రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దేశంలో కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్ తరువాత విడతల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అనవసర ప్రయాణాన్ని తగ్గించే ఉద్దేశంతో అదనపు చార్జీలు విధించి ‘సున్నా’ నంబర్‌తో మొదలయ్యే ప్రత్యేక రైళ్లను తొలుత దూర ప్రాంతాల మధ్య నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లను నడపడం ప్రారంభించింది. దాదాపు అన్ని ప్యాసింజర్ రైళ్లు ప్రత్యేక రైళ్ల పేరుతో నడుస్తున్నాయి.
ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండటంతో పాటు రైల్వేశాఖ ప్రత్యేక ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు కూడా ఉండవు. దీంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ ఇప్పటి నుంచి విడతల వారీగా ప్రత్యేక రైళ్ల స్థానంలో కరోనాకు ముందు ఉండే విధంగా సాధారణ రైలు నంబర్లతో, పాత చార్జీలతోనే రెగ్యులర్ రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2021 రైల్వే టైంటేబుల్ ప్రకారం దాదాపుగా అన్ని రైళ్లు రెగ్యులర్ రైళ్లుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మరో రెండు వారాలు పొడిగింపు
నరసాపురం: గత మూడు ఆదివారాలుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో రెండు వారాలు పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు ఈ నెల 21, 28 తేదీల్లో కూడా నడుస్తుందని నరసాపురం రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు మంగళవారం తెలిపారు. 07455 నంబర్‌తో ఈ రైలు సాయంత్రం ఐదు గంటలకు నరసాపురంలో బయలుదేరి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటిరోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment