సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఆప్టా) చర్యలు చేపడుతోంది. బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌కు అనుగుణంగా పర్యావరణ హితంగా, అందంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో ఆధునిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రాజెక్టు డిజైన్ల కోసం ఆర్కిటెక్ట్ పోటీలను నిర్వహిస్తోంది.
ఆర్కిటెక్ట్ సంస్థలతోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ (సీవోఏ)లో రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ)లో రిజిస్టర్డ్ ప్లానర్లు, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల (వ్యక్తిగత/బృందాలుగా)నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ)ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి ఉత్తమ ఆర్‌ఎఫ్‌పీలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించనుంది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాలను https://tourism.ap.gov.in/tenders వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అభివృద్ధి ప్రణాళిక ఇలా...
తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో సుమారు 1,500 మీటర్లు చొప్పున అభివృద్ధి చేయనున్నారు. ఈ బీచ్‌లను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతోపాటు స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వ్యూ పాయింట్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, టూరిస్ట్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ రిసెప్షన్ సెంటర్, రెస్క్యూ, వైద్య సౌకర్యాలు, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తారు.
మరోవైపు పశ్చిమగోదారి జిల్లా పేరుపాలెంలో 104 ఎకరాల్లో, పల్నాడు జిల్లా నాగులవరంలో 250 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో బీచ్ కాటేజీలు, హోటళ్లు, రిసార్ట్స్, సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్లు, థీమ్ పార్క్, వ్యూ పాయింట్లు, టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వంటివి ఆధునిక
సౌకర్యాలో ఏర్పాటు చేయనున్నారు.
నగదు బహుమతులు ఇలా..
ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి వచ్చిన మొదటి మూడు ఉత్తమ ఎంపికలకు రూ.1,50,000, రూ.1,00,000, రూ.75,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. సీవోఏ రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఐటీపీఐ రిజిస్టర్డ్ ప్లానర్ నుంచి వచ్చిన ఉత్తమ డిజైన్‌లకు రూ.1,00,000, రూ.75,000, రూ.55,000 చొప్పున, విద్యార్థి విభాగంలో విజేతలకు రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రతిభగల ఆర్కిటెక్ట్‌లకు ఆప్టాతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు.
చదవండి: సైన్యం సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment