అసలే చాలీచాలని రైళ్లు.. ఆపై అదనపు కష్టాలు | 99 trains canceled on Kazipet route due to non interlocking works | Sakshi
Sakshi News home page

అసలే చాలీచాలని రైళ్లు.. ఆపై అదనపు కష్టాలు

Published Fri, Sep 27 2024 4:17 AM | Last Updated on Fri, Sep 27 2024 4:17 AM

99 trains canceled on Kazipet route due to non interlocking works

కావాల్సింది 3 వేల ట్రిప్పులు.. ఇప్పటి వరకు ప్రకటించింది 600 ట్రిప్పులే 

మరో 200 ట్రిప్పులకు ఏర్పాట్లు 

కాజీపేట రూట్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులతో 99 రైళ్లు రద్దు...అందులో 47 ప్రత్యేక పండుగ బండ్లే

హైదరాబాద్‌ నుంచి కాజిపేట మీదుగా సాగే గ్రాండ్‌ ట్రంక్‌ రూట్, బీబీనగర్‌–గుంటూరు, మహ బూబ్‌నగర్‌ మీదుగా ఉన్న బెంగళూరు, నిజామాబాద్‌ రూట్‌ కూడా సామర్థ్యానికి మించి రైలు ట్రాఫి క్‌తో ఇరుగ్గా మారాయి. ప్రస్తుతం వాటి మీదుగా 160 శాతం మేర రైళ్లు నడుస్తున్నాయి. దీంతో పండగ ప్రత్యేక రైళ్లు వాటి మీదుగా నడపటం కష్టంగా మారింది. 

దీంతో రద్దీ రోజుల్లో గూడ్సు రైళ్లను రీ షెడ్యూల్‌ చేసి మరీ ప్రత్యేక పండగ రైళ్లను అతికష్టమ్మీద తిప్పుతున్నారు. ఈ రెండు కారణాలతో సరిపోను ప్రత్యేక రైళ్లు నడపలేకపోతున్నారు. వెరసి వచ్చే దసరా, దీపావళి, సంక్రాంతి సమయాల్లో ఎప్పటిలాగానే ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.  

సరిగ్గా పండగ వేళ కొత్త కష్టాలు 
అసలే చాలినన్ని రేక్స్‌ లేక, సరిపడా ట్రాక్‌ లేక అదనపు రైళ్లు నడపటం కష్టంగా మారిన తరుణంలో, ఈసారి దసరా వేళ గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లో కొత్తకష్టం వచ్చి పడింది. వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి మధ్య ఇటీవల రెండు బైపాస్‌ లైన్లు నిర్మించారు. ఉన్న రెండు అప్‌ అండ్‌ డౌన్‌ రూట్లు సరిపోక వాటికి అదనంగా రెండు బైపాస్‌ లైన్లు నిర్మించారు. 

ఇప్పుడు వీటిని మెయిన్‌ లైన్‌లతో అనుసంధానించే నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి పనులు జరిగే సమయంలో ఆ ట్రాక్‌ మీద రైళ్లు నడపటం సాధ్యం కాదు. దీంతో రోజువారిగా ప్రత్యేక టైమింగ్స్‌ కేటాయించారు. ప్రధాన రైళ్లు కాకుండా మిగతా వాటిని రద్దు చేసి పనులు చేయిస్తున్నారు. ఇవి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు జరిగేలా స్లాట్‌ కేటాయించారు. ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక రైళ్లు తిప్పాల్సి ఉంది. 

ఇందుకోసం ముందుగానే ప్రత్యేక రైళ్ల టైంటేబుల్‌ ఖరారు చేశారు. నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు జరుగుతున్న ట్రాక్‌ మీదుగా కూడా ఈ ప్రత్యేక రైళ్లు తిరగాల్సి ఉంది. ఆ పనుల కోసం ఇప్పటికే 99 రైళ్లను రద్దు చేసి మరో 38 రైళ్లను దారి మళ్లించారు. రద్దయిన వాటిల్లో పండుగ ప్రత్యేక రైళ్లు 47 ఉన్నాయి. అసలే ప్రత్యేక రైళ్లు సరిపోని తరుణంలో 47 రైళ్లు రద్దు కావడం వల్ల ఈసారి పండుగ ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.  

ఒక్క రైలు తయారీకి రూ.80 కోట్లకు పైగా వ్యయం  
రద్దీ కోసం మరిన్ని రైళ్లు అందుబాటులోకి తేవాల్సి ఉన్నా.. అది రైల్వేపై పెనుభారం మోపుతోంది. ప్రస్తుతం ఒక రైలు రేక్‌ తయారీకి దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుంది. అందే వందేభారత్‌ లాంటి రైళ్లకు రూ.120 కోట్ల వరకు ఖర్చవుతుంది. 

ఇంత భారీ వ్యయంతో రైళ్లను తయారు చేసి ప్రత్యేక రైళ్లుగా నడిపితే, అన్‌సీజన్‌లో అవన్నీ ఖాళీగా ఉండాల్సి ఉంటుంది. దీంతో స్పేర్‌ రైళ్ల సంఖ్య పెంచటానికి రైల్వే ఆసక్తి చూపటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండే, దసరా, సంక్రాంతి లాంటి సందర్భాల్లో ఉత్తరాది నుంచి స్పేర్‌ రైళ్లు తెప్పిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement