టికెట్ రద్దుకు నగదు రీఫండ్ లేదు
Published Fri, Nov 11 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
న్యూఢిల్లీ: చిన్న నోట్ల కొరత, బుకింగ్ కౌంటర్లలో పెరిగిన రద్దీతో టికెట్ రద్దుచేసుకునే వారికి నగదు తిరిగి చెల్లించడాన్ని రైల్వే శాఖ నిలిపివేసింది. బదులుగా ప్రయాణికులకు టికెట్ డిపాజిట్ రసీదులను జారీ చేస్తోంది. రీఫండ్ మొత్తం రూ.10 వేలు దాటితే ఆ సొమ్మును వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అందుకోసం టికెట్ రద్దుచేసుకునే సమయంలో ప్రయాణికుడు తన బ్యాంకుఖాతా వివరాలను అందించాలి. కౌంటర్ టికెట్ల అమ్మకాల్లో 13 శాతం పెరుగుదల వల్ల ఈ-టికెట్ వ్యాపారం రెండురోజుల్లో 10 శాతం పడిపోయింది.
విమాన టికెట్లకు రిఫండ్ వద్దు
రద్దైన పాత నోట్లతో విమానాశ్రయ కౌంటర్లలో తీసుకున్న టికెట్లను రద్దుచేయవద్దని కేంద్రం విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ టికెట్లకు సంబంధించి టికెట్లను రిఫండ్ కూడా చేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. అవినీతిపరులు టికెట్లు బుక్ చేసుకున్నాక రద్దుచేసుకుని డబ్బులు తీసుకునే అవకాశముందన్న వార్తలతో డీజీసీఏ అప్రమత్తమైంది. దీంతో ఇలా పాత నోట్లతో టికెట్లు బుక్ చేసుకున్న వారి టికెట్లను రద్దుచేయవద్దని, రీఫండ్ కూడా చేయొద్దని ఆదేశించింది. దీంతో పలు సంస్థలు 48 గంటలకు ముందు టికెట్ తీసుకున్న ప్రయాణికులకు రీఫండ్, రద్దు విషయంలో స్పష్టమైన సమాచారమిచ్చాయి.
Advertisement