ముంబైలోని బాంద్రా స్టేషన్ వద్ద బిహార్, బెంగాల్ వలస కార్మికులు
న్యూఢిల్లీ: జూన్ 30వ తేదీ వరకు రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది. నాన్ ఏసీ, సెకండ్ క్లాస్ బోగీలుండే ఈ రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని తెలిపింది. శ్రామిక్ రైళ్లు, రాజధాని రూట్లలో నడిచే ఏసీ స్పెషల్ రైళ్లకు ఇవి అదనమని వివరించింది. అన్ని కేటగిరీల ప్రయాణికులు వీటికి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇవి ఏఏ మార్గాల్లో నడుస్తాయో త్వరలోనే ప్రకటిస్తామంది. శ్రామిక్ రైళ్లలో అవకాశం దొరకని వలస కార్మికులు వీటిని ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఒకటీరెండు రోజుల్లో శ్రామిక్ రైళ్ల సంఖ్యను రోజుకు 400కు పెంచుతామని, కాలినడకన రోడ్ల వెంట వెళ్లే వారిని గుర్తించి, దగ్గర్లోని ప్రధాన రైల్వే స్టేషన్‌కు తరలించాలని రాష్ట్రాలను కోరింది. వారి జాబితాను రైల్వే శాఖ అధికారులకు అందజేస్తే సొంతూళ్లకు శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.
శ్రామిక్ రైళ్లకు అనుమతి అక్కర్లేదు
దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్ రైళ్లకు సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీనిపై హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది. బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లను రానివ్వడం లేదంటూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈనెల ఒకటి నుంచి 1,565 శ్రామిక్ రైళ్ల ద్వారా 20 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారంది.
Comments
Please login to add a commentAdd a comment