సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శామీర్‌పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. షామీర్‌పేట చెరువు ఏడాది పొడవునా నీటితో నిండి ఉండేలా చర్యలు తీసుకోవాలని.. పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా దీనిపై ప్రణాళికను రూపొందించి, పూర్తి నివేదిక అందజేయాలన్నారు.సీఎం కేసీఆర్ షామీర్‌పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే అంశంపై ప్రగతిభవన్‌లో టూరిజం డెవలప్‌మెంట్ ఎండీ మనోహర్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులతో చర్చించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్‌పేట చెరువుకు.. అక్కడి నుంచి కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు అందుతాయని చెప్పారు. అటు షామీర్‌పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటకశాఖ మంచి అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఈ ప్రాంతం ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తారన్నారు. పర్యాటకుల కోసం కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట పూల చెట్లు పెంచాలని తెలిపారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్యనున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment