సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల మీదుగా వెళ్లే డోర్నకల్ – భద్రాచలంరోడ్ లైన్ డబ్లింగ్ పనులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్రాజెక్టుగా ఈ పనులు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అన్నీ కుదిరితే మరో ఆరు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గూడ్సు రైళ్లకే ప్రాముఖ్యత
డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు ప్రస్తుతం సింగిల్ లైన్ అందుబాటులో ఉంది. ఈ మార్గం గుండానే ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లిలో ఉత్పత్తి అయిన బొగ్గును దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు డోలమైట్ రవాణాకూ ఈ మార్గమే కీలకం. దేశంలో థర్మల్ విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఉండటంతో భద్రాచలంరోడ్ నుంచి డోర్నకల్ వరకు బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైళ్ల రాకపోకలు కీలకంగా మారాయి. దీంతో గూడ్స్ రైళ్ల క్లియరెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్యాసింజర్ రైళ్లను తరచుగా ఆపేస్తున్నారు. ఫలితంగా డోర్నకల్ – భద్రాచలంరోడ్ సెక్షన్‌లోకి రైలు వచ్చిన తర్వాత గమ్యస్థానం చేరే వరకు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సింగరేణి, కాకతీయ రైళ్లలో వచ్చే వారికి ఈ తరహా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
54 కి.మీ. మేర ట్రాక్
డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు మొత్తం 54 కి.మీ దూరం రైల్వే ట్రాక్ ఉంది. ఈ ట్రాక్‌కు సమాంతరంగా మరో ట్రాక్ నిర్మిస్తారు. అంతేకాకుండా మార్గమధ్యంలో పోచారం, కారేపల్లి, గాంధీపురం, చీమలపాడు, తడికలపూడి, బేతంపూడి స్టేషన్లలో లూప్‌లైన్ల నిర్మాణం కూడా చేపడతారు. ఇందులో చాలావరకు భూసేకరణ సైతం గతంలోనే పూర్తయింది. ఈ మేరకు ట్రాక్ వెంబడి హద్దు రాళ్లు సైతం ఉన్నాయి. ప్రస్తుత రైల్వే అంచనాల ప్రకారం కిలోమీటర్ ట్రాక్ నిర్మాణానికి రూ.90 నుంచి రూ.100 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 540 కోట్ల వరకు ఖర్చు కావచ్చని తెలుస్తోంది. రైల్వేబోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందున డీపీఆర్ తయారీ, టెండర్లు తదితర పనులన్నీ ముగిసే సరికి కనీసం ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని రైళ్లకు అవకాశం..
కరోనాకు ముందు భద్రాచలం రోడ్ నుంచి డోర్నకల్‌ల మధ్య ఏడు రైళ్లు నడిచేవి. ప్రస్తుతం ఐదు రైళ్లు నడుస్తున్నాయి. సత్తుపల్లి మార్గం అందుబాటులోకి వచ్చాక గూడ్స్ ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో కొత్త రైళ్లు నడిపించడం కష్టంగా మారింది. డబ్లింగ్ పనులు పూర్తయితే కనీసం కొత్తగూడెం నుంచి డోర్నకల్ మధ్య ప్రస్తుతం ఉన్న రైళ్లు ఆలస్యం కాకుండా నడిచేందుకు వీలవుతుంది. అదే విధంగా తిరుపతి, షిర్డీ, నిజామాబాద్, మంచిర్యాల, గుంటూరు తదితర పట్టణాలకు మరిన్ని రైళ్లు నడిపించేందుకు వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment