్ ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో కొత్త రైళ్లు నడిపించడం కష్టంగా మారింది. డబ్లింగ్ పనులు పూర్తయితే కనీసం కొత్తగూడెం నుంచి డోర్నకల్ మధ్య ప్రస్తుతం ఉన్న రైళ్లు ఆలస్యం కాకుండా నడిచేందుకు వీలవుతుంది. అదే విధంగా తిరుపతి, షిర్డీ, నిజామాబాద్, మంచిర్యాల, గుంటూరు తదితర పట్టణాలకు మరిన్ని రైళ్లు నడిపించేందుకు వీలవుతుంది. -
ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం..
పెద్దపల్లి: సాధారణ, మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చు.. భద్రతతో కూడిన రైలులో సకాలంలో గమ్యం చేరేందుకు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాజీపేట–సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్– సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే రామగిరి, పుష్పుల్, ఇంటర్సిటీ, సింగరేణి ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 98 కిలోమీటర్ల దూరంలో కాజీపేట, 220కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్, ని జామాబాద్ వెళ్లేందుకు పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ట్రాక్ పనులు చేపడితే రద్దే.. కరీంనగర్, కాజీపేట– కాగజ్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడితే గతంలో ఒకటి రెండు రైళ్లను నడిపించిన రైల్వేశాఖ.. ప్రస్తుతం వారం రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తోంది. ఆర్టీసీ బస్సు చార్జీలతో పోల్చితే నాలుగో వంతు రైలు చార్జీలు ఉండడంతో సాధారణ, నిరుపేద ప్రయాణికులు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. కాగా గంటల తరబడి రైళ్ల ఆలస్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్, గూడ్సులకే మొదటి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా రైల్వే ట్రాక్స్ విస్తరిస్తున్న రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగించే క్రమంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు మొదటగా పంపించేందుకు వీటిని గంటల తరబడి నిలిపివేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. గూడ్స్ రాకపోకలతో వందలాది కోట్ల ఆదాయం ఉండగా, రైల్వేశాఖ సేవా దృక్పథాన్ని మరిచి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనే విమర్శలు మూటగట్టుకుంటుంది. -
దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి సిద్ధం
జమ్మూ: దేశంలోనే మొట్టమొదటి రైల్వే తీగల వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. కేవలం 11 నెలల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలియజేశారు. వంతెన వీడియోను షేర్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా అంజీ ఖద్‌లో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దీని మొత్తం పొడవు 473.25 మీటర్లు. 96 ప్రధాన తీగలు ఉన్నాయి. ఉదంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్)లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కాట్రా వైపు ఉన్న టన్నెల్ టీ2, రియాసీ వైపు ఉన్న టన్నెల్ టీ3ని ఇది అనుసంధానిస్తుంది. వంతెన నిర్మాణంలో ఉపయోగించిన మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై ఉన్న రైల్వే వంతెన తర్వాత ఇది దేశంలోనే రెండో అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. బలమైన గాలులు, తుఫాన్లు, పేలుళ్లను సైతం తట్టుకొనేలా డిజైన్ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్సలెంట్(అద్భుతం) అంటూ స్పందించారు. -
AP: 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు: రైల్వే శాఖ మంత్రి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నెల వరకు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించామన్నారు. వాటి దూరం 5,581 కిలోమీటర్లు కాగా, 70,594 కోట్లుతో చేపట్టామన్నారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, మార్చి 2022 వరకు 636 కిలోమీటర్ల దూరాన్ని 19,414 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2014-19 మధ్య 219 శాతానికి పైగా రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగిందని జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద 72 స్టేషన్ల అభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ స్కీం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను, వాటిలో 72 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించగా అందులో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
ద.మ. రైల్వే పూర్తిస్థాయి జీఎంగా అరుణ్‌కుమార్ జైన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనే జర్గా కొనసాగుతు న్న అరుణ్‌కుమార్ జైన్‌ను రైల్వే శాఖ పూర్తిస్థాయి జీఎంగా నియమించింది. పదోన్న తితో ఆయనకు పోస్టింగ్ ఇవ్వటంతో సోమ వారం అరుణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన దక్షిణ మధ్య రైల్వేలో ఇన్చార్జి జీఎంగా, అదనపు జీఎంగా, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్‌గా, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. -
‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అది ఓ కీలక ప్రాజెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్ (ట్రిప్లింగ్) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్ ఇది. దక్షిణ భారత్ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్‌లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు. ఈ మార్గంలోని మాణిక్‌ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్–కాగజ్‌నగర్.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్ కారిడార్‌గా వెలుగొందుతోంది. ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్లో 130 శాతం రైలు ట్రాఫిక్ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు నడపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొగ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. మూడో లైన్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం మూడో లైన్ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి. తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. అప్పట్లోనే గుర్తించి ఉంటే.. సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్ యావత్తు మూడో లైన్ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఆర్ఏసీ.. ఉండదిక వెయిట్ అండ్ సీ
సాక్షి, అమరావతి: రైళ్లలో రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తరువాత ఆర్ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లను పారదర్శకంగా కేటాయించేందుకు, కొందరు టీసీల అవినీతికి చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రైల్వే టీసీలకు ‘హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టీ)’ ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్ పరిధిలోని 16 రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. టీసీలకు హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించింది. ఆ రైళ్లలో రిజర్వేషన్ రద్దు, ఆర్ఏసీ జాబితాలో ఉన్నవారికి బెర్త్‌ల కేటాయింపు పక్కాగా చేసేందుకు మార్గం సుగమమైంది. సాధారణంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్ఏసీ వస్తే ఒకటే కంగారు పుడుతుంది. ఎవరు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్నారో.. ఆ బెర్త్ ఎవరికి కేటాయిస్తారో కూడా తెలీదు. దాంతో రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన క్షణం నుంచీ బెర్త్ కన్ఫర్మేషన్ కోసం టీసీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. టీసీ ప్లాట్‌ఫామ్ మీద ఉన్నా.. రైలులో ఉన్నా ఆయన వెంటపడుతూనే ఉంటారు. అయితే.. ఎందరు రిజర్వేషన్లు రద్దు చేసుకున్నారో.. వాటిని ఎవరికి ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. ఈ విషయంలో రైల్వే కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులకు సైతం నిర్దిష్టమైన సమాచారం ఉండదు. దానివల్ల వాటి కేటాయింపు అంతా టీసీల ఇష్టం మీద ఆధారపడి ఉంటోంది. కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుని ప్రాధాన్యత క్రమంలో లేని వారికి కూడా బెర్త్‌లు కేటాయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికే హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. త్వరలో మరిన్ని రైళ్లలో.. గతంలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని టీసీలకు ఈ ట్యాబ్‌లను అందించారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 రైళ్లలో టీసీలకు వీటిని అందించారు. రెండువైపులా తిరిగే 3 దురంతో ఎక్స్‌ప్రెస్‌లు (సికింద్రాబాద్–విశాఖ, సికింద్రాబాద్–నిజాముద్దీన్, సికింద్రాబాద్–లోకమాన్య తిలక్ టెర్మినల్), 5 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు (శాతవాహన, పినాకిని, రత్నాచల్, కాగజ్ నగర్, విజయవాడ ఇంటర్ సిటీ)లలో వీటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరిన్ని రైళ్లలోని టీసీలకూ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పారదర్శకత కోసమే.. ► ఈ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లతో టీసీలు బెర్త్‌ల కేటాయింపును పరిశీలిస్తారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వస్తే ఆ ట్యాబ్‌లోనే టిక్ పెడతారు. ఆ వివరాలన్నీ రైల్వే జోనల్, డివిజనల్ కార్యాలయాలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ► రిజర్వేషన్ రద్దు చేసుకున్న వివరాలు కూడా ఆ ట్యాబ్‌లలో అందుబాటులో ఉంటాయి. ► రద్దు చేసుకున్న బెర్త్‌లను ఆర్ఏసీలో వరుస క్రమంలో ఉన్నవారికే కేటాయించాలి. ఆ వెంటనే ట్యాబ్‌లో టిక్ పెట్టాలి. ► ఎవరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జోనల్, డివిజనల్ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా గుర్తిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు. ► ఈ విధానంతో బెర్త్‌ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా లంచాలకు.. ఇతర అక్రమాలకు అవకాశం ఉండదు. ► రిజర్వేషన్ బోగీలలో అనధికారికంగా ఎవరూ ప్రయాణించడానికి అవకాశం ఉండదు. ఎవరూ ఎలాంటి సాకులు చెప్పేందుకు కూడా వీలుండదు. ► ఆర్పీఎఫ్ సిబ్బంది తరచూ తనిఖీలు చేస్తూ రిజర్వేషన్ బోగీలలో అనధికారికంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారు. -
ఒంటిమిట్ట.. రైలు ఆగేదెట!
రాజంపేట: రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం) కోదండరాముని భక్తులపై..స్టేషన్ అభివృద్ధిపై రైల్వే చిన్నచూపు ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం రామునిక్షేత్రంగా వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒంటిమిట్ట ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. 2014లో ఏపీ ప్రభుత్వం దీనిని అధికారిక ఆలయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకుని వందకోట్లకుపైగా వ్యయంతో క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. అయితే రైల్వేశాఖ, రైల్వేమంత్రిత్వశాఖ ఒంటిమిట్టకు నలుదిశల నుంచి ప్రయాణికులు క్షేత్రానికి వచ్చేలా సౌకర్యాలు కల్పించడంలో వివక్షను ప్రదర్శించింది. ఒంటిమిట్టను గుర్తించని దక్షిణమధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను దక్షిణమధ్యరైల్వే గుర్తించలేదు. ముంబై–చెన్నై కారిడార్ రైలు మార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణమధ్యరైల్వేలోనే ఉండేవి. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడంలేదంటే వివక్ష ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్ పేరుకు మాత్రమే ఉంది. ఇక్కడ డెమై రైలు తప్ప ఏ రైలుకు స్టాపింగ్ లేదు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. తాజాగా ఒంటిమిట్ట స్టేషన్‌కు ఎఫ్ఓబీకి బ్రేక్ ఒంటిమిట రైల్వేస్టేషన్లో డబుల్ ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధ్యం ఫుట్ఓవర్ బ్రిడ్జిని(ఎఫ్ఓబీ) రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్ డివిజన్లో మూడుచోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్ప్లాట్ఫాంకు వెళ్లాలన్నా, అటువైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఉంది. నిధులు వెనక్కి వెల్లకుండా అధికారులు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
వ్యాగన్ వర్క్‌షాప్ కథ కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వే ప్రాజెక్టు కోసం దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య నెలకొన్న వివాదం సద్దుమణగడం, బడ్జెట్లో నిధులు కేటాయించడంతో.. రైల్వేశాఖ బుధవారం టెండర్లు పిలిచింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు. మార్చి మూడో వారంలో టెండర్లు తెరిచి.. నిర్మాణ సంస్థను గుర్తించి, వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. అప్పటినుంచి ఏడాదిన్నర వ్యవధిలో వర్క్ షాపును పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు మారిపోయి నాలుగు దశాబ్దాల కింద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ నరసింహారావు విజ్ఞప్తి మేరకు కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. కానీ తర్వాతి పరిణామాలతో ప్రాజెక్టు పంజాబ్‌కు తరలిపోయింది. దానికి బదులు 2009లో రైలు చక్రాల కర్మాగారాన్ని మంజూరు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిపై కోర్టు కేసులు దాఖలై జాప్యం జరగడంతో.. ఈ ప్రాజెక్టు కూడా వేరే రాష్ట్రానికి తరలిపోయింది. చివరికి 2016లో వ్యాగన్ ఓవర్ హాలింగ్ పీరియాడికల్ వర్క్‌షాప్‌ను కేటాయించారు. ఇటీవలే భూముల కేటాయింపు అంశం ఓ కొలిక్కి రావడంతో పనులు చేపట్టేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ వర్క్‌షాపులో.. సరుకు రవాణా వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేందుకు నిర్ధారిత గడువులో ఓవర్‌హాలింగ్ చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. -
రైళ్ల రద్దు బాట
సాక్షి, అమరావతి: ఉత్తర భారతదేశంలో ప్రతికూల వాతావరణంతోపాటు కోవిడ్ విజృంభణతో రైల్వే శాఖ పెద్దసంఖ్యలో రైళ్లను రద్దుచేస్తోంది. అవకాశం ఉన్నంతవరకు రైళ్లలో అదనపు బోగీలను కూడా అందుబాటులోకి తెస్తోంది. రైల్వేశాఖ మంగళవా రం దాదాపు 350 రైళ్లను రద్దుచేసింది. ఇక బుధవా రం దాదాపు 400 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటిం చింది. గురువారం బయల్దేరాల్సిన 282 రైళ్లను పూర్తిగా, 35 రైళ్లను పాక్షికంగా అంటే మొత్తం మీద 317 రైళ్లను రద్దుచేయాలని నిర్ణయించింది. వాటిలో అత్యధిక రైళ్లు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవే. దక్షి ణాదిలో తమిళనాడు, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లాల్సిన రైళ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇక గుజరాత్లో పర్యాటక ప్రదేశా ల సందర్శన కోసం విజయవాడ నుంచి ఈ నెల 21న బయలుదేరాల్సిన ‘వైబ్రంట్ గుజరాత్’ రైలు ను ఐఆర్సీటీసీ రద్దుచేసింది. 850 సీట్లకుగాను ఇప్పటికే దాదాపు 680 సీట్లను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతమైన దృష్ట్యా వైబ్రంట్ గుజరాత్ రైలును రద్దు చేశారు. మరోవైపు ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే కొన్ని రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తోంది. 10 రైళ్లలో శాశ్వత ప్రాతిపదికన రెండు రైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చామని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. -
పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు
సాక్షి, హైదరాబాద్/లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ► సికింద్రాబాద్–అనకాపల్లి (07435/07436) ప్రత్యేక రైలు ఈ నెల 13న సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14న సాయంత్రం 6.30 గంటలకు అనకాపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–నర్సాపూర్ (07489) (వయా గుంటూరు, విజయవాడ) ప్రత్యేక రైలు 12వ తేదీ (నేడు) రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (07437) స్పెషల్ ట్రైన్ 12వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ► కాచిగూడ–కర్నూల్ సిటీ (17435/17436) డెము రైలు 12వ తేదీ సాయంత్రం 5.35 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి రాత్రి 11.40 గంటలకి కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ ఉదయం 7 గంటలకు కర్నూలులో బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్–లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ► రైలు నంబర్ 07275 జనవరి 3, 5, 7 తేదీలలో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07276) జనవరి 4, 6, 8 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ► రైలు నంబర్ 07491 జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07492) జనవరి 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ► రైలు నంబర్ 82714 జనవరి 11న సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ నుంచి శబరిమలకు.. శబరిమల వెళ్లే భక్తుల కోసం కాకినాడ టౌన్ నుంచి ఎర్నాకుళంకు ప్రత్యేక రైలు (07147) జనవరి 4, 11 తేదీలలో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07148) జనవరి 5, 12 తేదీలలో రాత్రి 7.00 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాచిగూడ–నరసాపూర్.. కాచిగూడ–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా సువిధ ప్రత్యేక రైలు (82716) జనవరి 11న రాత్రి 11.15 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు నరసాపూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07494) జనవరి 12న సాయంత్రం 6.00 గంటలకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. -
ఇకపై అన్నీ రెగ్యులర్ రైళ్లే
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దేశంలో కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ తరువాత విడతల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అనవసర ప్రయాణాన్ని తగ్గించే ఉద్దేశంతో అదనపు చార్జీలు విధించి ‘సున్నా’ నంబర్‌తో మొదలయ్యే ప్రత్యేక రైళ్లను తొలుత దూర ప్రాంతాల మధ్య నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లను నడపడం ప్రారంభించింది. దాదాపు అన్ని ప్యాసింజర్ రైళ్లు ప్రత్యేక రైళ్ల పేరుతో నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండటంతో పాటు రైల్వేశాఖ ప్రత్యేక ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు కూడా ఉండవు. దీంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ ఇప్పటి నుంచి విడతల వారీగా ప్రత్యేక రైళ్ల స్థానంలో కరోనాకు ముందు ఉండే విధంగా సాధారణ రైలు నంబర్లతో, పాత చార్జీలతోనే రెగ్యులర్ రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2021 రైల్వే టైంటేబుల్ ప్రకారం దాదాపుగా అన్ని రైళ్లు రెగ్యులర్ రైళ్లుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మరో రెండు వారాలు పొడిగింపు నరసాపురం: గత మూడు ఆదివారాలుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో రెండు వారాలు పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు ఈ నెల 21, 28 తేదీల్లో కూడా నడుస్తుందని నరసాపురం రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు మంగళవారం తెలిపారు. 07455 నంబర్‌తో ఈ రైలు సాయంత్రం ఐదు గంటలకు నరసాపురంలో బయలుదేరి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటిరోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. -
‘యాస్’ తుపాన్ కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాన్ కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా విజయవాడ మీదుగా నడిచే మరికొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలివీ.. ఈ నెల 23వ తేదీ: భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక రైలు (02845) 24వ తేదీ: హౌరా–వాస్కోడిగామ (08047/08048) 27వ తేదీ: తిరువనంతపురం–షాలీమార్ (02641), హౌరా–తిరుచిరాపల్లి (02663), చెన్నై సెంట్రల్–సంత్రగచ్చి (02808), యశ్వంత్‌పూర్–హౌరా (06597) 28వ తేదీ: పురులియా–విల్లుపురం (06169), హౌరా–మైసూర్ (08117) 29వ తేదీ: తాంబరం–జసిది జంక్షన్ (02375), కన్యాకుమారి–హౌరా (02666), హౌరా–యర్నాకులం (02877), 30వ తేదీ: హౌరా–పుదిచ్చేరి (02867) -
రైల్వేశాఖ కీలక నిర్ణయం: రైళ్లలో సెల్ ఛార్జింగ్ బంద్
న్యూఢిల్లీ: రైళ్లలో ఉండే మొబైల్ ఛార్జింగ్ పరికరాలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలు గతంలో వచ్చినవేననీ, తాజాగా మరో సారి రైల్వే బోర్డు వీటిని జారీ చేసిందని దక్షిణ రైల్వే సీపీఆర్వో చెప్పారు. రైలు బోగీల్లో ఉండే చార్జింగ్ స్టేషన్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలని గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రతిపాదించారు. ఆ సమయంలోనే బెంగళూరు–నాందేడ్ రైలులో అగ్నిప్రమాదం సంభవించడంతో అన్ని జోన్లలోనూ సెల్ ఛార్జింగ్ స్టేషన్లను రాత్రి వేళల్లో ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కరోనా తీవ్రతతో పరిస్థితి విషమం) -
ఇక.. గార్డులేని రైలు
సాక్షి, విశాఖపట్నం: రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించే వారిలో ముందు వరసలో ఉండే గార్డుల వ్యవస్థ త్వరలోనే కనుమరుగు కానుంది. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థ మరింత సురక్షిత రవాణాకు సాయపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే.. గార్డుల స్థానాన్ని భర్తీచేస్తోంది. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వేలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం అయింది. త్వరలోనే వాల్తేరు డివిజన్లో ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవస్థ సఫలీకృతమైతే గార్డులను ఇతర స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రైలు పట్టాలపై సురక్షితంగా పరుగులు తీయాలంటే గార్డులు కచ్చితంగా అవసరం. సంప్రదాయంగా భారతీయ రైల్వేలో గార్డులే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వారి స్థానంలో సాంకేతికత అమలు కాబోతోంది. ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ (ఈవోటీటీ) అమలుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఈస్ట్‌కోస్ట్ జోన్లో గతనెల ఈవోటీటీని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. గూడ్స్ ట్రైన్ గార్డు లేకుండా వందల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణం సాగించింది. రైలును భద్రంగా నడిపించే గార్డు నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఈవోటీటీ విజయవంతంగా చేపడుతోంది. చివరి బోగీలో ఏర్పాటు రైలు చివరి బోగీలో ఈవోటీటీ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. లోకోపైలట్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సురక్షితంగా అందిస్తుంటుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) ద్వారా ఇది పనిచేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన పరికరం ద్వారా ఎప్పటికప్పడు సమాచారం పైలట్‌కు అందుతుంది. దీనికి ఆటోమేటిక్ స్విచ్ విధానం ఉంది. ట్రాక్ వ్యవస్థలో ఏవైనా మార్పులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరగకుండా ముందే.. దూసుకుపోతున్న రైలును ఆపేలా ఎయిర్ బ్రేక్ ఈవోటీటీ అదనపు సౌకర్యం. బ్రేక్ పవర్ ప్రెజర్‌ను లోకోపైలట్ నియంత్రించేలా ఎయిర్ బ్రేక్ ఉపయోగించి రైలు ఆపవచ్చు. గూడ్స్ రవాణాపై విశాఖ నుంచి పరిశీలన తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ అత్యాధునిక వ్యవస్థను త్వరలోనే జోన్లో భాగమైన వాల్తేరు డివిజన్‌లోనూ పరిశీలించనున్నారు. గూడ్స్ రవాణాపై విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈవోటీటీ ప్రయోగాన్ని అమలు చేస్తామని డివిజన్ అధికారులు తెలిపారు. భద్రతకు భంగం కలగకుండా, రైల్వేపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించేలా ఈవోటీటీ పరికరం తయారు చేశారని చెప్పారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే గార్డుల అవసరం ఉండదని, గార్డులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అత్యాధునిక పరికరం లోకోపైలట్ స్థైర్యానికి కొత్త ఊపిరి పోస్తుందని పేర్కొన్నారు. -
‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రైవేటు రైలు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రైవేటు రైళ్ల నిర్వహణకు తమకు తగిన అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకు (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్) దరఖాస్తులను ఆహ్వానించగా.. 12 క్లస్టర్లకు 15 కంపెనీల నుంచి మొత్తం 120 దరఖాస్తులు దాఖలైనట్టు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ భారతీయ కంపెనీలే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కూడా పాల్గొన్నది. పీపీపీ విధానంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దేశవ్యాప్తంగా 12కు పైగా క్లస్టర్లలో 140 మార్గాల్లో (రానుపోను) 151 అధునాతన రైళ్లను ఎంపికైన సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌పై ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) అన్నది మొదటి దశ. ఈ దశలో తగిన అర్హతలు కలిగిన సంస్థలను రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది. వీటి నుంచి రెండో దశలో.. ప్రతిపాదనలను (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్/ఆర్ఎఫ్పీ) ఆహ్వానిస్తుంది. ‘‘దరఖాస్తుల మదింపు ప్రక్రియను రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తుంది. అర్హత సాధించిన కంపెనీలకు ఆర్ఎఫ్పీ పత్రాలు 2020 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటాయి. 2021 ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్ల కేటాయింపును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము’’ అని రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు సికింద్రాబాద్ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తోపాటు.. జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ, అరవింద్ ఏవియేషన్, బీహెచ్ఈఎల్, కన్స్ట్రక్షన్స్ వై ఆక్సిలర్ డీ ఫెర్రోక్యారైల్స్, ఎస్ఏ, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3, గేట్‌వే రైల్ ఫ్రయిట్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మాలెంపాటి పవర్ ప్రైవేటు లిమిటెడ్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, సాయినాథ్ సేల్స్ అండ్ సర్వీసెస్, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఆర్‌ఎఫ్‌క్యూలు సమర్పించాయి. -
నేడు పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి: నేటి నుంచి (సోమవారం) పరిమిత సంఖ్యలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లను పునఃప్రారంభిస్తుండటంతో రైల్వే శాఖ ప్రయాణికులకు హెల్త్ ప్రొటోకాల్ జారీ చేసింది. విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారు. ముంబై, భువనేశ్వర్, చెన్పై, బెంగళూరు, ఢిల్లీకి ఈ రైళ్లు నడవనున్నాయి. పది రోజుల కిందటే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీకి సంబంధించి 52 రైల్వే స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు ప్రారంభించారు. టిక్కెట్ కన్ఫర్మ్ అయిన వారినే రైల్వే స్టేషన్లోకి అనుమతిస్తారు. 90 నిమిషాల ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ఈ ప్రత్యేక రైళ్లను మొత్తం రిజర్వ్డ్ బోగీలతోనే నడపనున్నారు. కరోనా కట్టడికి గుంటూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన శానిటైజర్, క్యూలైన్లు ► సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్– హౌరాకు ప్రతి రోజూ రైళ్లను నడపనున్నారు. తిరుపతి–నిజాముద్దీన్‌కు రైలును నడపనుంది. ► విశాఖ– న్యూఢిల్లీ, హౌరా–యశ్వంత్‌పూర్‌కు ఫాస్ట్ రైళ్లను నడపనున్నారు. ► స్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. అనారోగ్య లక్షణాలుంటే ప్రయాణానికి అనుమతించరు. తక్కువలగేజీతో రావాలని రైల్వే సూచిస్తోంది. ► రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. ► దీర్ఘకాల వ్యాధులున్న వారు, పదేళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దని రైల్వే శాఖ కోరింది. ► ప్రయాణం ముగిసే వరకు మాస్క్ తప్పనిసరి. గమ్యస్థానానికి చేరిన తర్వాత సంబంధిత రాష్ట్రం జారీ చేసిన హెల్త్ ప్రొటోకాల్‌ను పాటించాలి. ఏపీలో 18 రైల్వేస్టేషన్లలోనే హెల్త్ ప్రొటోకాల్ రైల్వేకు అభ్యర్థన: కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు ఏపీలో 18 రైల్వే స్టేషన్లలోనే హెల్త్ ప్రోటోకాల్ అనుసరిస్తామని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సోమవారం ఏపీ మీదుగా 22 రైళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, రైల్వే సాధారణ షెడ్యూల్ ప్రకారం 71 స్టాపులను ఇచ్చిందన్నారు. అయితే ఇన్ని స్టాప్‌లలో ప్రయాణికులకు హెల్త్ ప్రొటోకాల్ అనుసరించడం కష్టమని, ప్రతి జిల్లాకు ఒక స్టాప్‌ను మాత్రమే పరిమితం చేయాలని రైల్వేను అభ్యర్థించినట్లు చెప్పారు. ఆదివారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక ప్రమాదం ఉన్న చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ఏడు రోజులు క్వారంటైన్ చేసి ఆ తర్వాత హోం క్వారంటైన్‌కు పంపుతామన్నారు. వీరిలో 5 శాతం మందికి స్వాబ్ పరీక్షలు జరుపుతామని చెప్పారు. ఏపీలో హెల్త్ ప్రొటోకాల్ అనుసరించే 18 స్టేషన్ల జాబితాను రైల్వే బోర్డుకు పంపినట్లు తెలిపారు. -
ప్రత్యేక రైళ్లలో పాటించాల్సిన సూచనలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు జూన్ ఒకటో తేదీ నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. నాన్ ఏసీ, సెకండ్ క్లాస్ బోగీలుండే ఈ రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని తెలిపింది. ఇక ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణ సమయంలో ప్రయాణికులు తీసుకోవల్సిన పలు సూచనలు, జాగ్రత్తలను విడుదల చేసింది. అవి ఇలా ఉన్నాయి.. ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులు రైలు బయలుదేరే సమయం కంటే 90 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్లో రైల్వే కూలీలు తక్కువగా అందుబాటులో ఉన్నందున సాధ్యమైనంత తక్కువ లగేజీని వెంట తెచ్చుకోవాలి. ప్రయాణికులు ప్రయాణ టిక్కెట్ లేకుండా రైలు ఎక్కరాదు. సరైన ప్రయాణ టిక్కెట్ లేని వారిని రైల్వే స్టేషన్‌లోనికి ప్రవేశించకుండా నివారించడానికి తనిఖీ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంతవరకు రైల్వే స్టేషన్లో ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్లకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి కావున ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే స్టేషన్‌లోని అనుమతిస్తారు. స్క్రీనింగ్ సమయంలో కరోనా లక్షణాలు కనబడితే ప్రయాణానికి అనుమతించడం కుదరదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రయాణికులు (రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కేన్సర్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు) గర్భవతులు 10 సంవత్సరాల లోపు పిల్లలు 65 ఏళ్ల పైబడినవారు రైలు ప్రయాణం చేయకపోతే మంచిది. ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకున్న స్టేషన్లో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి. రైల్వే స్టేషన్లో ప్రవేశ, బయటకు వెళ్లే ద్వారాలను ప్రయాణికులు ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించాలి. ప్రత్యేక రైళ్లలో టికెట్ చెకింగ్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏదైనా అత్యవసరం అనుకుంటే ప్రయాణికులు వారి సహాయం పొందవచ్చు. ప్రయాణికులు వినియోగించే టాయిలెట్లు ఇతర ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేయడం జరుగుతుంది. రైలులో దుప్పట్లు సరఫరా ఉండదు కాబట్టి ప్రయాణికులు తప్పనిసరిగా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రయాణికులు తమ ఆహారం వెంట తెచ్చుకుంటే మంచిది. స్టేషన్ల వద్ద ఆహార పదార్ధాల అమ్మకపు కేంద్రాలు తెరచి ఉంటాయి. కానీ, అల్పాహారా కేంద్రాలు ఉండవు కాబట్టి తయారు చేసిన ఆహారం తీసుకెళ్లవచ్చు. ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. -
జూన్ 1 నుంచి 200 రైళ్లు
న్యూఢిల్లీ: జూన్ 30వ తేదీ వరకు రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది. నాన్ ఏసీ, సెకండ్ క్లాస్ బోగీలుండే ఈ రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని తెలిపింది. శ్రామిక్ రైళ్లు, రాజధాని రూట్లలో నడిచే ఏసీ స్పెషల్ రైళ్లకు ఇవి అదనమని వివరించింది. అన్ని కేటగిరీల ప్రయాణికులు వీటికి టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇవి ఏఏ మార్గాల్లో నడుస్తాయో త్వరలోనే ప్రకటిస్తామంది. శ్రామిక్ రైళ్లలో అవకాశం దొరకని వలస కార్మికులు వీటిని ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఒకటీరెండు రోజుల్లో శ్రామిక్ రైళ్ల సంఖ్యను రోజుకు 400కు పెంచుతామని, కాలినడకన రోడ్ల వెంట వెళ్లే వారిని గుర్తించి, దగ్గర్లోని ప్రధాన రైల్వే స్టేషన్‌కు తరలించాలని రాష్ట్రాలను కోరింది. వారి జాబితాను రైల్వే శాఖ అధికారులకు అందజేస్తే సొంతూళ్లకు శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శ్రామిక్ రైళ్లకు అనుమతి అక్కర్లేదు దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్ రైళ్లకు సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీనిపై హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది. బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లను రానివ్వడం లేదంటూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈనెల ఒకటి నుంచి 1,565 శ్రామిక్ రైళ్ల ద్వారా 20 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారంది. -
‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు
న్యూఢిల్లీ: రైల్వేలో భారీ ఈ –టికెట్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు దీన్ని ఛేదించిన రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘దొడ్డిదారిన ఈ టికెట్ల విక్రయం జరుగుతున్నట్లుగా అనుమానం రావడంతో గత ఏడాది ‘ఆపరేషన్ థండర్‌స్టార్మ్’పేరుతో దర్యాప్తు ప్రారంభించాం. ఈ సందర్భంగా గులాం ముస్తాఫా(28) పేరు బయటకు వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇతడు 2015 నుంచి ఈ దందా నడుపుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఇతడిని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నాం. ఇతని వద్ద ఐఆర్సీటీసీకి చెందిన 563 మంది గుర్తింపుకార్డులు లభించాయి. వీటి ద్వారా ఇతడు టికెట్లను బుక్ చేసేవాడు. వచ్చిన డబ్బును బ్యాంకు అకౌంట్లకు మళ్లించేవాడు. ఇందుకు సంబంధించి ఇతని వద్ద 3,000 అకౌంట్ల వివరాలు లభించాయి. దీంతోపాటు ఇతని వద్ద రెండు ల్యాప్‌టాప్‌లలో ఏఎన్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దీంతో సాధారణ యూజర్ల కంటే వేగంగా టికెట్లను బుక్ చేయవచ్చు. వచ్చిన డబ్బును డార్క్‌నెట్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మారుస్తాడు. ఆ కరెన్సీని మనీ ల్యాండరింగ్‌కు, ఉగ్రసంస్థలకు సాయం అందించేందుకు వాడుతున్నట్లు మా అనుమానం’ అని డీజీ వెల్లడించారు. ‘పాక్‌కు చెందిన తబ్లిక్–ఇ–జమాత్ అనే ఉగ్రసంస్థతోనూ, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్, ఇంకా గల్ఫ్ దేశాల వారితో ఇతనికి సంబంధాలున్నట్లు ల్యాప్‌టాప్‌ల్లో సమాచారంతో తేలింది. అతని వద్ద నకిలీ పాన్, ఆధార్ కార్డులను తయారు చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఇతని గ్రూప్ నుంచి డబ్బు అందుకునే సాఫ్ట్వేర్ కంపెనీ మనీల్యాండరింగ్ కు పాల్పడుతోంది. దీనిపై సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’అని డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ‘గురూజీ అనే పేరుగల సాంకేతిక నిపుణుడికి ముస్తాఫా ఇటీవల రూ.13 లక్షలు అందించాడు. తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ గురూజీ యుగోస్లావియా వీపీఎన్ వాడుతున్నాడు. ఈ ముఠా నడిపే అవయవ వ్యాపారం దందాలో భాగంగా వివిధ ఆస్పత్రులకు గురూజీ చికిత్సల పేరుతో బంగ్లాదేశ్ వాసులను పంపిస్తున్నాడు. ఈ రాకెట్ ద్వారా నెలకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నాం’అని వివరించారు. దుబాయ్‌లో సూత్రధారి ఈ టికెట్ రాకెట్‌కు మాస్టర్‌మైండ్ హమీద్ అష్రాఫ్. 2019 జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ స్కూల్ ఆవరణలో బాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి. ఈ ఘటనలో అరెస్టయిన ఇతడు బెయిల్‌పై బయటకు వచ్చి, నేపాల్ మీదుగా దుబాయ్‌కి పరారయ్యాడు. పది రోజులుగా ఇంటలి జెన్స్ బ్యూరో, స్పెషల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కర్ణాటక పోలీసులు ముస్తాఫాను విచారణ చేస్తున్నారు. ముస్తాఫా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు.