సాక్షి, విశాఖపట్నం/సింహాచలం/సాక్షి ప్రతినిధి విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే బడ్జెట్‌లో ఇప్పటివరకూ ఏపీకి రూ.8,406 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం ఉదయం విశాఖ చేరుకున్న ఆయన సింహాచలం స్టేషన్‌ని సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రూ.20 కోట్లతో జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనుల్ని బీజేపీ నేతలతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ రైల్వేస్టేషన్‌కు శాటిలైట్ స్టేషన్‌గా సింహాచలంను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందనీ.. ఇప్పటికే రూ.106 కోట్లు జోన్ నిర్మాణానికి కేటాయించామని ఆయన గుర్తుచేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్, సీఎస్, స్పెషల్ సీఎస్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరగా సమçÜ్యని పరిష్కరించి.. జోన్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇక ఉత్తరాంధ్రలోని 72 రైల్వేస్టేషన్లలో 15 స్టేషన్లని ఎంపిక చేసి ప్రపంచస్థాయి స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే మరిన్ని వందేభారత్ సర్వీసులు పట్టాలెక్కనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా కంకటాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు.. దేశంలో 5జీ మొబైల్ సర్వీసులు విస్తరించే ప్రక్రియ విజయవంతంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్, వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అప్పన్నను దర్శించుకున్న మంత్రి..
అంతకుముందు.. కేంద్రమంత్రి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కేకే మార్గంలో డబుల్ లైన్
ఇక అరకు వెళ్లే కొత్తవలస–కిరండూల్ (కేకే) రైలు మార్గంలో రెండో లైన్ వేయడానికి ఏర్పాట్లుచేస్తున్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా శనివారం ఆయన విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలువర్తిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ పరిపాలనా విధానాలు బాగున్నాయని ప్రశంసించారు. కేంద్ర నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ సందేశాన్ని లైవ్‌లో నాయకులు, ప్రజలు తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment