రామగుండంకు అర్ధరాత్రి చేరుకున్న భాగ్యనగర్ రైలు
పెద్దపల్లి: సాధారణ, మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చు.. భద్రతతో కూడిన రైలులో సకాలంలో గమ్యం చేరేందుకు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాజీపేట–సిర్‌పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్– సిర్‌పూర్‌కాగజ్‌నగర్ మధ్య నడిచే రామగిరి, పుష్‌పుల్, ఇంటర్‌సిటీ, సింగరేణి ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 98 కిలోమీటర్ల దూరంలో కాజీపేట, 220కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్, ని జామాబాద్ వెళ్లేందుకు పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు.
ట్రాక్ పనులు చేపడితే రద్దే..
కరీంనగర్, కాజీపేట– కాగజ్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడితే గతంలో ఒకటి రెండు రైళ్లను నడిపించిన రైల్వేశాఖ.. ప్రస్తుతం వారం రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తోంది. ఆర్టీసీ బస్సు చార్జీలతో పోల్చితే నాలుగో వంతు రైలు చార్జీలు ఉండడంతో సాధారణ, నిరుపేద ప్రయాణికులు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. కాగా గంటల తరబడి రైళ్ల ఆలస్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎక్స్‌ప్రెస్, గూడ్సులకే మొదటి ప్రాధాన్యం
క్రమంగా పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా రైల్వే ట్రాక్స్ విస్తరిస్తున్న రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగించే క్రమంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు మొదటగా పంపించేందుకు వీటిని గంటల తరబడి నిలిపివేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. గూడ్స్ రాకపోకలతో వందలాది కోట్ల ఆదాయం ఉండగా, రైల్వేశాఖ సేవా దృక్పథాన్ని మరిచి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనే విమర్శలు మూటగట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment