సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వే ప్రాజెక్టు కోసం దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య నెలకొన్న వివాదం సద్దుమణగడం, బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో.. రైల్వేశాఖ బుధవారం టెండర్లు పిలిచింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు. మార్చి మూడో వారంలో టెండర్లు తెరిచి.. నిర్మాణ సంస్థను గుర్తించి, వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. అప్పటినుంచి ఏడాదిన్నర వ్యవధిలో వర్క్ షాపును పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
రెండు సార్లు మారిపోయి
నాలుగు దశాబ్దాల కింద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ నరసింహారావు విజ్ఞప్తి మేరకు కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. కానీ తర్వాతి పరిణామాలతో ప్రాజెక్టు పంజాబ్‌కు తరలిపోయింది. దానికి బదులు 2009లో రైలు చక్రాల కర్మాగారాన్ని మంజూరు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిపై కోర్టు కేసులు దాఖలై జాప్యం జరగడంతో.. ఈ ప్రాజెక్టు కూడా వేరే రాష్ట్రానికి తరలిపోయింది.
చివరికి 2016లో వ్యాగన్ ఓవర్ హాలింగ్ పీరియాడికల్ వర్క్‌షాప్‌ను కేటాయించారు. ఇటీవలే భూముల కేటాయింపు అంశం ఓ కొలిక్కి రావడంతో పనులు చేపట్టేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ వర్క్‌షాపులో.. సరుకు రవాణా వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేందుకు నిర్ధారిత గడువులో ఓవర్‌హాలింగ్ చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment