సాక్షి, హైదరాబాద్: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించింది. వర్క్‌షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు.
ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్‌లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు.
ఆ వివాదంతోనేనా..
కాజీపేటకు 1980లలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్‌లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు.
అప్పటినుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
రైల్వేకు ఇది రెండో యూనిట్..
దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్ అవుతుంది. రైల్వే సొంత యూనిట్‌గా మారుతుంది.
పవర్ మెక్–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్ టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్‌షాప్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment