రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిర్లిప్త వైఖరి, ఇరిగేషన్ శాఖ ఏకపక్ష ధోరణి పాపికొండల పర్యాటకులకు శాపంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల పర్యటన ప్రారంభమైన పన్నెండేళ్ల తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్యక్షతన రెగ్యులేటరీ ఆథారిటీ కమిటీ సమావేశం జరిగింది. పటిష్ట ప్రణాళికలేవీ లేవనే విషయం జేసీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన వివిధ శాఖల అధికారులు, బోటు యజమానుల సమావేశంలో తేటతెల్లమైంది. నిరంతర పక్రియగా సాగాల్సిన పర్యవేక్షణలు ప్రమాద ఘటనలు జరిగిన తరువాత మాత్రమే గుర్తుకు వస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ బోటు యజమానుల బోట్ల నిర్వహణపై తనిఖీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు జారీ చేయడంలో చర్యలకు దిగిన తహసీల్ధార్ నివేదికలను ఇరిగేషన్ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమన్వయలోపం కనిపిస్తోంది. మంగళవారం అంగుళూరులో అధిక లోడుతో ఉన్న మూడు బోట్లను తహసీల్ధార్ గుర్తించినా చర్యలు చేపట్టడంలో ఇరిగేషన్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇరిగేషన్ ఈఈని వివరణ కోరినా ఇంకా నివేదిక రాలేదని చెబుతుండటం...చర్యలు చేపట్టడంలో సన్నాయి నొక్కులు నొక్కుతుండడంతో ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
జాడలేని రెగ్యులేటరీ అధారిటీ కమిటీ...
బోటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం, డ్రైవర్, సరంగు లైసెన్స్ మంజూరు చేయడంలో అధికారులు అమ్యామ్యాలకు లొంగిపోతూ నచ్చిన వారి బోట్లకు అనుమతులు మంజూరుచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీకీ తెలియకుండా ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో టూరిజం టిక్కెట్ ధర ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు పెంచుకుంటున్నారు. పర్యాటక బోట్లలో ఏ ఇబ్బందులు తలెత్తినా పురాతన బ్రిటిష్ చట్టం ఆధారంగా బోటు సూపరింటెండెంట్ మాత్రమే చర్యలు చేపట్టాలనే నిబంధన మిగిలిన శాఖల అధికారుల పాత్రను డమ్మీగా చేసింది. అంగుళూరు బోటింగ్ పాయింట్‌లో నిత్యం వేలాదిమంది పర్యాటకులు రాకపోకలు సాగిస్తున్నా కనీసం మెట్లు సదుపాయం కూడా లేదు. లైటింగ్ సౌకర్యం అంతంతమాత్రమే. పర్యాటక శాఖ అధ్వర్యంలో ఉన్న మూడు బోట్లను కూడా నడపలేని దుస్థితిలో ఉండటంతో ప్రయివేట్ బోట్లు జోరందుకున్నాయని అభిప్రాయపడుతున్నారు. పాపికొండల పర్యటనకు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ పొందిన పర్యాటకులను ప్రయివేట్ బోట్లలో పంపిస్తున్నారంటే టూరిజం శాఖ దీనావస్థ బయటపడుతోంది.
బుట్టదాఖలైన ఏకగవాక్ష విధానం
ఏడాదిన్నర క్రితం టూరిజంలో సమస్యలు తలెత్తినపుడు పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లన్నింటినీ టూరిజం శాఖ ద్వారా పంపేందుకు సింగిల్ విండో (ఏకగవాక్ష విధానం) అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటి టూరిజం ఎండీ ఆధ్వర్యంలో బోటు నిర్వాహకులతో సమీక్ష నిర్వహించిన అధికారులు తరువాత రోజుల్లో ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కృష్ణా జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంతో మళ్లీ బోట్ల నిర్వహణ విషయంలో ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయాలనే విషయం తెరమీదకు వచ్చింది. ఈ హడావుడి ఎన్నాళ్లు కొనసాగుతుందో వేచి చూడాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment