‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు | Story Of Kazipet Balharshah Third Railway Line | Sakshi
Sakshi News home page

‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు

Published Mon, Aug 8 2022 12:49 AM | Last Updated on Mon, Aug 8 2022 3:34 PM

Story Of Kazipet Balharshah Third Railway Line - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అది ఓ కీలక ప్రా­జెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్‌. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్‌ (ట్రిప్లింగ్‌) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. 

కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్‌  
దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్‌ ఇది. దక్షిణ భారత్‌ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్‌. అందుకే దీన్ని గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్‌ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్‌లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు.

ఈ మార్గంలోని మాణిక్‌ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్‌–కాగజ్‌నగర్‌.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుం­టాయి. దీం­తో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్‌ కారిడార్‌గా వెలుగొందుతోంది.  

ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి 
ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగు­తున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్‌లో 130 శాతం రైలు ట్రాఫిక్‌ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రా­ష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు న­డపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొ­గ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్‌­ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది.  

మూడో లైన్‌ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం 
మూడో లైన్‌ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్‌ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు.  

ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. 
ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు  ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి.

తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. 

అప్పట్లోనే గుర్తించి ఉంటే.. 
సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్‌ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్‌ యావత్తు మూడో లైన్‌ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement